బడి 'రెడీ': నేటి నుంచి ప్రైమరీ స్కూళ్లు | Primary schools from today in AP | Sakshi
Sakshi News home page

బడి 'రెడీ': నేటి నుంచి ప్రైమరీ స్కూళ్లు

Published Mon, Feb 1 2021 5:59 AM | Last Updated on Mon, Feb 1 2021 6:05 AM

Primary schools from today in AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలు సహా అన్ని పాఠశాలలు ఫిబ్రవరి 1 నుంచి పూర్తిస్థాయిలో పనిచేయనున్నాయి. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ 1 నుంచి 5 తరగతులుండే ప్రాథమిక పాఠశాలల్లోనూ సోమవారం నుంచి తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో 9 నుంచి 12 తరగతులను నవంబర్‌ 2 నుంచి.. అనంతరం 7, 8 తరగతులను నిర్వహిస్తూ వచ్చిన ప్రభుత్వం సంక్రాంతి సెలవుల తర్వాత ఆరో తరగతి విద్యార్థులకూ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో.. ఎలిమెంటరీ స్కూళ్లలోని 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు కూడా సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల తరగతుల నిర్వహణకు సంబంధించిన టైమ్‌ టేబుల్‌ను రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి విడుదల చేసింది. ఎలిమెంటరీ స్కూళ్లలోని 1, 2, 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఉ.9 గంటల నుంచి మ.3.45 గంటల వరకు తరగతులు ఉంటాయి. విరామాలు, ఆనంద వేదిక కార్యక్రమాలు సçహా మొత్తం ఏడు పీరియడ్లు నిర్వహిస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు ఉ.9 నుంచి మ.3.45 వరకు.. అలాగే 6 నుంచి 8 తరగతుల విద్యార్థులకు ఉ.9 నుంచి మ.4.10 వరకు తరగతులు నిర్వహించేలా టైమ్‌టేబుల్‌ను ప్రకటించారు.

ఒకరి వస్తువు ఇంకొకరు వాడకూడదు
విధి విధానాలకు సంబంధించి కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్‌ నియమాలను ప్రకటించింది. పెన్నులు, పుస్తకాలు, పెన్సిళ్లు, వాటర్‌ బాటిళ్లు.. ఇలా ఏదైనా సరే ఒకరి వస్తువు ఇంకొకరు వినియోగించరాదని స్పష్టంచేసింది. అంతేకాక..
► నాన్‌ కంటైన్‌మెంటు జోన్లలోని స్కూళ్లను మాత్రమే తెరవాలి.
► విద్యార్థులు అన్నివేళలా మాస్కులను ధరించాలి. స్కూళ్లలో పరిశుభ్ర వాతావరణం ఉండేలా చూడాలి.
► విద్యార్థులు ఎవరైనా జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతున్నట్లు గమనిస్తే ఇంటికి పంపించి వైద్య పరీక్షలకు సూచించాలి.
► తల్లిదండ్రులు తమ పిల్లలకు జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే ముందుగానే దగ్గర్లోని హెల్త్‌ సెంటర్లో పరీక్షలు చేయించాలి.
► హ్యాండ్‌ శానిటైజర్‌ను అందుబాటులో ఉంచి విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకునేలా చూడాలి. భోజనానికి ముందు, మరుగుదొడ్డికి వెళ్లివచ్చాక చేతులను శుభ్రం చేసుకునేలా అవగాహన కల్పించాలి.
► భౌతిక దూరం పాటిస్తూ స్కూళ్లలోకి ప్రవేశించేలా చూడాలి. విద్యార్థుల మధ్య ఆరు అడుగుల భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేయాలి.
► విద్యార్థులను, వారి తల్లిదండ్రుల అంగీకారాన్ని తీసుకుని మాత్రమే పాఠశాలల్లోకి ప్రవేశాన్ని అనుమతించాలి.
► తరగతి గదులను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి.
► వృద్ధులు, అనారోగ్య సమస్యలున్న వారు ఇళ్లలో కనుక ఉంటే అలాంటి విద్యార్థులను స్కూళ్లకు అనుమతించకుండా ఇళ్ల వద్దనే ఉండేలా చూడాలి. ప్రధానోపాధ్యాయులు ఈ అంశాలను దగ్గరుండి పర్యవేక్షించాలి.
► భౌతిక దూరం పాటిస్తూ సెక్షన్‌కు 16 మందిని మాత్రమే అనుమతించాలి. రోజు విడిచి రోజు బ్యాచుల వారీగా నిర్వహించడం లేదా ఒక పూట ఒక బ్యాచ్‌కు, మరో పూట మరో బ్యాచ్‌కు తరగతులు నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
► అసెంబ్లీ, గ్రూప్‌ వర్కు, గేములు వంటి వాటిని తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు నిర్వహించరాదు.
► మధ్యాహ్న భోజనాన్ని బ్యాచుల వారీగా వేర్వేరు సమయాల్లో అందించాలి.
► విరామ సమయాన్ని 10 నిమిషాల చొప్పున ఇచ్చినా విద్యార్థులు గుమిగూడకుండా, ముఖాముఖి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
► స్కూలు వదిలిన సమయంలో కూడా బ్యాచుల వారీగా పది నిమిషాల వ్యవధి ఇస్తూ విద్యార్థులను క్రమపద్ధతిలో వెళ్లేలా చూడాలి.
► రోజు విడిచి రోజు ఇద్దరు విద్యార్థులు, ఒక సిబ్బందికి ర్యాండమ్‌ టెస్టులు నిర్వహించాలి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement