సాక్షి, అమరావతి: కోరుకున్న వారికి అనాథ బాలలను సంరక్షణకు అప్పగించిన అనంతరం.. రెండేళ్లపాటు ఆ బాలలను సంరక్షకులు బాధ్యతతో చూస్తారనే నమ్మకం అధికారులకు కలిగితే దత్తత ఇచ్చే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. తాజాగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పోస్టర్ కేర్ (సంరక్షణ)కు సంబంధించిన మార్గదర్శకాలకు ఆమోద ముద్ర వేసింది. ఇందుకనుగుణంగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అవసరమైన కసరత్తు చేపట్టింది.
బాలల సంరక్షణ ఇలా..
పిల్లలు లేనివారు, అనాథలకు మంచి జీవితాన్ని ఇవ్వాలనుకునే ఆదర్శవాదులు, ఎవరులేని వారిని పెంచి పెద్దచేయాలనుకునే సంస్థలు బాలల కోసం అధికారులకు దరఖాస్తు చేసుకుంటారు. వాటిపై మహిళా శిశు సంక్షేమ, సాంఘిక సంక్షేమ, పోలీస్ తదితర శాఖలు ఆరా తీసిన అనంతరం ఆయా వ్యక్తులు, సంస్థలకు బాలలను అప్పగించేలా అధికారిక అనుమతి ఇస్తారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఆరేళ్లలోపు బిడ్దలను మాత్రమే దత్తత ఇస్తుంటారు. ఆరేళ్ల నుంచి 8 ఏళ్ల లోపు పిల్లలను సంరక్షణ(పోస్టర్ కేర్)కు అప్పగిస్తారు.
సంరక్షకులు వారిని ఎలా చూస్తున్నారనే దానిపై ప్రతి ఆరు నెలలకు ఒక మారు అధికారులు పర్యవేక్షిస్తారు. ఇలా రెండేళ్లపాటు అధికారుల స్వీయ పరిశీలన అనంతరం.. నమ్మకం కలిగితే దత్తతకు అనుమతిస్తారు. అలాగే 8 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు బాలలను కోరుకున్న సంరక్షకులకు అప్పగిస్తారు. వారిని సంరక్షకులు ఎలా చూస్తున్నారని ఏడాదిపాటు అధికారులు పరిశీలించిన అనంతరమే సంతృప్తికరంగా ఉంటే పూర్తిస్థాయిలో దత్తతకు అనుమతిస్తారు. అలాగే దత్తతతో నిమిత్తం లేకుండా బాలల సంరక్షణ బాధ్యతలు తీసుకుంటామని ముందుకు వచ్చే వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి పోస్టర్ కేర్(సంరక్షణ)కోసం అధికారులు అప్పగించనున్నారు.
రాష్ట్రంలో 3,354 దరఖాస్తులు
ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా సంరక్షకులకు బాలలను అప్పగించే కార్యాచరణ చేపడతాం. రాష్ట్రంలోని జిల్లా కేంద్రంగా నిర్వహించే బాలల సంరక్షణ కేంద్రాల్లో 18 ఏళ్ల లోపు బాలలు 143 మంది ఉన్నారు. వారిలో 75 మంది బాలలతోపాటు 68 మంది విభిన్న ప్రతిభావంతులున్నారు. అనాథ బాలలను ఇవ్వాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా 3,354 మంది సంరక్షకులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో కేవలం 2 ఏళ్లలోపు బాలలను దత్తతకు ఇవ్వాలని కోరినవారు 2,304 మంది ఉన్నారు. కొత్తగా దరఖాస్తులు తీసుకుని పరిశీలించి బాలలను సంరక్షణకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం.
Comments
Please login to add a commentAdd a comment