దుస్తులు ఎంచుకుంటున్న నిరుపేదలు
ఒక చిన్న ఆలోచన.. ఏదైనా మంచి చేయాలనే తపన.. ఎంతో మార్పు తెస్తుంది. మానవత్వం చూపుతుంది. పదిమందికి ఉపయోగపడుతుంది. మరెందరికో ప్రేరణ కలిగిస్తుంది. ఒకటి రెండుగా.. రెండు నాలుగుగా.. సాయం చేసే చేతుల సంఖ్య విస్తరిస్తుంది. ఆర్తులకు అండగా నిలుస్తుంది.
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలో అదో చిన్న పార్కు. చిన్నచిన్న మొక్కలతో కనిపించే ఈ ఉద్యానవనం పెద్ద మనసుతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ పార్కుకి వెళ్తే ‘నీ దగ్గరున్న వస్తువుల్లో నీకు ఉపయోగపడనవి.. వేరొకరికి అత్యవసరం కావొచ్చు. అలాంటి వస్తువుల్ని ఈ పార్కుకు తీసుకురండి.. అవసరమైన వాళ్లకి ఈ పార్కు ఇస్తుంది..’ అని ఒక బోర్డు కనిపిస్తుంది. ‘సమాజం మనకి చాలా ఇచ్చింది. అందుకే మనం తిరిగి ఇచ్చెయ్యాలి. లేదంటే లావైపోతాం..’ ఇటీవల ఒక సినిమాలోని ఈ డైలాగ్ మంచి పాపులర్ అయింది. నిజమే.. మనకు మంచి చేస్తున్న సమాజంలో మంచి పనులు చేస్తే.. పదిమందికి జీవితాన్ని అందించవచ్చు. వాల్ ఆఫ్ కైండ్‌నెస్ పేరుతో విశాఖ మహానగరపాలక సంస్థ (జీవీఎంసీ) శానిటరీ ఇన్‌స్పెక్టర్ చేసిన చిన్న ఆలోచన.. నగరవాసుల పెద్ద మనసుకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఒకప్పుడు బహిర్భూమిగా ఉన్న ఈ స్థలం.. నేడు ఎందరో పేదలకు దుస్తుల్ని, ఇతర సామగ్రిని అందిస్తోంది.
దాతృత్వ నిలయం
జీవీఎంసీ 69వ వార్డు పరిధిలో జాతీయ రహదారి పక్కన బీహెచ్‌ఈఎల్ గోడ వద్ద సుమారు 400 గజాల స్థలాన్ని స్థానికులు పాతికేళ్లుగా బహిర్భూమిగా మార్చేశారు. దీంతో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసేందుకు నిత్యం పారిశుధ్య కార్మికులు శ్రమించాల్సి వచ్చేది. రోజూ ఈ పరిస్థితి చూస్తున్న శానిటరీ ఇన్‌స్పెక్టర్ బోయిన శ్రీనివాసరావు వినూత్నంగా ఆలోచించారు. ఆ ప్రాంతాన్ని పార్కుగా మార్చాలని భావించారు. అనుకున్నదే తడవుగా ఈ ప్రాంతాన్ని పార్కుగా మార్చేందుకు భెల్ యాజమాన్యం నుంచి అనుమతులు తీసుకున్నారు. స్థలాన్ని చదును చేసి మొక్కలు నాటించారు. తన జీతంలో కొంత మొత్తాన్ని వెచ్చించి ఫ్లెక్సీలు, గోడకు రంగులు వేయించారు. గేటు మాత్రమే ఉండి.. సరైన కంచె లేకపోవడంతో ఇక్కడ నాటిన పూల మొక్కలకు, నాపరాళ్లకు రక్షణ ఉండేదికాదు.
ఈ పార్కును దయగల పార్కుగా మార్చాలని భావించిన శ్రీనివాసరావు అక్కడ వాల్ ఆఫ్ కైండ్‌నెస్ బోర్డు ఏర్పాటు చేశారు. దీంతో ఇది దాతృత్వపు స్థలంగా మారింది. ఈ దయగల పార్కు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోంది. అనేకమంది ఇళ్లల్లో నిరుపయోగంగా ఉన్న సామగ్రిని ఈ పార్కులోకి తీసుకొస్తున్నారు. దుస్తులు, చెప్పులు, పుస్తకాలు, వంటసామగ్రి.. ఇలా తమకు అవసరంలేని వాటిని దాతలు తీసుకొచ్చి పార్కులో ఉంచుతున్నారు. వాటిని అవసరమైన నిరుపేదలు, కూలీలు తీసుకెళుతున్నారు. తెచ్చేవాళ్లు, తీసుకెళ్లేవాళ్లు నిరభ్యంతరంగా పార్కులోకి రావచ్చు. ఎవరికీ ఆటంకాలు లేవు.
కైండ్‌నెస్ పార్కులో పాత దుస్తులను వేస్తున్న దాత
సౌకర్యాలు కల్పిస్తే మరింత మేలు
తోచిన సాయం చేయాలన్నది నా సంకల్పం. దీనికి కార్పొరేషన్ అధికారుల నుంచి మంచి సహకారం అందింది. చాలామంది దాతలు వస్తున్నారు. తమకు అవసరం లేని ఎన్నో వస్తువులు ఇస్తున్నారు. కానీ వాల్ ఆఫ్ కైండ్‌నెస్‌కు సరైన రక్షణ లేకపోవడం వల్ల అనేక వస్తువులు దుర్వినియోగమవుతున్నాయి. పెద్ద మనసుతో ఎన్నో రకాల వస్తువులు అందించేందుకు వస్తున్నా.. వాటిని సంరక్షించలేకపోతుండటంతో.. తిరిగి తీసుకెళ్లిపోవాలని మేమే దాతలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దాతలు సహకరించి.. ఫెన్సింగ్ ఏర్పాటుచేసి, అల్మరాలు పెడితే.. చాలామందికి ఈ దయగల పార్కు ఉపయోగపడుతుంది.
– బోయిన శ్రీనివాసరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్, జీవీఎంసీ
నా మనవడికి మంచి దుస్తులు దొరికాయి
నేను ఈ పార్కుకి రెండు రోజులకోసారి వస్తాను. మా మనవడు వేసుకోడానికి మంచి దుస్తులు, ఆడుకోడానికి బొమ్మలు ఇక్కడ దొరుకుతున్నాయి. వైజాగ్ నగరంలో సాయం చేసే దాతలు చాలామందే ఉన్నారని ఈ పార్కుకి వచ్చినప్పుడల్లా అనిపిస్తుంటుంది.
– అప్పన్న, నాతయ్యపాలెం
పేదల అవసరాలు తీర్చే పార్కు
ఈ పార్కు మా ఇంటి అవసరాల్ని ఎన్నోసార్లు తీర్చింది. మేము కొనుక్కోలేని వస్తువులు ఎన్నో ఇక్కడ దొరికాయి. మాలాగే చాలామంది ఇక్కడికి వచ్చి.. నచ్చిన దుస్తులు, వస్తువులు తీసుకెళుతున్నారు. నిజంగా ఇది దయగల పార్కే. సాయం చేసిన ప్రతి ఒక్కరినీ దేవుడు చల్లగా చూస్తాడు.
– పెంటమ్మ, రైల్వే ట్రాక్ దరి, బీహెచ్‌ఈఎల్
స్వచ్ఛభారత్‌కు ఆదర్శంగా..
ఒక బహిర్భూమిని వాల్ ఆఫ్ కైండ్‌నెస్‌గా మార్చిన శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ని జీవీఎంసీ కమిషనర్‌తోపాటు అధికారులమంతా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇటీవల అమరావతిలో జరిగిన సమావేశంలోనూ ఈ దయగల పార్కుని ఉన్నతాధికారులు ప్రశంసించారు. స్వచ్ఛ భారత్‌కు ఆదర్శంగా పార్కుని తీర్చిదిద్ది కమిషనర్ సూచనల మేరకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం.
– వి.సన్యాసిరావు, అదనపు కమిషనర్, జీవీఎంసీ
Comments
Please login to add a commentAdd a comment