సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సవాల్ విసిరే ఎంతటి క్లిష్టమైన కేసులనైనా ప్రకాశం జిల్లా పోలీసులు ఇట్టే ఛేదిస్తున్నారు. చకచకా దర్యాప్తు పూర్తి చేస్తూ నేరస్తులను న్యాయస్థానాల ముందు నిలబెడుతున్నారు. ‘పోలీస్ అంటే వీడేరా’ అనిపించుకుంటూ.. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కించుకుంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను అందిపుచ్చుకుంటూ దర్యాప్తు విషయంలో ఇతర జిల్లాల పోలీసులకు నమూనాగా నిలుస్తున్నారు. ఇందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం అనుసరిస్తున్న ‘జూనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (జియో) ప్రాజెక్ట్’ బాగా ఉపయోగపడుతోంది.
ఏమిటీ.. జియో ప్రాజెక్ట్!
రాష్ట్రంలోనే ప్రప్రథమంగా 2019 అక్టోబర్ 11న ప్రకాశం జిల్లాలో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆలోచనల నుంచి జియో ప్రాజెక్ట్ (జూనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రాజెక్ట్) పురుడు పోసుకుంది. అంతకుముందు వరకు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐ స్థాయి అధికారులు మాత్రమే కేసుల దర్యాప్తు చేపట్టేవారు. డీఎస్పీలు శాఖాపరమైన పాలనా వ్యవహారాలు, సీఐలు, ఎస్‌ఐలు రోజువారీ విధుల్లో నిమగ్నమై ఉండటం వల్ల కేసుల దర్యాప్తు నత్తనడకన సాగేది. జియో ప్రాజెక్ట్ కింద ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లకు కూడా కేసుల దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు.
ఇందుకోసం వారికి ప్రత్యేకంగా శిక్షణ సైతం ఇచ్చారు. కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో తర్ఫీదునిచ్చారు. కేసుల దర్యాప్తు ఎలా చేయాలనే అంశంపై సీఐలు, డీఎస్పీలు, అనుభవజు్ఞలైన అధికారుల ద్వారా ఎన్నో మెళకువలు నేరి్పంచారు. దీంతో జూనియర్ ఇన్వెస్టిగేషన్ అధికారులు దర్యాప్తులో వేగం పుంజుకున్నారు. వారిలో ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టి వారానికి కొన్ని కేసులు ఇచ్చి దర్యాప్తు చేయించటం, కేసు డైరీలు (సీడీలు) సిద్ధం చేయించటంలో మెళకువలు నేరి్పంచారు. వీరిని సీనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు (సియో) అయిన ఎస్సై, సీఐ, డీఎస్పీలకు సాయంగా ఉండేలా తీర్చిదిద్దారు.
పెండింగ్ కేసుల పరిష్కారంలో మొదటి స్థానం
కేసుల దర్యాప్తులో ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లను భాగస్వామ్యులను చేయడంతో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఎన్నో కేసులకు పరిష్కారం లభించింది. అపరిష్కృతంగా ఉన్న అనేక కేసులను జియోలు దర్యాప్తు చేపట్టి నిందితులను కోర్టుల్లో హాజరుపరిచారు. తద్వారా కేసుల పరిష్కారంలో ప్రకాశం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్‌ఎస్) నివేదిక ప్రకారం ప్రకాశం జిల్లాలో 32,762 కేసులు పెండింగ్‌లో ఉండగా.. వాటిలో 81 శాతం దర్యాప్తు పూర్తయ్యాయి. ఇంకా 6,223 కేసులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇదే సందర్భంలో జిల్లాకు సంబంధించి వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు 15,476 కాగా.. వాటిని కూడా పూర్తిగా పరిష్కరించారు.
జియోలకు ప్రత్యేక గుర్తింపు....
జియోలకు ప్రత్యేక గుర్తింపు తేవటంతో పాటు ఎస్సైలు, సీఐలతో గ్రూప్ డిస్కషన్స్ (బృంద చర్చలు) ఏర్పాటు చేశారు. సందేహాలను నివృత్తి చేయటం, వృత్తిలో నైపుణ్యం పెంచటం లాంటి మెళకువలు నేరి్పంచారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో జియోలకు ప్రత్యేకంగా వర్క్ స్టేషన్ ఏర్పాటు చేశారు. జూనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అనే నేమ్ ప్లేట్, ఒక టేబుల్, కుర్చీ కూడా ఏర్పాటు చేసి గౌరవప్రదమైన అవకాశం కలి్పంచారు. సాంకేతిక పరమైన అంశాల్లో అనుభవమున్న ఒక కానిస్టేబుల్‌ను టెక్నికల్ అసిస్టెంట్(టీఏ)ను సహాయంగా కేటాయించారు. జీఏలకు ట్రావెలింగ్ అలవెన్స్ (టీఏ) అదనంగా ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు.
జిల్లాలో 24 వేల వరకు ఫిర్యాదులు...
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఏటా 24 వేల వరకు ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తుంటాయి. వాటిలో ఎఫ్‌ఐఆర్ నమోదు కానివి, నమోదుకు అర్హత లేని పిటిషన్లు కూడా ఉంటాయి. మొత్తం మీద 12 వేల వరకు ఎఫ్‌ఐఆర్‌లు అవుతుంటాయి. వాటిలో సుమారు 6 వేల కేసుల వరకు ఇన్వెస్టిగేషన్ పెండింగ్‌లో ఉంటాయి. గతంలో ఎస్సైలు 63.83 శాతం కేసులను మాత్రమే పర్యవేక్షించగలిగేవారు. జియో వ్యవస్థ రావడంతో అవి కాస్తా 11.46 శాతానికి పరిమితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment