
సాక్షి, విజయవాడ: కనక దుర్గ గుడిలో శాశ్వత కేశఖండన శాల నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు అన్నారు. గురువారం మూడు గంటల పాటు కొనసాగిన పాలకమండలి సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా బారిన పడిన సిబ్బందిని ఆలయపరంగా ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం దాతలు ముందు రావాలని కోరారు. డోనర్స్ సెల్ ఒకటి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
అదే విధంగా ఆలయ ఈవో సురేష్ బాబు మాట్లాడుతూ.. పాలకమండలి సమావేశంలో 38 అంశాలపై చర్చించామని తెలిపారు. శివాలయం పునర్నిమాణం, అన్నదానం, ప్రసాదం పొటు, కేశఖండన శాల నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ పనులకు సంబంధించి అనుమతులు కూడా వచ్చాయని తెలిపారు. తూర్పు రాజగోపురం నుండి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో దాతలు భాగస్వాములు అవ్వాలని కోరారు. సిబ్బందికి కోవిడ్ ఇన్సూరెన్స్ కల్పించేలా కమిషనర్ దృష్టి కి తీసుకు వెళతామన్నారు. భక్తులు నిర్భయంగా దర్శనానికి రావచ్చని, ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. లాక్ డౌన్ ఎత్తేస్తే దర్శన సమయంలో మార్పులు చేస్తామని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment