సాక్షి, అమరావతి: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి భయపడాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. గత నెలలో విదేశాల నుంచి వచ్చిన 30 మంది ప్రయాణికులు కనిపించడం లేదని వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొంది. ఈ 30 మంది ప్రయాణికులతోపాటు విదేశాల నుంచి వచి్చన వారెవరికీ కరోనా కానీ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కానీ లేదని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ హైమావతి శుక్రవారం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలు ముమ్మరం చేసింది.
చదవండి: Omicron Variant: ప్రస్తుతానికి.. ఒమిక్రాన్‌తో ముప్పు లేదు
ఇందులో భాగంగా గత నెలలో ఇతర దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితులపై వైద్య, ఆరోగ్య శాఖ ఆరా తీసింది. గత నెలలో వివిధ దేశాల నుంచి రాష్ట్రానికి 7 వేల మందికి పైగా ప్రయాణికులు వచ్చారు. వీరిని జిల్లాల్లోని వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఫోన్ ద్వారా, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్, వలంటీర్ల ద్వారా నేరుగా సంప్రదించారు. కరోనా సోకిందా?ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? కరోనా టీకా వేసుకున్నారా.. లేదా అనేవాటిని ఆరా తీశారు.
అయితే విదేశాల నుంచి వచ్చిన ఎవరూ వైరస్ బారిన పడలేదు. ఈ నెల ఒకటో తేదీ నుంచి శుక్రవారం సాయంత్రానికి విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 236 మంది విదేశీ ప్రయాణికుల వివరాలు రాష్ట్ర వైద్య శాఖకు అందాయి. రాష్ట్రంలో అంతర్జాతీయ విమానాశ్రయాలు లేవు. ఈ నేపథ్యంలో వీరు నేరుగా రాష్ట్రంలోకి ప్రవేశించలేరు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలోని విమానాశ్రయాల్లో దిగాల్సి ఉంటుంది. అక్కడ వైద్య పరీక్షల అనంతరం స్వస్థలాలకు రోడ్డు, రైలు మార్గాల్లో చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సంబంధిత వ్యక్తుల వివరాలను ఆయా జిల్లాలకు పంపించారు. స్థానిక వైద్య సిబ్బంది వీరి ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారు. విమానాశ్రయాల్లో చేసే వైరస్ నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్‌గా తేలినప్పటికీ వారం పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉంచనున్నారు. వారం అనంతరం తిరిగి వారికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తారు.
ఆ ప్రచారం అవాస్తవం..
రాష్ట్రానికి విదేశాల నుంచి వచ్చిన 30 మంది ప్రయాణికుల ఆచూకీ లభించడం లేదని శుక్రవారం పలు టీవీ చానళ్లు, సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం అవాస్తవం. విశాఖపట్నంతోపాటు పరిసర జిల్లాల్లో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. రాష్ట్రంలోకి విదేశీ ప్రయాణికులు ఎవరూ నేరుగా రావడం లేదు. కేంద్రం అమలు చేస్తున్న వందే భారత్ పథకం కింద విజయవాడ విమానాశ్రయానికి కొన్ని విమానాలొస్తున్నాయి. వీరికి కేంద్ర ప్రభుత్వ ప్రొటోకాల్ ప్రకారం వైద్య బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల్లో ఇప్పటికే వైద్య బృందాలను ఏర్పాటు చేశాం.
– డాక్టర్ హైమావతి, డైరెక్టర్, రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
Comments
Please login to add a commentAdd a comment