
సాక్షి, విజయవాడ : రమేష్ ఆసుపత్రి కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాద ఘటనలో డాక్టర్ మమతను ఆరు గంటల పాటు పోలీసులు విచారణ జరిపారు. మృతుల బంధువుల ఆరోపణలపై ఆమె నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. సుమారు ఆరు గంటల పాటు పలు ప్రశ్నలపై డాక్టర్ మమతను ఏసీపీ సూర్యచంద్రరావు ప్రశ్నించారు. కోవిడ్ కేర్ సెంటర్‌లో రమేష్ ఆసుపత్రి వసూలు చేస్తున్న ఫీజులపై వాస్తవాలు రాబట్టే ప్రయత్నం చేశారు. విచారణ అనంతరం డాక్టర్ మమత మాట్లాడుతూ పోలీసులు నోటీసులు ఇవ్వడంతో విచారణకు హాజరు అయినట్లు తెలిపారు. పోలీసులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానని, తనను పోలీసులు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని తెలిపారు.
కీలక అంశాలు రాబట్టాం..
ఏసీపీ సూర్యచంద్రరావు మాట్లాడుతూ.. ‘స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో పదిమందికి నోటీసులు ఇచ్చాం. ఇవాళ డాక్టర్ మమత విచారణకు హాజరయ్యారు. విచారణలో ఆమె నుంచి కీలక అంశాలు రాబట్టాం. డాక్టర్ మమత అగ్ని ప్రమాదం జరిగిన రమేష్ ఆసుపత్రి కొవిడ్ కేర్ సెంటర్ పర్యవేక్షణ కూడా చూసారు. ఆమెను ఇంకా విచారణ చేయాల్సి ఉంది. రిమాండ్‌లో ఉన్న ముగ్గురు రమేష్ ఆసుపత్రి సిబ్బందిని పోలీసు కస్టడీకి కోరుతూ పిటిషన్ వేశాం. విచారణ సోమవారానికి వాయిదా పడింది. వారిని కస్టడీకి తీసుకుని వారి నుంచీ సేకరించాల్సిన వివరాలు చాలా ఉన్నాయి. కోవిడ్ పేషెంట్ల నుంచి అధిక ఫీజులు వసూలు చేసినట్లు ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. నోటీసులు అందుకున్న వారంతా విచారణకు సహకరిస్తారని భావిస్తున్నాం. విచారణకు సహకరించకపోతే సెక్షన్ 171 ప్రకారం అరెస్టు చేసే అధికారం మాకుంది’ అని తెలిపారు.
కాగా స్వర్ణ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ ఆస్పత్రి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి 10మంది మృతి చెందడానికి కారణమైన ఘటనలో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పరారీలో ఉన్న రమేష్ ఆసుపత్రి చైర్మన్ రమేష్ బాబు, స్వర్ణ ప్యాలెస్ యజమాని శ్రీనివాస్ బాబుకోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. (అగ్ని ప్రమాద ఘటన: విచారణ వేగవంతం..)
Comments
Please login to add a commentAdd a comment