సాక్షి, భీమవరం: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పాలన సాగిస్తోంది. దీనిలో భాగంగా ఎప్పటికప్పుడు రేషన్ కార్డులు మంజూరు చేస్తోంది. గతంలో రేషన్‌కార్డు పొందాలంటే ఏళ్ల తరబడి ఎదురుచూడటంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారింది. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల కాలంలో ప్రతి ఆరు నెలలకోసారి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నారు.
వలంటీర్ల ద్వారా అర్హులతో దరఖాస్తు చేయించి కార్డులు మంజూరు చేయడంతో పాటు నేరుగా ఇంటికే తీసుకవచ్చి కొత్త కార్డు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా తాజాగా జిల్లాలోని 20 మండలాల్లో అర్హులైన పేదలకు 9,372 బియ్యం కార్డుల పంపిణీ ప్రారంభమైంది. రేషన్ కార్డు మంజూరు నిరంతర ప్రక్రియగా సాగుతుంది. కొత్తగా పెళ్లయినా దంపతులకు, ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి వేరే కాపురం పెట్టినా తక్షణం కొత్త రేషన్‌కార్డు మంజూరు చేస్తున్నారు.
డివిజన్ల వారీగా..
జిల్లాలోని 20 మండలాల్లో ప్రస్తుతం 5,62,395 రేషన్‌కార్డుల ద్వారా ప్రతి నెలా 8,641 టన్నుల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అలాగే తక్కువ ధరకు పంచదార, కందిపప్పును ఇంటి వద్దే రేషన్ వాహనాల ద్వారా అందిస్తున్నారు. గతనెలలో ప్రభుత్వం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో 9,372 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయగా వీటి పంపిణీ ప్రారంభమైంది. భీమవరం రెవెన్యూ డివిజన్‌లో 10 మండలాలకు 4,627, నరసాపురం డివిజన్‌లో 10 మండలాలకు 4,745 కార్డులు మంజూరయ్యాయి. వీరికి వచ్చే నెల నుంచి రేషన్ అందిస్తారు.
గతంలో ఎదురుచూపులు
గతంలో రేషన్ కార్డు కావాలంటే ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. జగనన్న సురక్ష కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వెంటనే రేషన్ కార్డు అందజేశారు. సత్వరమే కొత్త కార్డు జారీ చేయడం చాలా ఆనందంగా ఉంది. –కటికితల వసంతకుమార్,ఏలూరుపాడు, కాళ్ల మండలం
వచ్చేనెల నుంచి రేషన్ పంపిణీ
జిల్లాలో నూతనంగా మంజూరైన 9,372 బియ్యం కార్డుల పంపిణీ చురుగ్గా సాగుతోంది. కొత్త కార్డులు పొందిన వారికి వచ్చేనెల నుంచి ఉచితంగా బియ్యంతోపాటు తక్కువ ధరకు పంచదార, కందిపప్పు అందిస్తాం. ఇప్పటికే జిల్లాలో సుమారు 5.62 లక్షల రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారులకు దాదాపు 8,641 టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నాం. –ఎన్.సరోజ, జిల్లా పౌరసరఫరాల అధికారి, భీమవరం
Comments
Please login to add a commentAdd a comment