అవినీతి'గిరి' | Nellore MLA Bollineni Srinivasarao Special Story | Sakshi
Sakshi News home page

అవినీతి'గిరి'

Published Wed, Dec 26 2018 1:32 PM | Last Updated on Wed, Dec 26 2018 1:32 PM

Nellore MLA Bollineni Srinivasarao Special Story - Sakshi

ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్లినేని రామారావు అండతో అధికార పార్టీ నేతలు అవినీతి అక్రమాలతో చెలరేగిపోయారు. టీడీపీ  నాలుగున్నరేళ్ల పాలనలో పలు అభివృద్ధి పనుల్లో అక్రమాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ స్థలాలు, భూములు కబ్జా చేశారు. ఫైబర్‌ చెక్‌డ్యాంల నిర్మాణాల్లో అవినీతికి పాల్పడి రూ.కోట్లు దోచుకున్నారు. ఎమ్మెల్యే వెంకటరామారావు మహారాష్ట్రలోని విదర్భ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ పనుల్లో చేసిన అవినీతి ఫార్ములాను ఉదయగిరి నియోజకవర్గంలో పక్కాగా అమలుచేశారు. ఫైబర్‌ చెక్‌డ్యాంల పేరుతో రూ.కోట్ల అవినీతికి పాల్పడ్డారు.

ఉదయగిరి నియోజకవర్గంలో రూ.105 కోట్లతో 280 ఫైబర్‌ చెక్‌డ్యాంలు నిర్మించారు. రూ.10 లక్షలు అంచనా వ్యయమయ్యే పనులను అమాంతం దాని విలువ రూ.కోటికి పెంచి అడ్డగోలుగా పనులు చేసి భారీ మొత్తంలో జేబులు నింపుకున్నారు. ఈ పనుల్లో పది శాతం ఎమ్మెల్యే కమీషన్‌ తీసుకుని నియోజకవర్గంలోని వివిధ మండల స్థాయిలో ఉన్న టీడీపీ నేతలకు పనులు కేటాయించారు.

సాక్షిప్రతినిధి, నెల్లూరు :టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గాన్ని తెలుగుతమ్ముళ్లు దోచేశారు. ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు అండ చూసుకుని ప్రతి పథకంలోనూ అవినీతికి పాల్పడ్డారు. రూ.కోట్లు స్వాహా చేశారు. చోటా నాయకుడి నుంచి జిల్లా నాయకుడి వరకు అందరూ ప్రజల సొమ్మును హారతి కర్పూరం చేశారు. ప్రభుత్వ స్థలాలు, భూములను కబ్జా చేశారు. పింఛన్ల మంజూరులో చేతివాటం ప్రదర్శించారు. అవసరం లేకపోయినా నీరు – చెట్టు పేరుతో చెక్‌డ్యాంల నిర్మాణం, కాలువలు, చెరువుల్లో పూడికతీత, చెరువుకట్టల అభివృద్ధి తదితర పనులను గ్రామస్థాయి కార్యకర్తలకు కాసులపంట పండించే విధంగా రూపకల్పన చేశారు. ఎక్కడైనా చిన్న వాలు కనిపిస్తే అక్కడ ప్రొక్లెయిన్లు పెట్టి పూడికతీత పనులు తూతూమంత్రంగా చేసి విచ్చలవిడిగా దోచుకున్నారు.  జిల్లాలో సంచలనం సృష్టించిన పసుపు కుంభకోణంలో టీడీపీ నేతల ప్రమేయం ఉంది. అవినీతిపై ఎన్ని విమర్శలు వచ్చినా లెక్క చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారు.

అవినీతి సంస్థానానికి ఆయనే రాజు
ఉదయగిరి నియోజకవర్గంలో ఇసుకతో మొదలుపెట్టి కొత్త టెక్నాలజీ వర్కులుంటూ భారీగా ప్రతి దానిలో దండుకున్నారు. బొల్లినేని రామారావు 2014 ఎన్నికలకు ముందు కాంట్రాక్టర్‌. ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యాక ఆయన, ఆయన ముఖ్య అనుచరగణంతో పాటు తెలుగుతమ్ముళ్లు ఇక మనకు తిరుగులేదనే రీతిలో అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించారు. బొల్లినేని మహారాష్ట్రలోని నాగపూర్‌లో పనులకు సంబంధించి ఏసీబీ కేసు నమోదైంది. ఆయన అనుచరులు పసుపు కొనుగోళ్లలో రూ.కోట్లు మింగిన క్రమంలో వారందరిపై స్థానికంగా క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. కేసులు పెట్టాక జోరు తగ్గకపోగా రెట్టింపు స్థాయిలో అవినీతి చేయడం గమనార్హం

ఎమ్మెల్యేపై ఏసీబీ కేసు
2006 సంవత్సరం నవంబర్‌ 6వ తేదీన విదర్భలో బొల్లినేని రామారావు, ఆర్‌.శ్రీనివాసరెడ్డిలు రూ.130 కోట్ల వర్కును ప్రారంభించారు. నిబంధనలకు విరుద్ధంగా 2007లో దాని విలువను రూ.145 కోట్లకు పెంచారు. ఇలా పెంచుకుంటూ పోయి రూ.1,549 కోట్ల వర్కుగా చేసి భారీగా దోచుకున్నారు. ఈ వ్యవహారంపైనే మొదట ఏసీబీ కేసు కూడా నమోదైంది.   విచారణలో పనుల విలువ పెంచి భారీగా స్వాహా చేశారని రుజువు కావడంతోనే కేసు నమోదు చేశారు. మొత్తం అక్కడ పనులు నిర్వహించిన ఏడుగురు కాంట్రాక్టర్లపై కేసులు పెట్టారు. తాజాగా కూడా పాత కేసులకు కొనసాగింపుగా ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ 0203/2017 కింద కేసు మçహాæరాష్ట్రలోని నాగపూర్‌లో ఉన్న సర్దార్‌ పోలీసు స్టేషన్‌లో ఏసీబీ నివేదిక ఆధారంగా కేసు నమోదుచేసి విచారణ సాగిస్తున్నారు. ఈ కేసులో ప్రభాకరవిఠల్‌ మోర్గాడే, శ్యాం జగ్గదేవ్‌ అంబల్‌కేర్, దీలిప్‌ పోయేకర్, స్వప్న రామసాత్‌ సూర్యవంశీ, షాహిదాస్‌ మారుతీ లగడేలతోపాటు ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, అతని భాగస్వామి రామిరెడ్డి శ్రీనివాసరెడ్డిలుపై కేసు నమోదై విచారణ పర్వం సాగుతోంది.

అవసరం లేకున్నా పనులు చేసి..
నియోజకవర్గంలో అధికంగా దోపిడీ జరిగిన వాటిలో నీరు – చెట్టు పథకం ఒకటి. అన్ని మండలాల్లో కలిపి రూ.132 కోట్లు పనులు జరిగాయి. వీటిలో చెక్‌డ్యాంల నిర్మాణం, కాలువలు, చెరువుల్లో పూడికతీత, చెరువుకట్టల అభివృద్ధి తదితర పనులున్నాయి. పనులు నాసిరకంగా చేసి, అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి బిల్లులు చేసుకున్నారు.
సాధారణంగా  వర్షాలు పడితే వంకల ద్వారా వాలు ప్రాంతాలకు నీరు చేరుకుంటుంది. కానీ ఆ వంకలనే ఆదాయ వనరులుగా మార్చుకుని పూడికతీత పనుల పేరుతో భారీ దోపిడీకి పాల్పడ్డారు. వరికుంటపాడు మండలంలోని ఇరువూరు, కృష్ణంరాజుపల్లి, కొండాయపాళెం, మహ్మదాపురం, గణేశ్వరాపురం, వరికుంటపాడు, జడదేవి, ఉదయగిరి మండలంలో బిజ్జంపల్లి, కొత్తపల్లి, జీ చెరువుపల్లి. కొండాపురం మండలంలోని గరిమెనపెంట, కొమ్మి, తదితర చోట్ల ఈ విధంగా జరిగింది.
చెరువు పూడికతీత పేరుతో గతంలో ఎప్పుడో రైతులు, స్థానికులు తమ అవసరాల కోసం సొంతంగా తీసుకెళ్లిన మట్టి గుంతలను లెక్కలో చూపించి పెద్దమొత్తంలో దోచేశారు. పనులు చేయకుండానే చేసినట్లుగా అధికారులు రికార్డుల్లో నమోదుచేసి అధికార పార్టీ నేతలకు లాభం చేకూర్చారు. దుత్తలూరు మండలంలోని నందిపాడు చెరువు, కొండాపురం మండలంలోని కొమ్మి చెరువు, వింజమూరు మండలంలోని పాతూరు చెరువుకు సంబంధించి ఈ పరిస్థితి ఉంది. సుమారు రూ.50 లక్షల అవినీతి చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు.
చెరువుకట్టల అభివృద్ధి పేరుతో తూతూమంత్రంగా పనులు చేయడంతో కొద్దిపాటి వర్షానికే కట్ట పనుల్లో డొల్లతనం బయటపడి బీటలు వారాయి. చెక్‌డ్యాంల పేరుతో జరిగిన దోపిడీ అంతాఇంతా కాదు. నిబంధనలు పూర్తిగా గాలికొదిలేసి తూతూమంత్రంగా పనులుచేసి అధికారులపై ఒత్తిడితెచ్చి ఎం బుక్‌లు రికార్డ్‌ చేయించుకుని నిధులు మింగేశారు. ఈ పనుల్లో చాలావరకు ఏడాది గడవకముందే నాణ్యతా లోపం బయటపడింది. ఉదయగిరి మండలంలోని తిరుమలాపురం చెరువు, కృష్ణంపల్లి చెరువు, లింగాలదొన చెరువు, వరికుంటపాడు మండలంలోని సాతుపల్లి చెరువు, గణేశ్వరరాపురం, నారసింహాపురం చెరువు, తిమ్మారెడ్డిపల్లి చెరువు తదితరచోట్ల పనులను అధ్వానంగా జరిగియి.

ఇసుక తవ్వేశారు
పిల్లాపేరులో ఇసుకను ఈ నాలుగేళ్లలో అధికార పార్టీ నేతలు హారతి కర్పూరంలా హరించేశారు. పిల్లాపేరుకు అటూ ఇటూ 55 కిలోమీటర్ల మేర తవ్వారు. వేల క్యూబిక్‌ మీటర్లు తవ్వారు. సగటున ఒక ఒక్కో క్యూబిక్‌ మీటర్‌కు అతితక్కువ ధర వేసుకున్న ఇసుక రూ.300 వరకు ఉంటుంది. సుమారు రూ.150 కోట్ల మేర అవినీతి చోటుచేసుకున్నట్లు  అంచనా. అధికారికంగా ఎలాంటి అనుమతి లేకున్నా ఇసుకకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే అనుచరులు, నాయకులు తరలించి సొమ్ము చేసుకున్నారు.    దీంతో ప్రస్తుతం పిల్లాపేరు పూర్తి రూపాన్నే కోల్పోయింది. ఇసుకతిన్నెలు మటుమాయయ్యాయి. పిల్లాపేరు పరివాహక ప్రాంతంలో ఇసుక నిల్వలు పూర్తిగా హరించుకుపోవడంతో భూగర్భజలం అడుగంటి నీరు ఊరక వందలాది ఎకరాలు బీడు భూములుగా మారాయి. వింజమూరు, ఉదయగిరి, ప్రకాశం జిల్లా పామూరు తదితర ప్రాంతాలకు ఎక్కువగా ఇసుక తరలివెళ్లింది.

మితిమీరిన జన్మభూమి కమిటీల పెత్తనం
టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీలను ఏర్పాటుచేసి అర్హులకు పథకాలు అందకుండా చేసింది. గ్రామాల్లో పింఛన్ల మంజూరు, పక్కాఇళ్ల ఎంపిక, అభివృద్ధి పనుల గుర్తింపు సర్వం అధికారాలు వారికే ఇచ్చారు. బ్యాంకు రుణాల లబ్ధిదారుల ఎంపికలో కూడా ఈ కమిటీలకే పెత్తనం కట్టబెట్టారు. దీంతో చాలా గ్రామాల్లో జన్మభూమి కమిటీ సభ్యులు లంచాలు, కమీషన్లు తీసుకుని లబ్ధిదారులను ఎంపిక చేశారు. అన్ని అర్హతలున్న వారికి ప్రజా సంక్షేమ ఫలాలు అందకుండా కమిటీలు చక్రం తిప్పాయి. తమ ఆర్థిక అవసరాలు తీర్చిన వారికి టీడీపీ సానుభూతిపరులకు ప్రభుత్వ పథకాలు అందజేయడంలో కీలకంగా వ్యవహరించారు. 

యథేచ్ఛగా భూ దోపిడీ
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకులు ప్రభుత్వ భూములు, స్థలాలను ఇష్టానుసారంగా కబ్జా చేశారు. నియోజకవర్గంలో సుమారు 300 ఎకరాల ప్రభుత్వ భూమి అధికార పార్టీ నేతలు, గ్రామస్థాయి నేతలు కబ్జాకు గురిచేశారు. వీటి విలువ సుమారు రూ.20 కోట్లకు పైనే ఉంటుందని అంచనా.
వింజమూరు  మండలం లో జిల్లా టీడీపీ అధికార ప్రతి నిధి దంతులూరి వెంకటేశ్వరరావు రావిపాడు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 272, తదితరాల్లో సుమారు 100 ఎకరాలు తమ స్వాధీ నంలో ఉంచుకున్నారు. ఇందులో కొంతభాగం కోర్టు ఉత్తర్వుల మేరకు రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు నోటీసుబోర్డు పెట్టినా ఆ భూమంతా సదరు ఆక్రమణదారుడి చేతుల్లోనే ఉంది.
చాకలికొండకు రోడ్డుకు ఆనుకుని ఉన్న రూ.కోట్ల విలువచేసే విలువైన భూమిలో బత్తాయిచెట్లు సాగులో ఉన్నా దానిజోలికి వెళ్లేందుకు రెవెన్యూ అధికారులు సాహసించడం లేదు.
వింజమూరు మండలం గుండెమడకలకు చెందిన టీడీపీ నేత గాలి నరసపునాయుడు ఆదీనంలో రూ.50 లక్షల విలువచేసే 20 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాహా చేశారు.
కొండాపురం మండలం కొమ్మి ప్రాంతంలోని బంగారప్ప చెరువును దేవినేని వెంకటసుబ్బయ్య రూ.30 లక్షల విలువచేసే పదెకరాల భూమిని స్వాహా చేశారు.
ఉదయగిరి మండలం కొండాయపాళెం పంచాయతీలో టీడీపీ నేత మన్నేటి వెంకటరెడ్డి కొంత స్థలాన్ని ఆక్రమించి ఇళ్లు నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోలేదు.
వరికుంటపాడు మండలంలోని తూర్పురొంపిదొడ్ల, వేంపాడు, మహ్మదాపురం, విరువూరు, కొండాయపాళెం, కృష్ణంరాజుపల్లి, తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూములను అధికార పార్టీ నేతలు కబ్జాచేసి సాగు చేసుకుంటున్నారు.
కొండాపురం మండలం కొమ్మి, గొట్టిగుండాల, కొండాపురం, చింతలదేవి, తదితర గ్రామాల్లో  భూములను ఆక్రమించి సాగుచేస్తున్నారు.

కింది చిత్రంలో కనిపిస్తున్న భూమి వరికుంటపాడు మండలం గణేశ్వరాపురం గ్రామంలోని బత్తిని గురవమ్మకు చెందినది. 4.50 విస్తీర్ణం గల ఈసీజేఎఫ్‌ఎస్‌ భూమిని అధికార టీడీపీ నేత పేరం సుధాకర్‌రెడ్డి ఆక్రమించి సాగుచేసుకుంటున్నారు.   డీఫారం పట్టా ఇవ్వాలని భూమి హక్కుదారురాలైన గురవమ్మ ప్రభుత్వ అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదు. భూమిలోకి లబ్ధిదారురాలను దిగనివ్వకుండా సదరునేత అడ్డుకుని వరిపైరు సాగుచేస్తున్నారు. సుమారు. రూ.20 లక్షల విలువగల భూమిని అధికారం అడ్డుపెట్టుకుని ఆక్రమించుకున్నారు. సదురు నాయకుడే నీరు – చెట్టులో రూ.2 కోట్లు విలువచేసే పనులను నాసిరకంగా చేసి రూ.50 లక్షలకు పైగా అవినీతికి పాల్పడ్డాడు. ఉపాధిహామీలో మొక్కల పెంపకం పేరుతో రూ.4 లక్షలు స్వాహాచేశాడు. పక్కాగృహాలు, మరుగుదొడ్లు ఫాంపాండ్స్, సిమెంట్‌రోడ్లు తదితర పనుల్లో రూ.30 లక్షలుపైగా అవినీతికి పాల్పడ్డాడనే విమర్శలున్నాయి.

ఉపాధి పనుల్లోనూఅదే అవినీతి
కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు అందజేసే జాతీయ ఉపాధిహామీ పథకం తెలుగుతమ్ముళ్లకు వరంలా మారింది. లబ్ధిదారులకు చెందాల్సిన నగదు నేతలు తమ జేబుల్లో నింపుకున్నారు. అవెన్యూ ప్లాంటేషన్, మరుగుదొడ్ల నిర్మాణం, నాడెప్‌ల నిర్మాణం, డంపింగ్‌యార్డులు, పంటకుంటలకు సంబంధించి కూలీలకు బదులుగా యంత్రాలతో చేయించి బినామీ మస్టర్లతో మెక్కేశారు. సప్లయ్‌దారుడు పేరుతో తమ్ముళ్లు కాంట్రాక్టర్ల అవతారమెత్తి, మరుగుదొడ్లు, నాడెప్‌లు పలుచోట్ల నిర్మించకుండానే నగదు స్వాహా చేశారు. అవెన్యూ ప్లాంటేషన్‌ పేరుతో జరిగిన అవినీతి అంతాఇంతా కాదు. తూతూమంత్రంగా రోడ్డుకిరువైపులా మొక్కలు నాటి పర్యవేక్షణ, నీరు పోసే పేరుతో రూ.లక్షలు దిగమింగారు. ఏడాది గడిచిన తర్వాత చూస్తే మొక్కలు కనిపించలేదు. వరికుంటపాడు మండలంలోని గణేశ్వరాపురం, తోటలచెరువుపల్లి, దుత్తలూరు మండలంలోని నాయుడుపల్లి పంచాయతీల్లో అవెన్యూ ప్లాంటేషన్‌ పేరుతో నిధులు స్వాహా చేశారు. మరుగుదొడ్లను పలుచోట్ల తూతూమంత్రంగా నిర్మించి నిధులు కాజేశారు. ఉదయగిరి మండలంలోని ఉదయగిరి, కొండాయపాళెం, జీ చెరువుపల్లి, దుత్తలూరు మండలంలోని కొత్తపేట, వరికుంటపాడు మండలంలోని గణేశ్వరాపురం, వింజమూరు మండలంలోని లెక్కలవారిపాళెం, జనార్దనపురం పంచాయతీల్లో ఉన్నవాటినే మళ్లీ నిర్మించినట్లుగా చూపించి నిధులు స్వాహా చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement