
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లాల్లో రేపు(గురువారం)కూడా తేలికపాటి వర్షాలు నమోదవుతాయని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ సునంద వెల్లడించారు. రేపు పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం నుంచి పూర్తిగా పొడి వాతావరణం ఉంటుందని, ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుకుంటాయన్నారు.
నిన్న గరిష్టంగా విజయనగరం జిల్లా గరివిడిలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ రోజు అనకాపల్లిలో ఐదు సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నెలాఖరు వరకు ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే ఉంటాయి. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని సునంద తెలిపారు.