సాక్షి, విశాఖపట్నం: ఆర్.కె.బీచ్.. చాలా రోజుల తర్వాత సందడిగా కనిపించింది. పోలీసులు కాస్త వెసులుబాటు ఇవ్వడంతో ఆదివారం నగరవాసులు సాగరతీరంలో సేదతీరారు. రెండో దశలో కరోనా మహమ్మారి విజృంభనతో.. వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలుచేసింది. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 2 వరకు సడలింపులు ఉన్నా.. బీచ్‌లోకి మాత్రం పోలీసులు అనుమతించలేదు.
ఈ ఆదివారం కాస్త వెసులుబాటు ఇవ్వడంతో ప్రజలు సాగరతీరంలో సందడి చేశారు. యువత సముద్రంలో స్నానాలు చేస్తూ.. ఒడ్డున ఆటలు ఆడుతూ కేరింతలు కొట్టారు. కొంత మంది పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా గడిపారు.
విల్లులా వంచి.. పక్షిలా ఎగిరి..
ఆడేది సరదాకైనా.. గెలుపే ధ్యేయంగా సాగిపోతారనేందుకు సాగరతీరంలో కొందరు యువ్రక్రీడాకారుల చూపే ప్రతిభే దర్పణం. బీచ్‌లో ఆదివారం కొంత మంది యువకులు సరదాగా ఫుట్‌బాల్ ఆడుతున్నారు. ఓ క్రీడాకారుడు గోల్ కొట్టేందుకు బంతిని పంపాడు. గోల్ కీపర్ శరీరాన్ని విల్లులా వంచి.. పక్షిలా గాల్లోకి ఎగురుతూ గోల్‌పోస్టులోకి ఆ బంతిని చేరనీయకుండా ఆపేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యం ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది.
జలధి చెంత.. జన్మదిన వేడుకలు
-ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment