యాప్‌పై నిమ్మగడ్డ తెలిసే మాట్లాడుతున్నారా? | Nimmagadda Ramesh Kumar Another Controversy In The Name Of Special APP | Sakshi
Sakshi News home page

యాప్‌పై నిమ్మగడ్డ తెలిసే మాట్లాడుతున్నారా?

Published Sat, Jan 30 2021 4:08 AM | Last Updated on Sat, Jan 30 2021 10:45 AM

Nimmagadda Ramesh Kumar Another Controversy In The Name Of Special APP - Sakshi

సాక్షి, అమరావతి: పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలను ‘యాప్‌’ ద్వారా నియంత్రించేందుకు పన్నిన కుట్ర లోతులు.. మెల్లగా బహిర్గతమవుతున్నాయి. ఈ ‘యాప్‌’ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ చెబుతున్న మాటలు, పాటిస్తున్న గోప్యత చూస్తుంటే... అసలీ ఎన్నికల్లో పారదర్శకత మచ్చుకైనా ఉంటుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఈ యాప్‌ జియోలో ఏపీ పంచాయతీ ఎన్నికల పేరిట లభ్యమవుతుందని, దీనికి రికార్డింగ్‌ మెసేజ్‌లు, ఫొటోలు, సందేశాలు పంపవచ్చని శుక్రవారం అనంతపురంలో విలేకరులతో చెప్పారాయన. సందేశం ఇచ్చిన వారికి రిప్లై ఇస్తామంటూ... తొలిసారికే ఇది విజయవంతం కాదని, మూడో దశకల్లా బలపడుతుందని, పట్టు వస్తుందని చెప్పారు.  

ఈ మాటలు విన్నవారికి... ఇలా మాట్లాడుతున్నది ఒక ఎన్నికల కమిషనరేనా? రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న అధికారేనా? అనే సందేహం రాక మానదు. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ మొదలై... తొలి దశ పోలింగ్‌ కూడా సమీపిస్తోంది. ఇప్పటికీ ఈ యాప్‌ గురించి ఎస్‌ఈసీ కార్యాలయంలో నిమ్మగడ్డకు తప్ప ఎవ్వరికీ వివరాలు తెలియవు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని రెండు రోజుల కిందట ‘సాక్షి’తో చెప్పిన నిమ్మగడ్డ కార్యదర్శి... శుక్రవారం నాలిక కర్చుకున్నారు. అలాంటిదేమీ పంపలేదన్నారు.

ఇంకా విచిత్రమేంటంటే... జియోలో యాప్‌ ఉంటుందనే మాటకు అర్థమే లేదు. జియో అనేది బయటి యాప్‌లను హోస్ట్‌ చేసే ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ లాంటి ప్లాట్‌ఫామ్‌ కాదు. ప్రస్తుతానికి అదో మొబైల్‌ నెట్‌వర్క్‌. ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్‌ మాదిరే ఇది కూడా. మరి దీన్లో అధికారిక యాప్‌ను ఎలా ఆవిష్కరిస్తారు? మొదటి దశకు సక్సెస్‌ కాదని, చివరి దశకల్లా పట్టు వస్తుందని చెప్పటమేంటి? అసలీయన తెలిసే మాట్లాడుతున్నారా? లేక బయటి నుంచి ఎవరో చెప్పమన్న మాటలను చెబుతూ... తడబడుతున్నారా? కావాలని తప్పుడు మాటలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారా? 

తనకు కావాల్సిన వారికే లాగిన్‌? 
యాప్‌ వివరాలు తన కార్యాలయంలో కూడా ఎవ్వరికీ తెలియకుండా సొంత వ్యవహారంలా చక్కబెడుతున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌... ఈ యాప్‌ ద్వారా అందే ఫిర్యాదులను తెరిచి చూసుకునేందుకు వీలైన లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను కూడా ఎవ్వరికీ ఇవ్వలేదు. ఇది ఆయనకు, ఆయనకు ఇష్టమైన కొందరు తెలుగుదేశం పార్టీ ముఖ్యులకు మాత్రమే ఉంటుందని విశ్వసనీయంగా తెలియవచ్చింది. లాగిన్‌ తన ఒక్కడి దగ్గరే ఉంటుందన్న విషయాన్ని నిమ్మగడ్డ స్వయంగా జిల్లా కలెక్టర్ల సమావేశంలో చెప్పారు. జిల్లా కలెక్టర్లకు కూడా ఈ యాప్‌ అందుబాటులో ఉంటుంది కానీ... వారికి సీఈసీ పంపిన ఫిర్యాదులు మాత్రమే ఎవరి జిల్లావి వారికి కనిపిస్తాయి. దీనివల్ల సీఈసీ తనకు వచ్చిన ఫిర్యాదుల్లో కావాలనుకున్న వాటిని మాత్రమే కలెక్టర్లకు పంపించే అవకాశం ఉంటుంది. తనకు ఇష్టం లేని ఫిర్యాదుల్ని అక్కడే డిలీట్‌ చేసేయొచ్చు కూడా. ఎక్కడా నిఘా లేకుండా, ప్రభుత్వ అ«దీనంలో కాకుండా ఒక ప్రయివేటు వ్యక్తి మాదిరిగా ఇలా యాప్‌ను నిర్వహించటం అత్యంత ప్రమాదమన్నది ప్రజాస్వామ్య వాదుల మాట. సహజంగా ఇలాంటి టెక్నాలజీ వ్యవస్థల్ని కేంద్ర ప్రభుత్వ అ«దీనంలోని నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ గానీ, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ విభాగం గానీ నిర్వహిస్తుంటాయి. కానీ వేటికీ సంబంధం లేకుండా తనే సొంత యాప్‌ను తయారు చేయించుకుని, తన ఒక్కడి వద్దే లాగిన్‌ ఉంచుకుని ఈయన ఏం చేయాలనుకుంటున్నారు? అసలు పారదర్శకత అనే మాటకు అర్థమైనా తెలుసా? రాజ్యాంగబద్ధమైన పదవిని అడ్డంపెట్టుకుని ఇలా విలువల్ని కాలరాయటం కరెక్టేనా? అన్నది అందరినీ తొలుస్తున్న ప్రశ్న.  

యాప్‌ తయారైందా.. లేదా.. అదీ రహస్యమే!! 
ఈ ఎన్నికల కోసం తానే ప్రత్యేక యాప్‌ తయారు చేయిస్తున్నట్టు చెప్పి నిమ్మగడ్డ ఏడాది కిత్రం పంచాయతీరాజ్‌ శాఖ తయారు చేయించిన నిఘా యాప్‌ను సైతం పక్కన పెట్టాలని ఆదేశాలిచ్చారు. అయితే, నిఘా యాప్‌కు బదులుగా ఆయన చెబుతున్న యాప్‌ ఇప్పటికే తయారైందా.. లేదా అన్నది తేల్చటం లేదు. గోప్యత పాటిస్తున్నారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను అనంతపురంలో శుక్రవారం విలేకరులు అడిగినప్పుడు ఇంకా ఆ యాప్‌ తయారు చేయించడం పూర్తి కాలేదనే చెప్పటం గమనార్హం. మరో పక్క పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా శుక్రవారం ప్రారంభమైంది. 3249 గ్రామాల్లో ఫిబ్రవరి 9వ తేదీన్ల పోలింగ్‌ కూడా జరగబోతుంది. అంటే ఖచ్చితంగా మరో పది రోజులకు మించి సమయం లేదు. మరి ఈయన ఉద్దేశమేంటి? ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తయారు చేసి, తమ అ«దీనంలో నడిపిస్తున్న యాప్‌ను ఈయన వాడతారా? చివరి రోజు వరకూ ఎవ్వరికీ చెప్పకుండా ఇలాగే అందరినీ చీకట్లో ఉంచాలన్నది ఆయన వ్యూహమా? 

‘ఔట్‌ సోర్సింగ్‌’ సిబ్బందిలో టీడీపీ హస్తం! 
ఇటీవలే కమిషన్‌ కార్యాలయంలో ఎన్నికల సెల్‌ను ఏర్పాటు చేశామని చెప్పిన నిమ్మగడ్డ... ఆ సెల్‌కు కేటాయించిన ఫోన్‌ నెంబర్లు మాత్రం గోప్యంగానే ఉంచుతున్నారు. ఎన్నికల కోసం ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా నియమించిన ఉద్యోగులతో కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో 15 మంది లోపే రెగ్యులర్‌ ఉద్యోగుల పనిచేస్తున్నారని.. మరో 20 మంది దాకా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేస్తున్నన్నారని కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. ఇప్పుడు సెల్‌ నిర్వహణ బాధ్యత పూర్తిగా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులే చూస్తున్నారు. వీరిలో కొందరు తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పనిచేసిన వాళ్లు కూడా ఉన్నారని సమాచారం. వారికే ఈ సెల్‌ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు సమాచారం.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement