‘అప్పట్లో.. అనగనగా ఓ ఊరు.. రాత్రయితే కానరాని వెలుతురు.. కిరోసిన్ బుడ్డి కిందే చదువు.. అయినా ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకే.. సాధారణ రైతు బిడ్డగా జన్మించి.. అగ్రరాజ్యానికి హృదయ స్పందనై నిలిచారు.. జన్మ భూమిని.. పల్లె ప్రేమను ఎప్పుడూ మర్చిపోలేదు.. సప్త సముద్రాల అవలి నుంచే సొంతూరి దాహం తీరుస్తూ.. విద్యతోనే ఉన్నతని నిరూపిస్తూ.. గ్రామంలో బాటలు వేస్తూ.. ప్రజలందరితో ఎంతమంచి మా ‘ప్రేమ్’యో అంటూ కీర్తి పొందారు. ఆయన మరెవరో కాదు.. డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి..’
సాక్షి,అమరావతి: అమెరికా.. ప్రపంచంలోనే అగ్రరాజ్యం. అక్కడ అడుగు పెట్టాలంటేనే ఎంతో కష్టం. కానీ, ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన యువకుడు మూడు దశాబ్దాల కిందటే అమెరికాలో ఆస్పత్రి కట్టాడు. అప్పటి వరకు ఏ తెలుగువాడికి కూడా ఇంత సాహసం చేయలేదు. అనతి కాలంలోనే ప్రైమ్ హెల్త్‌కేర్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అప్పటి నుంచి ప్రేమ్ అమెరికాకు హృదయ స్పందనగా మారిపోయారు.
డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి విద్యుత్ సౌకర్యం కూడా లేని ఒక మారుమూల గ్రామంలో పుట్టి కిరోసిన్ దీపం వెలుతురులో చదువుకుని వైద్య రంగంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంటపాళెం అనే ఒక చిన్న గ్రామంలో 1949లో జూన్ 26న ననమాల సుందరామిరెడ్డి, కృష్ణవేణమ్మ దంపతులకు జన్మించారు. నలుగురు సంతానంలో ప్రేమ్ పెద్దవారు. గ్రామంలోనే హైసూ్కల్ వరకు చదువుకున్నారు.
విజయవాడలో పీయూసీ, తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీలో చేరి 1973లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. వెల్లూరులో హౌస్ సర్జన్ అయ్యాక అమెరికా వెళ్లి న్యూయార్క్‌లోని డౌన్ స్టేట్ మెడికల్ సెంటర్లో ఇంటర్నల్ మెడిసిన్‌లో రెసిడెన్సీతో పాటు కార్డియాలజీలో ఫెలోషిప్ పూర్తి చేశారు. 1981లో సదరన్ కాలిఫోర్నియాలో మెడికల్ ప్రాక్టీస్ ప్రారంభించారు. అయిదు వేలకుపైగా కార్డియాక్ ప్రొసీజర్స్ చేసి సమర్థుడైన వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు. 1985లో కాలిఫోరి్నయాలోనే ‘ప్రైమ్ కేర్ మెడికల్ గ్రూప్స్’ పేరుతో మల్టీస్పెషాలిటీ మెడికల్ గ్రూప్ ప్రారంభించారు. 1990లో ప్రేమ్ హెల్త్‌కేర్ సర్వీసెస్ ఇంటర్నేషన్‌ల్ సంస్థను స్థాపించి వైద్య అవసరాలకు అనుగుణంగా విస్తరించారు.
ఇందులో భాగంగానే చినోవ్యాలీలో 126 పడకల చినోవ్యాలి మెడికల్ సెంటర్‌ను, కాలిఫోర్నియాలో సొంతంగా 150 పడకల అక్యూట్ కేర్ హాస్పిటల్‌ని నిర్మించారు. ఇప్పుడు ప్రైమ్ హెల్త్‌కేర్ ఆధ్వర్యంలో అమెరికాలోని 14 రాష్ట్రాల్లో 46 ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. 45 వేల మందికిపైగా యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. యూఎస్‌లో అగ్ర వైద్య వ్యవస్థల్లో ఏడాదికి 5 బిలియన్ల డాలర్ల టర్నోవర్‌తో టాప్ 5 స్థానంలో ప్రైమ్ కేర్ గుర్తింపు పొందింది. చారిటబుల్ ఫౌండేషన్‌ను కూడా స్థాపించి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. అమెరికాలోని అనేక స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు, స్థానిక ప్రభుత్వం నుంచి అనేక ఉత్తమ సేవా అవార్డులు అందుకున్నారు.
సాహితీ సేవలోనూ..
సాహిత్యం అంటే ప్రేమ్‌రెడ్డికి చాలా ఇష్టం. దువ్వూరి రామిరెడ్డి రచించిన గులాబీ తోట, పండ్లతోట అనే ముద్రణకు నోచుకోని రెండు కావ్యాలను సొంతంగా ముద్రించారు. కడపటి వీడ్కోలు కావ్యాన్ని ఇంగ్లిష్‌లో అనువాదం కూడా చేశారు. ఆయని ఇతర రచనలను ద లాస్ట్ ఫేర్‌వెల్ అండ్ అదర్ పోయెమ్స్ పేరుతో పెద్ద సంపుటిగా మార్కెట్‌లోకి తీసుకొచ్చారు.
ఇదీ కుటుంబం..
ప్రేమ్ ఎస్.రెడ్డి తనతోపాటు మెడిసిన్‌ను అభ్యసించిన అమ్మాయినే (శాంతిరెడ్డి) వివాహం చేసుకుని జంటగా అమెరికాలో అడుపెట్టారు. ప్రేమ్‌రెడ్డికి ముగ్గురు సంతానం. పెద్దమ్మాయి కవితారెడ్డి అమెరికాలోని పిడియాట్రిక్స్ పూర్తి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. రెండో అబ్బాయి అశోక్‌రెడ్డి వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. మూడో సంతానం సునీతారెడ్డి.
నేడు ప్రేమ్‌కు పౌర సన్మానం
ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు నెల్లూరులో ప్రేమ్‌సాగర్‌రెడ్డికి పౌర సన్మానం చేయనున్నారు. 15 ఏళ్ల తర్వాత సొంత గడ్డకు వస్తున్న నేపథ్యంలో సోమవారం గొలగమూడి రోడ్డులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో సాయంత్రం 4 గంటలకు వేలాది మంది మధ్య ఘనంగా సత్కరించనున్నారు.
సొంతూరిని మర్చిపోలేదు
ప్రేమ్ ఎస్.రెడ్డి ఎంత ఎదిగినా.. వచ్చిన దారిని మర్చిపోలేదు. అందుకే తన సొంత గ్రామంలో హైసూ్కల్‌ను కట్టించడంతో పాటు రోడ్లను అభివృద్ధి చేస్తూ ప్రేమను చాటుకుంటున్నారు. దాదాపు 50 చుట్టుపక్కల గ్రామాలకు సురక్షిత తాగునీటిని అందిస్తున్నారు. నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లోని గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో రూ.కోట్ల విలువైన ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లను ఏపీ ప్రభుత్వానికి ఇచ్చి తన బాధ్యతను చాటుకున్నారు.
సంపాదించినదంతా సమాజానికే..
‘నేనెప్పుడూ పేరు కోసమో, ప్రచారం కోసమో పనిచేయలేదు... సంపాదించినదంతా సమాజానిదే.. అందుకే సమాజసేవకే దానిని ఉపయోగించాలి. ఇక్కడ సంపాదించిన దానిని ఇక్కడే సమాజసేవకు ఉపయోగిస్తున్నాను. జన్మనిచ్చినందుకు మాతృభూమికి కూడా సేవ చేస్తున్నాను‘.. అంటారు డాక్టర్ ప్రేమ సాగర్‌రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment