సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్‌లను బదిలీ చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అడ్డు చెప్పారు. కీలకంగా వ్యవహరించాల్సిన ఈ ఇద్దరినీ ఎన్నికల ప్రక్రియ మధ్యలో బదిలీ చేయడంవల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని ఆయన మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. వారి బదిలీ ప్రతిపాదనను తిరస్కరించిన నిమ్మగడ్డ.. ఆ ఇద్దరిపై ‘సెన్సూర్’ పేరిట క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ మంగళవారం వేరుగా ఆదేశాలు జారీచేశారు. గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా తయారీలో వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. అంతేకాక.. విధి నిర్వహణలో వారు విఫలమైనట్లుగా వారి సర్వీసు రికార్డులో నమోదు చేయాలన్నారు. సెన్సూర్ కింద క్రమశిక్షణ చర్యలంటే ఒక ఏడాదిపాటు పదోన్నతులకు అవకాశం ఉండదని అర్ధం చేసుకోవాలని అధికార వర్గాలు చెప్పాయి.
ప్యానెల్ పేర్లు తిరస్కరణ: మరోవైపు.. ఎన్నికల కమిషనర్ కోరిన మేరకు గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లుగా కొత్త వారిని నియమించేందుకు వీలుగా ముగ్గురేసి అధికారులను ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానల్‌ను కూడా నిమ్మగడ్డ తిరస్కరించారు. ఈ విషయాన్ని సీఎస్‌కు రాసిన లేఖలో ఆయన తెలిపారు. విజిలెన్స్ కేసుల్లేని వారి పేర్లనే సూచించాలన్నారు. అప్పటివరకు వారి బాధ్యతలను ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్–1కు అప్పగించాలని నిమ్మగడ్డ ఆ లేఖలో పేర్కొన్నారు.
ఆ ఇద్దరు కలెక్టర్లు జీఏడీకి..: గుంటూరు కలెక్టరు శామ్యూల్ ఆనంద్, చిత్తూరు జిల్లా కలెక్టరు నారాయణ్ భరత్‌గుప్తాలతో పాటు తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్‌రెడ్డిలను జీఏడీకి సరెండర్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం మూడు వేర్వేరు ఉత్తర్వులు జారీచేశారు. తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు.. గుంటూరు జిల్లా జేసీ దినేష్‌కుమార్‌ను గుంటూరు జిల్లా కలెక్టరుగానూ, చిత్తూరు జిల్లా జేసీ మార్కండేయులను చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో నియమిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్‌కు తిరుపతి అర్బన్ ఎస్పీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఆ ఇద్దరి బదిలీకి ఎస్‌ఈసీ ‘నో’
Published Wed, Jan 27 2021 4:08 AM | Last Updated on Wed, Jan 27 2021 12:57 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment