సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అందరికీ కాలుష్యం లేని స్వచ్ఛ ఇంధనం అందించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంకల్పం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, వినియోగానికి పెద్ద పీట వేస్తోంది. ఇందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) స్వచ్ఛ ఇంధనాన్ని ప్రోత్సహించేందుకు కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది. సౌర, పవన, జల విద్యుత్ వంటి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని ప్రోత్సహించి, వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు విద్యుత్ చట్టంలో మార్పులు చేస్తూ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్, ఛార్జీలు, బ్యాంకింగ్ నిబంధనలను రూపొందించింది.
ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నియంత్రణ 2023 పేరుతో డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్‌ను తయారు చేసింది. ఈ నెల 21 నుంచి నూతన మార్గదర్శకాలు రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వస్తాయి. దేశంలో 2070 నాటికి కర్బన ఉద్గారాలను నెట్ జీరో స్థాయికి తేవాలని, దాని కోసం 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామరŠాధ్యన్ని సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి కూడా ఈ మార్గదర్శకాలు దోహదపడతాయని ఏపీఈఆర్‌సీ వెల్లడించింది.
గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ ద్వారా పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడానికి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ 2022లో నిబంధనలు జారీ చేసింది. వాటిని అనుసరించి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, వినియోగదారులు విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 181 (1) ప్రకారం నడుచుకోవడానికి రాష్ట్ర కమీషన్లు చట్ట ప్రకారం నిబంధనలను రూపొందించవచ్చు. ఈ నేపథ్యంలోనే తాజా డ్రాఫ్డ్‌ను తీసుకువచ్చినట్లు ఏపీఈఆర్‌సీ పేర్కొంది. ఈ నియంత్రణ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్తును ఓపెన్ యాక్సెస్ చేయడానికి, ఇంట్రా–స్టేట్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌లు (సరఫరా వ్యవస్థలు), విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు వర్తిస్తుంది.
కొత్త నిబంధనలివీ..
♦ గ్రీన్ ఎనర్జీ నిబంధనల ప్రకారం.. దివాలా తీసిన సంస్థలు, డిస్కంలకు రెండు నెలల కంటే ఎక్కువ కాలం బకాయిలు ఉన్న సంస్థలు, అనధికారికంగా విద్యుత్ వినియోగిస్తున్న సంస్థలు, విద్యుత్ దొంగతనం కేసు పెండింగ్‌లో ఉన్న సంస్థలకు ఓపెన్ యాక్సెస్‌ను పొందడానికి అర్హత లేదు.అరు్హలైన వారికి స్వల్పకాలిక గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్‌ను మంజూరు చేయడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోడ్ డెస్పాచ్ సెంటర్ (ఏపీఎస్‌ఎల్‌డీసీ) నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది.
♦ దీర్ఘకాలిక, మధ్యకాలిక గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ మంజూరు కోసం స్టేట్ ట్రాన్స్‌మిషన్ యుటిలిటీ(ఏపీ ట్రాన్స్‌కో) నోడల్ ఏజెన్సీగా
ఉంటుంది.
♦ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ దరఖాస్తులన్నీ నేరుగా సంబంధిత రాష్ట్ర నోడల్ ఏజెన్సీలకు సింగిల్ విండో ద్వారా వెళతాయి.
♦ సెంట్రల్ నోడల్ ఏజెన్సీ పోర్టల్‌లో గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ సమాచారం మొత్తం ప్రజలకు అందుబాటులో ఉంటుంది.
♦ అన్ని కొత్త గ్రీన్ ఎనర్జీ జనరేటర్లకు కనెక్టివిటీ మంజూరు చేస్తారు
♦వినియోగదారులు, జనరేటర్ల మధ్య ప్రస్తుతం ఉన్న ఒప్పందాలు యధావిధిగా కొనసాగుతాయి. ప్రభుత్వ విధానం ప్రకారం ఓపెన్ యాక్సెస్‌ను కొనసాగించవచ్చు. వారికి సంబంధిత ఒప్పందాలలో పేర్కొన్న విధంగానే ఛార్జీలు వర్తిస్తాయి.
♦ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ కోసం ట్రాన్స్‌మిషన్, వీలింగ్, క్రాస్ సబ్సిడీ సర్‌ఛార్జీలు, స్టాండ్‌బై ఛార్జీలు, బ్యాంకింగ్ ఛార్జీలు, రియాక్టివ్ ఎనర్జీ ఛార్జీలను నిబంధనల మేరకు విధిస్తారు. అయితే ఇవన్నీ అందరికీ వర్తించవు. ఉదాహరణకు 2032 డిసెంబర్‌లోగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పి, ఓపెన్ యాక్సెస్‌లో వినియోగదారులకు సరఫరా చేసే ఆఫ్‌షోర్ విండ్ ప్రాజెక్ట్‌ల నుంచి జరిగే విద్యుత్ ఉత్పత్తికి అదనపు సర్‌ఛార్జి వర్తించదు. దీర్ఘకాలిక, మధ్యకాలిక గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ కోసం ప్రాసెసింగ్ ఫీజు రూ. 1 లక్ష కాగా, స్వల్పకాలానికి రూ.25 వేలు కడితే సరిపోతుంది.
♦ రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ప్రకారం డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ వినియోగదారులకు వార్షిక ప్రాతిపదికన గ్రీన్ సర్టిఫికేట్ అందించాలి.
ఓపెన్ యాక్సెస్ అంటే..
విద్యుత్తు వినియోగదారులు ఎవరైనా వారికి నచ్చిన పునరుత్పాదక ఉత్పత్తి సంస్థ నుంచి నేరుగా కరెంటును పొందే వెసులుబాటు. ఇందుకు ఈ వినియోగదారులు నోడల్ ఏజెన్సీ అనుమతి పొంది తగిన చార్జీలు చెల్లించి ఈ విద్యుత్తును పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment