
తుప్పలు కొట్టి రహదారి పనులు ప్రారంభిస్తున్న ఓఎస్డీ సూర్యచంద్రర్రావు
మక్కువ (సాలూరు): నేరస్తులు, వివిధ ఘర్షణలతో వచ్చిన నిందితులు, బాధితుల మధ్య ఎప్పుడూ బిజీబిజీగా పోలీసులు గడుపుతుంటారు. ఇక సామాజిక సేవల జోలికి పోవడానికి తీరికెక్కడుంటుందని అందరం అనుకుంటుంటాం. విజయనగరం జిల్లా మక్కువ పోలీసులు దీనికి భిన్నం. గిరిజన ప్రాంతంలో సమస్యలను గుర్తించి.. స్వయంగా తామే శ్రమదానానికి నడుం బిగించి శభాష్ అనిపించుకుంటున్నారు. ఓఎస్డీ సూర్యచంద్రరావు తన సిబ్బందితో ఇటీవల గిరిశిఖర గ్రామాలను సందర్శించారు. మక్కువ, సాలూరు మండలాలకు చెందిన పలు గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు. ఎలాగైనా తమ వంతుగా కృషి చేసి, గిరిజన గ్రామాలకు రహదారి ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు పదునుపెట్టారు.
మక్కువ మండలం ఎగువ మెండంగి గ్రామం నుంచి సాలూరు మండలం తాడిపుట్టి గ్రామం వరకు రహదారి ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. సుమారు 100 మంది పోలీసులతో ఓఎస్డీ సూర్యచంద్రరావు శుక్రవారం ఎగువమెండంగి గ్రామానికి చేరుకున్నారు. ఆయా గిరిజన గ్రామాలకు చెందిన గిరిజనులతో మమేకమై గిరిజన ‘బాట’ ఏర్పాటుకు నడుంబిగించారు. ఎగువమెండంగి గ్రామం నుంచి తాడిపుట్టి గ్రామాల మధ్యనున్న రాళ్లు, రప్పలు, తుప్పలు, డొంకలను తొలగించి సుమారు 800 మీటర్ల మేర రహదారిని ఏర్పాటు చేశారు. మండుతున్న ఎండలోనూ పోలీసులంతా రహదారి ఏర్పాటు పనుల్లో నిమగ్నమై ఓ రూపును తీసుకొచ్చారు. సాలూరు సీఐ ఎల్.అప్పలనాయుడు, ఎస్టీఫ్ ఆర్‌ఐ పి.నాగేశ్వరరరావు, మక్కువ ఎస్‌ఐ కె.రాజేశ్, పోలీస్ సిబ్బంది, గిరిజనులు పాల్గొన్నారు.
రహదారి ఏర్పాటు చేస్తున్న పోలీసులు, గిరిజనులు
Comments
Please login to add a commentAdd a comment