
నెల్లూరు(అర్బన్): జిల్లాలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 19 నాటికి డ్రాఫ్ట్ తయారు చేసి 23న ఎలక్ట్రోరల్ రోల్స్ జాబితాను ప్రచురిస్తామని కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 7వ తేదీ నాటికి 1,13,837 మంది పట్టభద్రులు, 7,783 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా చేరేందుకు దరఖాస్తులు సమర్పించారన్నారు.
తాము ప్రచురించే ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను డిసెంబర్ 9వ తేదీ వరకు స్వీకరిస్తామన్నారు. వచ్చిన అభ్యంతరాలను 25వ తేదీ నాటికి పరిష్కరించి తుది జాబితాను డిసెంబర్ 30న ప్రచురిస్తామన్నారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 76 పోలింగ్ కేంద్రాలను, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 36 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మౌలిక వసతులు ఉన్న పాఠశాలలు, కళాశాలలను పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేశామన్నారు.
ప్రతి మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రం ఉంటుందన్నారు. ఆత్మకూరు, బుచ్చి, కోవూరు, పొదలకూరు, ఉదయగిరి, వింజమూరు, కలిగిరి మండలాల్లో రెండు పోలింగ్ కేంద్రాలు వంతున, కందుకూరులో 4, కావలిలో 6, నెల్లూరు అర్బన్‌లో 9, నెల్లూరు రూరల్‌లో 19 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో పాల్గొన్న పలు పార్టీల ప్రతినిధులు ఎన్నికల నిర్వహణపై తమ సూచనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ తరఫున మురళీధర్‌రెడ్డి, టీడీపీ తరఫున వెంకటేశ్వరరెడ్డి, బీజేపీ నుంచి ప్రవీణ్‌కుమార్, కాంగ్రెస్ నుంచి బాలసుధాకర్, సీపీఎం నుంచి మోహన్‌రావు తదితరులు హాజరయ్యారు.