గ్రామాల్లో ఆర్భాటంగా చేపడుతున్న కార్యక్రమాలకు నిధులు కేటాయించని ప్రభుత్వం
అయినా. ఒక్కో గ్రామంలో రూ. 50 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు
సాక్షి, అమరావతి: పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అర్భాటంగా నిర్వహిస్తున్నప్పటికీ దాని నిర్వహణకు మాత్రం ప్రత్యేకంగా ఎలాంటి నిధులు కేటాయించలేదు. అయినా.. ఇందుకు ఒక్కో గ్రామంలో కనీసం రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వెచి్చస్తున్నట్లు సమాచారం. మంత్రులు పాల్గొనే చోట ఈ ఖర్చు మరింత ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఈ ప్రభావం పనుల నాణ్యతపై తప్పనిసరిగా పడుతుందని అనుమానిస్తున్నారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కేటగిరి నిధులతో గ్రామాల్లో కొత్తగా చేపట్టే పనులకు భూమిపూజ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఈ ‘పల్లె పండుగ’ కార్యక్రమాన్ని సోమవారం నుంచి వారం రోజులపాటు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
గతంలో ఎలాంటి ఆర్భాటం లేకుండా..
నిజానికి.. ఉపాధి నిధులతో చేపట్టే పనులకు భూమిపూజ, శంకుస్థాపన అంటూ ఎలాంటి అర్భాటాలు ఉండవు. పైగా.. ఉపాధి పనుల్లో కాంట్రాక్టరు ప్రమేయమే ఉండదు. కానీ, ఇతర నిధులతో చేపట్టే అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టరు తన మిగులు కోసం అంచనా విలువ పెంచేస్తారు. అదే ఉపాధి పనుల అంచనాల తయారీలో ఎలాంటి మిగులు నిధులకు ఆస్కారం లేకుండా అంచనాలు రూపొందిస్తారు. గత సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఒక్కో గ్రామంలో రూ.కోట్లు ఖర్చుపెట్టి రాష్ట్రవ్యాప్తంగా 30 వేలకు పైగా శాశ్వత భవన నిర్మాణాలు చేపట్టినా.. ఎలాంటి హడావుడి లేకుండానే వాటిని పూర్తిచేసింది. కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా పల్లెపండుగ అంటూ నానా హడావుడి చేస్తోంది.
పల్లె పండుగ ఖర్చు టీడీపీ నేతలదే..
ఇక కేంద్ర నిబంధనల ప్రకారం ఉపాధి హామీ పనుల వివరాలను గ్రామంలో ఒకచోట వాల్ పెయింట్ రాయడానికి రూ.3 వేల చొప్పున.. బ్యానర్ ఏర్పాటుకు మరో రూ.1,500 చొప్పున బిల్లులు పెట్టుకునే వెసులుబాటు ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే, అత్యధిక గ్రామాల్లో అధికార పార్టీ నాయకులే కాంట్రాక్టరు ముసుగులో ఆయా పనుల పర్యవేక్షణ బాధ్యతలు తీసుకుని పల్లె పండుగ కార్యక్రమ ఖర్చు భరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనివల్ల ఈ కార్యక్రమ నిర్వహణకు పెట్టే ఖర్చు మొత్తాన్ని అతను చేపట్టే పనుల నుంచి మిగుల్చుకోక తప్పదని.. చివరికి ఇది పనుల నాణ్యతపై ప్రభావం చూపుతుందన్న చర్చ అధికార వర్గాల్లో జోరుగా సాగుతోంది.
తొలిరొజు 960 గ్రామాల్లో 1,600 పనులకు..
ఇదిలా ఉంటే.. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా తొలిరోజైన సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 960 గ్రామ పంచాయతీల్లో దాదాపు 1,600 కొత్త పనులకు భూమిపూజ జరిగినట్లు అధికారుల సమాచారం. ఇందులో 1,300 దాకా సిమెంట్ రోడ్ల పనులే ఉన్నాయి. మరోవైపు.. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్‌లను పక్కనపెట్టడంతో అధికార టీడీపీ నేతల పెత్తనం కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment