
శిరోముండనం చేయించుకుంటున్న సీపీఐ నాయకులు
ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మంగళవారం సీపీఐ నేతలు శిరోముండనం చేయించుకుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తలనీలాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు కొరియర్ ద్వారా పంపనున్నట్టు వారు వెల్లడించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం జరిగిందని, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కేటాయింపు, నిధుల మంజూరులో నిర్లక్ష్యం వహించారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక నిధులు, జాతీయ ప్రాజెక్టు పోలవరానికి నిధుల కేటాయింపులో వివక్ష చూపారని మండిపడ్డారు. సీపీఐ నగర కార్యదర్శి మరుపల్లి పైడిరాజు, కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సత్యనారాయణ, ఎం.శ్రీనివాస్, ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఎ.విమల, జి.జయమ్మ ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment