భార్యను ఏమార్చి రెండో వివాహం | Police Registered Second Marriage Case On Husband While The Wife Was Still Present In Kandukur | Sakshi
Sakshi News home page

భార్యను ఏమార్చి రెండో వివాహం

Published Sat, Aug 31 2024 2:00 PM | Last Updated on Sat, Aug 31 2024 3:33 PM

Police registered marriage case on husband while the wife was still present

విషయం తెలుసుకొని కల్యాణ మండపానికి చేరుకున్న వైనం 

అప్పటికే పూర్తయిన తంతు  

ఇరువర్గాల గొడవ 

పోలీస్‌స్టేషన్‌కు చేరిన వ్యవహారం

కందుకూరు: భార్యతో ప్రేమగా ఉంటూనే ఆమె కళ్లుగప్పి మరో వివాహం చేసుకున్నారో ప్రబుద్ధుడు. విషయం తెలుసుకున్న ఆమె కల్యాణ మండపానికి చేరుకునేలోపే మరో యువతితో వివాహం జరిగిపోయింది. దీంతో వివాదం పోలీస్‌స్టేషన్‌కు చేరింది. కందుకూరు పట్టణంలో ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. బాధితురాలి వివరాల మేరకు.. దగదర్తి మండలం ధర్మవరానికి చెందిన యర్రయ్య కుమారుడు రూబేను బీటెక్‌ పూర్తి చేశారు. 

కావలిలోని కచ్చేరిమిట్ట కాలనీలో నివాసం ఉంటున్న అరుణకుమారి, విజయ్‌కుమార్‌ దంపతుల కుమార్తె నీలిమతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. దీంతో వీరు 2012లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరికి కెవిన్‌ రూబెన్, స్టెపానీ గోల్డ్‌ పిల్లలు. ఈ క్రమంలో గ్రామంలో మీ సేవ, ఆన్‌లైన్‌ సెంటర్‌ను కొంతకాలం నిర్వహించారు. అనంతరం దంపతుల నడుమ ఏర్పడిన విభేదాలు పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లాయి. పెద్దల సమక్షంలో రాజీ చేసుకొని ఇటీవల నుంచి సఖ్యతగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమంటూ రూబేను హైదరాబాద్‌ వెళ్లారు. అక్కడే ఉద్యోగం చేస్తున్నట్లు భార్య, పిల్లలను నమ్మించారు. కావలి కోర్టులో ఉద్యోగం చేస్తున్న నీలిమ అక్కడే ఉంటూ పిల్లలను చూసుకోసాగారు. 

ఫోన్‌ నంబర్‌ బ్లాక్‌ 
నిత్యం భార్యాపిల్లలతో ఫోన్లో మాట్లాడే రూబేను అకస్మాత్తుగా నీలిమ నంబర్‌ను బ్లాక్‌ చేశారు. కోర్టు విధులకు శుక్రవారం హాజరైన నీలిమ.. రూబేనుకు కందుకూరులో మరో వివాహం జరుగుతోందనే విషయాన్ని పాస్టర్‌ ద్వారా తెలుసుకున్నారు. వెంటనే పిల్లలు, బంధువులతో కలిసి వివాహం జరుగుతున్న ఎస్వీఎస్‌ కల్యాణ మండపానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకునేసరికే భర్త రెండో వివాహం పూర్తయిపోయింది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు రూబేనును స్టేషన్‌కు తరలించారు.  

పేరు మార్చుకొని.. 
వివాహం కోసం తన పేరును ఆదర్శ్‌గా మార్చుకొని కందుకూరు మండలం కోవూరుకు చెందిన శ్రీవాణిని వివాహం చేసుకున్నారు. మొదటి భార్య వచ్చి బండారం బయటపెట్టడంతో పెళ్లి వివాదంగా మారింది. దీంతో శ్రీవాణిని ఆమె తరఫు బంధువులు ఇంటికి తీసుకెళ్లారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement