
సాక్షి, విజయవాడ: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లాల వారీగా అధికారులతో సమీక్షా సమావేశాల్లో భాగంగా, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఫిబ్రవరి 1,2 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇవాళ అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో పర్యటిస్తున్న ఆయన.. రేపు కడప జిల్లాలో పర్యటిస్తారు. ఫిబ్రవరి 1న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్న నిమ్మగడ్డ.. పంచాయితీ ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్షిస్తారు. ఆ రోజు రాత్రికి విశాఖలోనే బస చేసి, మరుసటి రోజు కాకినాడ, ఏలూరు పట్టణాల్లో ఆయా జిల్లాల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం అదే రోజు సాయంత్రానికి తిరిగి విజయవాడకు చేరుకుంటారు.