ఒంగోలు: విద్యాశాఖలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం, విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకూ ఎంఈఓలు నిర్వహిస్తున్న విధుల్లో కొన్నింటిని సెర్ప్ విభాగంలో పనిచేస్తున్న ఏపీఎంలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఎంలు ప్రస్తుతం సెర్ప్‌లో స్వయం సహాయక సంఘాలు, స్త్రీ నిధి తదితర బ్యాంకు లింకేజీ స్కీములను పర్యవేక్షిస్తున్నారు.
తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యాశాఖకు కేటాయించిన ఏపీఎంలు నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, జగనన్న అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద, టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ వంటి వాటిని పర్యవేక్షిస్తారు. మండల విద్యాశాఖ అధికారికి వీటి నుంచి మినహాయింపు ఇవ్వడంతో పనిభారం తగ్గుతుంది. తద్వారా వారు పాఠశాలల్లో విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. పాఠశాలల తనిఖీలు, పాఠశాలల్లో సిలబస్ నిర్ణీత సమయానికి పూర్తిచేస్తున్నారా, హాజరు ఎలా ఉంది, పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది.
పనులు వేగవంతం అయ్యేందుకు ఉపయోగం
సెర్ప్‌లోని అదనపు ప్రాజెక్టు మేనేజర్లను ఎంఈవో బాధ్యతల్లో కొన్నింటిని పర్యవేక్షించేందుకు ఇవ్వడం వలన పనులు వేగవంతం అవుతాయి. సాధారణంగా ఎంఈవోలకు చాలా బాధ్యతలు ఉన్నాయి. వాటన్నింటిని సమన్వయం చేసుకునే సమయంలో విద్యాప్రమాణాల పెంపుదలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఏపీఎంలను ఉపయోగించుకోవడం ద్వారా అటు విద్యా ప్రమాణాల మెరుగుదల, మరో వైపు నాడు–నేడు వంటి పనుల పర్యవేక్షణ వేగవంతం అవుతాయి.
– బి.విజయభాస్కర్, జిల్లా విద్యాశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment