సాక్షి, అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూలై 4న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్న నేపథ్యంలో విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ఈ విషయమై శుక్రవారం సచివాలయం నుంచి అధికారులతో ఆయన వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ప్రధాని పర్యటనకు ఇంకా నెల రోజులు సమయం ఉందని, ఇప్పటినుంచే తగిన ప్రణాళిక రూపొందించి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
జూలై 4న ప్రధాని మోదీ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా భీమవరం పర్యటనలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను పురస్కరించుకుని 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారన్నారు. వీడియో లింక్ ద్వారా ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణ బాబు, శాంతి భద్రతల అదనపు డీజీ రవిశంకర్ అయ్యనార్, సమాచార శాఖ కమిషనర్ టి.విజయ కుమార్‌రెడ్డి, స్వచ్చాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఎండీ సంపత్‌కుమార్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment