
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. తొలివిడతలో ఫిబ్రవరి 9న విజయనగరం జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా 3,249 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం అధికారికంగా ప్రకటించింది. పంచాయతీల వారీగా ఎక్కడికక్కడ రిటర్నింగ్ అధికారులు శుక్రవారం ఉ.10.30కు నోటిఫికేషన్లు జారీచేస్తారు. ఇవి జారీచేసిన గ్రామ పంచాయతీలలో మూడ్రోజుల పాటు ప్రతిరోజూ ఉ.10.30 గంటల నుంచి సా.5 గంటల మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు. సర్పంచ్ పదవితో పాటు ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో నిర్ధారించిన వార్డు సభ్యుల పదవులకు కూడా నామినేషన్లు స్వీకరిస్తారు.
ఆ మూడు జిల్లాల ఎన్నికల్లో మార్పులు..
ఇదిలా ఉంటే.. విజయనగరం, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో డివిజన్ల వారీగా నాలుగు విడతల్లో జరిగే ఎన్నికల తేదీలు మారాయి. దీని ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా తొలివిడతలో నరసాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో.. రెండో విడతలో కొవ్వూరు, మూడో విడతలో జంగారెడ్డిగూడెం, నాలుగో విడతలో ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎన్నికలు జరుగుతాయి. అలాగే, విజయనగరం జిల్లా రెండో విడతలో పార్వతీపురం.. 3, 4 విడతల్లో విజయనగరం రెవెన్యూ డివిజన్ పరిధిలో జరుగుతాయి. ఇక ప్రకాశం జిల్లా తొలి విడతలో ఒంగోలు, రెండో విడతలో కందుకూరు, ఒంగోలు.. మూడో విడతలో కందుకూరు, నాలుగో విడతలో మార్కాపురం డివిజన్ల పరిధిలో ఎన్నికలు జరుగుతాయి.