PM Kisan Samman Nidhi: Beneficiaries Must Complete E KYC By July 31st - Sakshi
Sakshi News home page

PM Kisan e-KYC: ఇదే చివరి అవకాశం.. ఇలా చేయకపోతే డబ్బులు పడవు  

Published Sun, Jul 24 2022 4:10 PM | Last Updated on Sun, Jul 24 2022 8:26 PM

PM Kisan Samman Nidhi: Beneficiaries Must Complete E KYC By July 31st - Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల లబ్ధి పొందాలంటే ఈ–కేవైసీ (ఎలక్ట్రానిక్‌ నోయువర్‌ కస్టమర్‌) తప్పని సరి అయింది. ఈ ఏడాది పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద కేంద్ర ప్రభుత్వం అందజేసే రూ.2వేల చొప్పున ఏటా రూ.6వేలు జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించుకోవాలి. ఈ నెల 31వ తేదీలోపు ఈ–కేవైసీ చేయించుకోకపోతే పథకం లబ్ధిని కోల్పోయే ప్రమాదం ఉంది.
చదవండి: నష్టమే రాని పంట.. ఒక్కసారి సాగుచేస్తే 40 ఏళ్ల వరకు దిగుబడి 

ఈ–కేవైసీ, కేవైసీ రెండూ వేర్వేరు.. 
ఈ–కేవైసీ, కేవైసీ (నో యువర్‌ కస్టమర్‌) రెండు విధానాలు వేర్వేరు. ఓటీపీ ఆధారంగా చేసే విధానాన్ని ఈ–కేవైసీ అంటారు. ఆధార్‌ రిజిస్టర్‌ అయిన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీతో ఈ–కేవైసీని పూర్తి చేస్తారు. అలాగే కేవైసీని డాక్యుమెంట్ల ఆధారంగా పూర్తి చేస్తారు. ఇంతకు మునుపు కేవైసీ చేయించిన పీఎం కిసాన్‌ లబ్ధిదారులు మళ్లీ ఈ–కేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆర్‌బీఐ ఆదేశాల మేరకు మనీ ల్యాండరింగ్, ఫేక్‌ అకౌంట్లను అరికట్టేందుకు ఈ–కేవైసీ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానం వల్ల అనర్హులకు సంక్షేమ పథకాలు నిలిచిపోతాయి. దీంతో ప్రజాధనం ఆదా అవుతోంది.

స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే ఇంట్లోనే ఇలా... 
స్మార్ట్‌ఫోన్‌ ఉంటే ఇంట్లోనే ఈ–కేవైసీని అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ముందుగా www.pmkisan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్‌ నంబర్‌ నమోదు చేసుకోవాలి. అప్పుడు ఆధార్‌కార్డుకు లింకై ఉన్న మొబైల్‌ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్‌ చేయగానే గెట్‌ పీఎం కిసాన్‌ ఓటీపీ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. మళ్లీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్మిట్‌ చేస్తే ఈ–కేవైసీ అప్‌డేట్‌ అవుతుంది.  

కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్లలో...  
జిల్లాలోని దాదాపు అన్ని మండల కేంద్రాల్లో ఉన్న కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్లలో (సీఎస్‌సీ) రైతుల సౌకర్యార్థం ఈ–కేవైసీ చేస్తున్నారు. ఆన్‌లైన్‌ కేంద్రాలు, మీసేవ కేంద్రాల్లోనూ ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ నెల 31 లోపు రైతులు ఈ–కేవైసీని పూర్తి చేసుకోవాలి. లేకపోతే ఈ పథకం వర్తించదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలుమార్లు ఈ–కేవైసీ నమోదుకు గడువు పొడగిస్తూ వచ్చింది. ఇదే  చివరి అవకాశం కావడంతో రైతులను ఉమ్మడి జిల్లా వ్యవసాయశాఖ అధికారులు చైతన్య పరుస్తున్నారు.

అవకాశం జారవిడుచుకోవద్దు..
పీఎం కిసాన్‌ సమ్మాన్‌ పథకం కింద రూ.2 వేలు చొప్పున ఏటా మూడు విడతల్లో రూ.6 వేలు లబ్ధి చేకూరుతుంది. అర్హత ఉన్న ప్రతి రైతూ ఆధార్, దానికి అనుసంధానమైన ఫోన్‌ నెంబరు, అలాగే ఓటీపీ నెంబరు ఆధారంగా అథెంటిఫికేషన్‌ చేసుకోవాలి. రైతులు ఈ విషయాన్ని గమనించి సాధ్యమైనంత తొందరగా ఈకేవైసీ చేయించుకోవాలి. ఇదే చివరి అవకాశం.. జారవిడుచుకోవద్దు.  
– బి.చంద్రానాయక్, డీఏఓ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement