సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేను వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తిచేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్పిల్ చానల్‌లో నిల్వ ఉన్న నీటిని తొలగిస్తేగానీ అక్కడ కాంక్రీట్ పనులు సాధ్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్పిల్ వే, స్పిల్ చానల్‌లో నిల్వ ఉన్న వరద నీటిని తోడేసే (డీవాటరింగ్) పనులను అధికారులు వేగవంతం చేశారు. 83.5 హార్స్ పవర్ సామర్థ్యం కలిగిన 22 పంపులతో స్పిల్ చానల్‌లో 15.795 మీటర్ల ఎత్తున నిల్వ ఉన్న నీటిని ఎత్తి గోదావరిలోకి పోస్తున్నారు. సోమవారం నుంచి మరిన్ని పంపులను అమర్చనున్నారు.
- స్పిల్ చానల్‌లో 18.75 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ బ్లాక్‌ల పనులకుగానూ 15.6 మీటర్ల పనులను ఇప్పటికే పూర్తి చేశారు. మిగిలిన పనులను ఏప్రిల్ నాటికి పూర్తి చేయడానికి చర్యలు చేపట్టారు. స్పిల్ చానల్‌లో మిగిలిపోయిన 75.02 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టిని తొలగించే పనులను వేగవంతం చేశారు.
- స్పిల్ చానల్‌తో పాటు స్పిల్‌వేను పూర్తి చేయనున్నారు. స్పిల్ వేలో 48 పియర్స్ (కాంక్రీట్ స్తంభాలు) 52 మీటర్ల స్థాయికి పూర్తయ్యాయి. వాటి మధ్య 20 మీటర్ల ఎత్తు, 18 మీటర్ల వెడల్పుతో 48 గేట్లు బిగించాలి. ఇప్పటికే గేట్లు సిద్ధంగా ఉన్నాయి. వాటిని బిగించే పనులను నెలాఖరు నుంచి ప్రారంభిస్తారు.
- స్పిల్‌వే పియర్స్ మధ్య గేట్లను అమర్చడానికి 98 హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లు అవసరం. వాటిలో ఇప్పటికే 46 సిలిండర్లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు. మిగతా వాటిని డిసెంబర్‌లోగా దిగుమతి చేసుకోనున్నారు.
నేడు కాఫర్ డ్యామ్‌ల పరిశీలనకు సీఎస్‌ఎంఆర్‌ఎస్ బృందం:
ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్‌ఎంఆర్‌ఎస్) నిపుణుల బృందం ఆదివారం పరిశీలించనుంది. గోదావరి వరదల ఉధృతి ప్రభావం కాఫర్ డ్యామ్‌లపై ఎలా ఉందనే విషయాన్ని అధ్యయనం చేసి.. వాటిని పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆ బృందం దిశానిర్దేశం చేస్తుంది.
- ఈ నేపథ్యంలో కాఫర్ డ్యామ్‌ల్లో మిగిలిన పనులను పూర్తి చేయడానికి వీలుగా గోదావరి ఎడమ గట్టు నుంచి అప్రోచ్ రోడ్లను వేస్తున్నారు. సీఎస్‌ఎంఆర్‌ఎస్ నిపుణులు సూచనల మేరకు తొలుత కాఫర్ డ్యామ్‌లలో ఎడమ వైపు ఖాళీ ప్రదేశాలను భర్తీ చేస్తారు.. ఆ తర్వాత కుడి వైపు ఖాళీ ప్రదేశాలను భర్తీ చేసి.. పోలవరం స్పిల్ వే రివర్స్ స్లూయిజ్ గేట్ల ద్వారా గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేస్తారు.
- గోదావరికి జూన్‌లో వచ్చే వరదను స్పిల్ వే మీదుగానే నదిలోకి మళ్లించనున్నారు. నదీ ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించడానికి అప్రోచ్ చానల్ తవ్వకం పనులో‍్ల మిగిలిన వాటిని ఏప్రిల్ నాటికి పూర్తి చేయనున్నారు.
మే నుంచి ఈసీఆర్‌ఎఫ్ పనులు
పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన ఆనకట్ట (ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్-ఈసీఆర్‌ఎఫ్)ను మూడు భాగాలుగా నిర్మిస్తారు. ఇందులో గ్యాప్-1, గ్యాప్-3ల మధ్య ఈసీఆర్‌ఎఫ్ పనులను ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నారు. గ్యాప్-2లో ప్రధానమైన ఈసీఆర్‌ఎఫ్ పనులను వచ్చే మేలో ప్రారంభించి.. నిరాటంకంగా చేయడం ద్వారా డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నారు. ఆలోగా కుడి, ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానం చేసే పనులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment