గుణదల (విజయవాడ తూర్పు): నగరంలో దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయకంపితులను చేస్తున్న చెడ్డీ గ్యాంగ్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ టి.కె.రాణా తెలిపారు. నగరంలోని గుణదల, మధురానగర్ రైల్వేస్టేషన్ ప్రాంతాలను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరంలో చెడ్డీ గ్యాంగ్ తాళం వేసిన ఇళ్లు, విల్లాస్, అపార్టుమెంట్లలో తరచూ దొంగతనాలకు పాల్పడుతూ కలకలం సృష్టిస్తున్నారని, దీనివలన ప్రజలు ఆందోళనకు గురవుతున్నారన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు.
దక్షిణాది రాష్ట్రాల్లోనే దోపిడీలు
గుజరాత్ రాష్ట్రంలోని చాహోత్ జిల్లా నుంచి చెడ్డీ గ్యాంగ్ నగరంలోకి ప్రవేశించింది. గత పది రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతూ సంచరిస్తోంది. కేవలం దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో తరచూ ఈ గ్యాంగ్ దోపిడీలు చేస్తుంటారని టి.కె.రాణా తెలిపారు. కేవలం రాత్రి సమయాల్లోనే నివాసాల మధ్య తిరుగుతూ చోరీలు చేయటమే వీరి లక్ష్యమని వివరించారు.
రైల్వే స్టేషన్‌లే వీరి జాగాలు...
రాత్రుళ్లు దొంగతనాలకు పాల్పడే చెడ్డీ గ్యాంగ్ సభ్యులు పగటి పూట యాత్రికులుగా నటిస్తారు. అందుకే దూర ప్రాంతాల నుంచీ వచ్చిపోయే ప్రయాణికుల్లా రైల్వే స్టేషన్లలో ఉంటుంటారు. ఎవరికీ అనుమానం రాకుండా అమాయకుల్లా నటిస్తూ మోసం చేయటం వీరికి వెన్నతో పెట్టిన విద్య. దోపిడీలు పూర్తయిన తరువాత వీరు రైలు మార్గాల ద్వారానే వారివారి స్వస్థలాలకు చేరుకుంటారని పోలీస్ కమిషనర్ వివరించారు. సాధారణంగా వీరు అర్ధరాత్రి 1–4 గంటల మధ్య దొంగతనాలు చేస్తుంటారని చెప్పారు.
దాడికి పాల్పడరు..
చెడ్డీ గ్యాంగ్ దోపిడీకి అడ్డు వచ్చిన వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడతారని, అవసరమైతే హత్య చేసేందుకు కూడా వెనుకాడరని అపోహలు ప్రచారంలో ఉన్నాయని, అయితే ఇవి నమ్మదగినవి కావని సీపీ స్పష్టం చేశారు. గత పది రోజుల వ్యవధిలో నగరంలో 3 చోట్ల ఈ చెడ్డీ గ్యాంగ్ చోరీలకు పాల్పడ్డారని, ఈ ఘటనల్లో సుమారు పది లక్షల రూపాయల విలువ చేసే వెండి వస్తువులు, బంగారు ఆభరణాలు దోచుకుపోయారని, అయితే ఆయా ఘటనల్లో ఎవరిపైనా దాడి చేయలేదన్నారు.
ప్రత్యేక టీమ్‌ల ఏర్పాటు..
చెడ్డీ గ్యాంగ్‌ను అదుపులోనికి తీసుకునే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే గ్యాంగ్ సభ్యుల కదలికలపై నిఘా ఉంచామన్నారు. ఇటీవల జరిగిన చోరీల సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించినట్లు చెప్పారు. నగర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్‌లలో చెడ్డీ గ్యాంగ్‌పై సమాచారాన్ని అందించామన్నారు. క్రైమ్, లా అండ్ ఆర్డర్, పోలీసులను పది బృందాలుగా నియమించినట్లు వివరించారు. అనంతరం గుణదల, మధురానగర్ రైల్వే స్టేషన్లలో పర్యటించారు. డీసీపీ హర్షవర్థన రాజు, మాచవరం పోలీసులు హాజరయ్యారు.
గుజరాత్‌కు ప్రత్యేక బృందాలు
చెడ్డీగ్యాంగ్‌ను పట్టుకునేందుకు పోలీస్ టీమ్‌లను గుజరాత్‌కు పంపినట్లు సీపీ టి.కె.రాణా తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా చెడ్డీగ్యాంగ్ దొంగల ఫొటోలను సేకరించిన పోలీసులు మరిన్ని వివరాల కోసం ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే గుజరాత్ పోలీసులతో చర్చలు జరిపి దొంగలను పట్టుకునేందుకు సంయుక్త కార్యాచరణ అమలు చేస్తున్నారు. నగర ప్రజలు అందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని పోలీసు వ్యవస్థ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. డీసీపీ బాబూరావు, ఏడీసీపీ శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment