సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల్లో ప్రతి ఒక్కరి నోట వికేంద్రీకరణ నినాదం మారుమోగుతోంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన వికేంద్రీకరణ నినాదం ఉత్తరాంధ్రలోని ప్రతి గ్రామంలోనూ ఉవ్వెత్తున ఎగసి పడుతోంది.
మూడు రాజధానుల ఏర్పాటుతో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని శ్రీకాకుళం నుంచి అనకాపల్లి జిల్లా వరకు ఊరూ వాడా ఏకమై మద్దతు పలుకుతోంది. శుక్రవారం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో మానవ హారాలు, భారీ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించారు. విశాఖ గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే గర్జిస్తామంటూ మేధావులు, విద్యార్థులు, సామాన్య ప్రజలు, వర్తకులు, ఉద్యోగులు నినదించారు.
నేడు అన్ని దారులూ విశాఖ గర్జన వైపే
- విశాఖ ఉత్తర నియోజకవర్గం 25వ వార్డులో వికేంద్రీకరణకు మద్దతుగా సమావేశం జరిగింది. నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 46, 50, 51వ వార్డుల్లోని డీఎల్‌బీ గ్రౌండ్, మురళీనగర్ పార్కు, ఈస్ట్ పార్కు వద్ద వాకర్స్‌తో సమావేశమై వికేంద్రీకరణ ఆవశ్యకత వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సతీష్, కార్పొరేటర్లు వావిలపల్లి ప్రసాద్, రెయ్యి వెంకటరమణ, కోఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు పాల్గొన్నారు.
- విశాఖ తూర్పు నియోజకవర్గంలోని పలు వార్డుల్లో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు శుక్రవారం ప్రజలతో సమావేశాలు నిర్వహించారు. భీమిలి నియోజవర్గంలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు క్యాంప్ కార్యాలయంలో విశాఖ గర్జనకు సంబంధించి పోస్టర్ విడుదల చేశారు. పరిపాలనా వికేంద్రీరణకు మద్దతుగా తగరపువలస పీఏసీఎస్‌లో సొసైటీ అధ్యక్షుడు అక్కరమాని రామునాయుడు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు సమావేశం అయ్యారు. చిట్టివలస బంతాట మైదానం నుంచి ర్యాలీగా విశాఖ గర్జనకు వెళ్లాలని తీర్మానించారు.
- భీమిలి, తగరపువలసకు చెందిన వంద మంది ఆటో కార్మికులు భీమిలి నుంచి తగరపువలస వరకు మద్దతుగా ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. పీఎం పాలెం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నుంచి కొమ్మాది కూడలి వరకు జగుపిల్ల నరేష్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు.
- విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఆడారి ఆనంద్ ఆధ్వర్యంలో ఎన్‌ఏడీ యునైటెడ్ క్రైస్ట్ చర్చిలో, పలు విద్యా సంస్థల్లో, ఎన్‌ఏడీ టాసిన్ మసీదుల్లో సమావేశాలు నిర్వహించి వికేంద్రీకరణకు మద్దతు పలకాలని కోరారు.
- పెందుర్తి నియోజకవర్గంలో పెందుర్తి రాంపురంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మూడు మండలాల పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి విశాఖ గర్జనను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు.
- గాజువాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే తిప్పలనాగిరెడ్డి ఆధ్వర్యంలో 65, 66, 67, 68, 75 వార్డుల్లో విద్యార్థులతో, అగనంపూడిలో మానవహారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, దేవాన్‌రెడ్డి, పల్లా చినతల్లి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
- అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా శుక్రవారం నక్కపల్లిలో కాపు కార్పొరేషన్ డైరక్టర్ వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై కళాశాల విద్యార్థులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉపమాక రోడ్డు వరకు ‘ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్‌లో విద్యార్థులతో కలసి మానవ హారం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment