కోవిడ్‌ రోగులకు సేవలపై ఆన్‌లైన్‌ పర్యవేక్షణ | Online Monitoring Of Services For Covid Patients | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ రోగులకు సేవలపై ఆన్‌లైన్‌ పర్యవేక్షణ

Published Tue, Aug 25 2020 3:00 AM | Last Updated on Tue, Aug 25 2020 1:14 PM

Online Monitoring Of Services For Covid Patients - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న సేవలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ కోవిడ్‌ సేవలందిస్తున్న 102 ఆస్పత్రుల్లో 1,600కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా విజయవాడలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పర్యవేక్షిస్తున్నారు. నిత్యం ప్రతి ఆస్పత్రిలో ఎప్పుడు ఏం జరుగుతోంది, ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి వంటివి పరిశీలించి అప్పటికప్పుడే ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ లేదా రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌తో చర్చించి సమస్యలను పరిష్కరిస్తున్నారు. త్వరలోనే మరో 36 ఆస్పత్రుల్లో 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. 

ఎలాంటి సమస్యలు పరిష్కరిస్తున్నారు? 
► పారిశుధ్యం బాగా లేకపోతే ఆయా వార్డుల్లో సిబ్బందికి వెంటనే సమాచారం ఇచ్చి శుభ్రం చేయిస్తున్నారు. 
► బెడ్‌షీట్లు మార్చకపోయినా, రోగులకు మందులు సకాలంలో అందకపోయినా తక్షణం ఆ సమస్యలను పరిష్కరిస్తున్నారు. రోగులకు నర్సులు, వైద్యులు సకాలంలో సేవలు అందించకపోతే పైఅధికారులకు సమాచారం ఇచ్చి వారిని వార్డులకు పంపుతున్నారు.  
► డ్యూటీ డాక్టర్లు సకాలంలో రాకపోతే ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫోన్‌ చేసి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయిస్తున్నారు. ఎక్కడైనా మౌలిక వసతుల కొరత ఉన్నట్టయితే ప్రభుత్వ ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తున్నారు. 
► ఎమర్జెన్సీ పేషెంట్లకు అందుతున్న సేవలు, వైద్య సదుపాయాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 

పరిస్థితులు మెరుగవుతున్నాయి
వివిధ కోవిడ్‌ ఆస్పత్రుల నుంచి రకరకాల ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి పరిష్కరించేందుకు యత్నిస్తున్నాం. దీనివల్ల రోగులకు ఉపశమనం కలుగుతోంది. ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సి ఉంది.
డా.నీలిమ, కమ్యూనిటీ మెడిసిన్‌ నిపుణులు (స్టేట్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌)

డాక్టర్ల కొరతను అధిగమించేందుకు..
ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరతను అధిగమించేందుకు ఈ సంవత్సరం పీజీ వైద్య విద్య పూర్తి చేసుకోబోతున్న 2 వేల మందిని వైద్య సేవల కోసం నియమించుకోవాలని ప్రభుత్వానికి సూచించాం. కర్ణాటకలో కోవిడ్‌కు విధిగా సేవలందించాలని వైద్యవిద్యార్థులకు నిబంధన పెట్టారు. ఇక్కడ అలాగే చేస్తే 2 వేల మంది అదనంగా మనకు పనిచేసే అవకాశం ఉంటుంది. పర్యవేక్షణ ఉండటంతో కొంతవరకూ ఫలితాలు వస్తున్నాయి.
– డా. సుందరాచారి, ప్రత్యేకాధికారి (స్టేట్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement