సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవ్వా తాతలు, వితంతువులు, దివ్యాంగులు, వివిధ రకాల చేతి వృత్తుల వారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తదితరులకు ఇచ్చే పింఛన్ల సంఖ్య మూడేళ్లగా ఎప్పటికప్పుడు పెరుగుతూ రికార్డులు సృష్టిస్తోంది. ఈసారి కొత్తగా మరో 3,10,222 మంది పింఛను అందుకోనున్నారు. దీంతో వచ్చే ఒకటో తేదీన (ఆగస్టు 1న) పింఛన్లు అందుకొనే వారి సంఖ్య 62,79,486కు చేరింది.
గత అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు వరకు అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 43 నుంచి 44 లక్షల మందికే పింఛన్లు అందేవి. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత అవ్వా తాతలతో పాటు ఇతరులకు ఇచ్చే పింఛన్ల సంఖ్య భారీగా పెరిగింది. గత ప్రభుత్వ హయాంలో పింఛనుదారులలో ఒకరు చనిపోతేనే ఆ స్థానంలో మరొకరికి పింఛన్ ఇచ్చే వారు. అమానవీయమైన ఈ విధానానికి సీఎం జగన్ స్వస్తి పలికారు.
సంతృప్త స్థాయిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ మంజూరు చేసే విధానాన్ని అమలులోకి తెచ్చారు. దీంతో రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛను అందుతోంది. పైగా, పింఛను కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా లబ్ధిదారులు ఉన్న చోటుకే వలంటీర్లు వెళ్లి పింఛను ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో పింఛనుదారులకు వ్యయప్రయాసలు తప్పాయి. ఇప్పటికే పింఛను అందుకుంటున్న వారితో పాటు కొత్త వారికి కూడా వలంటీర్లు వారున్న చోటుకే వెళ్లి డబ్బు పంపిణీ చేస్తారు. కొత్తగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు పింఛను మంజూరు పత్రం, పింఛను కార్డు, పాస్ బుక్‌లను కూడా పంపిణీ చేశారు.
రెండు రోజుల ముందే రూ.1,596.77 కోట్లు విడుదల
ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసే పింఛన్ల డబ్బు రూ.1,596.77 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. 31వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో రెండు రోజుల ముందు శనివారమే ఆ డబ్బు అన్ని గ్రామ, వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతలో జమ చేసినట్టు సెర్ప్ అధికారులు వెల్లడించారు. అధిక శాతం సచివాలయ బాధ్యులు ఆ డబ్బును శనివారమే బ్యాంకుల నుంచి డ్రా చేసి, వలంటీర్లకు అందజేసినట్టు అధికారులు వివరించారు.
Andhra Pradesh: పింఛన్ల పంపిణీలో కొత్త రికార్డు
Published Sun, Jul 31 2022 3:39 AM | Last Updated on Sun, Jul 31 2022 8:08 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment