సాక్షి, అమరావతి: ఈనాడు రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంసీఎఫ్‌పీఎల్) అక్రమాల బండారం బద్దలైంది. రిజర్వ్ బ్యాంకు నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ చందాదారుల ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్న అరాచకం ఆట కట్టింది. చిట్‌ఫండ్ చట్టాన్ని తుంగలో తొక్కేస్తూ రామోజీ సాగిస్తున్న అవినీతి ఆధారాలతో సహా నిరూపితమైంది. కొన్ని నెలల క్రితం స్టాంపులు– రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ఆ సంస్థ కార్యాలయాల్లో నిర్వహించిన సోదాలతో అక్రమాల డొంక కదిలింది. దీనిపై ఆ శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో సీఐడీ రంగంలోకి దిగడంతో రామోజీరావు అవినీతి సామ్రాజ్యం బాగోతం మొత్తం బహిర్గతమైంది.
చట్టాన్ని యథేచ్చగా ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ఆ సంస్థపై సీఐడీ అధికారులు శనివారం కేసు నమోదు చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు ఏ–1గా, మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ, రామోజీరావు పెద్ద కోడలు చెరుకూరి శైలజ ఏ–2గా, మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను ఏ–3గా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. వారిపై సెక్షన్లు 120(బి), 409, 420, 477(ఎ) రెడ్‌విత్ 34 సీఆర్‌సీపీ కింద కేసు నమోదు చేశారు. ఏపీ ఆర్థిక సంస్థల డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం–1999, చిట్ ఫండ్ చట్టం–1982 కింద కూడా కేసు నమోదు చేసినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
చందాదారుల హక్కులకు విఘాతం
మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ బ్రాంచి కార్యాలయాల్లో రాష్ట్ర స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో సోదాలు నిర్వహించింది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు, చిట్ ఫండ్ చట్టానికి విరుద్ధంగా ఆ సంస్థ అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించింది. ఆ తనిఖీల్లో మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచి మేనేజర్లు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులకు ఏమాత్రం సహకరించ లేదు. దాంతో అధికారులు హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో గత ఏడాది డిసెంబర్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మరిన్ని అక్రమాలు వెలుగు చూశాయి.
చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ చందాదారుల హక్కులకు విఘాతం కలిగిస్తున్నారని ఆధారాలతో సహా నిర్ధారించారు. సంస్థ యాజమాన్యం తమ స్వప్రయోజనాల కోసం అక్రమాలకు పాల్పడుతోందని నిగ్గు తేల్చారు. దాంతో చందాదారుల హక్కుల పరిరక్షణ, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను అమలు చేయడం కోసం ఈ వ్యవహారాన్ని సీఐడీకి నివేదించారు. విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పల్నాడు, కర్నూలు, అనంతపురం జిల్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్లు ఈ మేరకు సీఐడీకి లిఖిత పూర్వకంగా సీఐడీ విభాగానికి ఫిర్యాదు చేశారు.
దాంతో మార్గదర్శి చిట్ ఫండ్స్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. సీఐడీ అధికారులు విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, అనంతపురంలోని మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో శనివారం సోదాలు నిర్వహించి మేనేజర్లను ప్రశ్నించారు. సోదాలు మొదలుపెట్టగానే నరసరావుపేట, ఏలూరు బ్రాంచి మేనేజర్లు పరారవ్వడం గమనార్హం. ఈ సోదాల్లో సీఐడీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం కూడా సోదాలు కొనసాగించనున్నారు.
ఏలూరు మార్గదర్శి కార్యాలయంలో అధికారుల తనిఖీలు
మార్గదర్శి అక్రమాలు ఇవీ..
► చందాదారులు నెలవారీ మొత్తం చెల్లించకపోయినా, వాయిదాల మొత్తం చెల్లించకపోయినా ఆ ఖాతాలను మార్గదర్శి చిట్‌ఫండ్స్ పేరుతో చూపించారు. అనంతరం నిబంధనలకు విరుద్ధంగా ఆ చీటీలను ఇతర వ్యక్తుల పేరుతో మార్పు చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం.
► చందాదారులు పాడిన చిట్ మొత్తాన్ని వారికి వెంటనే చెల్లించడం లేదు. ఆ మొత్తంపై 4 శాతం నుంచి 5 శాతం వరకు చందాదారునికి వడ్డీ చెల్లిస్తామని చెబుతూ ఓ రశీదు ఇస్తున్నారు. అంటే మార్గదర్శి సంస్థ ఆ చిట్ మొత్తాన్ని డిపాజిట్‌గా స్వీకరిస్తున్నట్టే. ఇది రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధం. చిట్‌ఫండ్ కంపెనీలు
డిపాజిట్లు స్వీకరించడాన్ని చట్టం నిషేధించింది. అయినప్పటికీ మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా “ ప్రత్యేక రశీదు’ ముసుగులో డిపాజిట్లు సేకరించింది.
► మార్గదర్శి చిట్‌ఫండ్స్ తమ ఆదాయ, వ్యయాల ఖాతాలు, ఆస్తి, అప్పుల నివేదికలు, పెట్టుబడుల నివేదికలను వెల్లడించకుండా గోప్యంగా ఉంచింది. ఇది చిట్ ఫండ్ చట్టంలోని సెక్షన్ 28 రెడ్‌విత్ 24 నిబంధనలకు విరుద్ధం.
► మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల నుంచి భారీగా నిధులను మార్గదర్శి ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఆ నిధులను మార్గదర్శి యాజమాన్యం మార్కెట్ రిస్క్ అత్యధికంగా ఉండే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిగా పెట్టింది. ఇది చిట్ ఫండ్ చట్టానికి విరుద్ధం.
రికార్డుల నిర్వహణలో గూడు పుఠాణి
► మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో తాము గుర్తించిన అక్రమాలపై స్టాంప్స్– రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు మరింత లోతుగా పరిశీలించారు. మార్గదర్శి సంస్థ సమర్పించిన ఆర్థిక నివేదికల (ఫైనాన్సియల్ స్టేట్‌మెంట్స్)పరిశీలనకు ఓ చార్టడ్ అకౌంటెంట్‌ను నియమించడం ద్వారా పలు అక్రమాలను గుర్తించారు.
► చిట్టీల వారీగా లాభనష్టాల ఖాతా, బ్యాలెన్స్ షీట్‌లను సక్రమంగా నిర్వహించడం లేదు.
► బ్యాలన్స్ షీట్‌లో నోట్ నంబర్ 7 కింద రూ.459.98 కోట్లు చూపించారు. కానీ పరిశీలించగా ఆ మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్టు నిర్ధారణ అయ్యింది.
► మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థకు మూడు అనుబంధ కంపెనీలు ఉన్నట్టుగా బ్యాలన్స్ షీట్ నోట్ నంబర్ 40లో పేర్కొన్నారు. మార్గదర్శి చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్–చెన్నై, మార్గదర్శి చిట్స్ (కర్ణాటక) ప్రైవేట్ లిమిటెడ్–బెంగళూరు, ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్– హైదరాబాద్‌లను అనుబంధ కంపెనీలుగా చూపించారు. నిధులను నిబంధనలకు విరుద్ధంగా తరలించేందుకే ఇలా చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ ఆ మూడు అనుబంధ కంపెనీల్లో రూ.1,05,80,000 పెట్టుబడి పెట్టినట్టు బ్యాలన్స్ షీట్‌లో చూపించారు. కానీ ఆ కంపెనీల షేర్ హోల్డర్స్ జాబితా పరిశీలించగా.. ఒక్క ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లోనే 88.5 శాతం వాటాతో రూ.2 కోట్లు పెయిడ్ అప్ క్యాపిటల్‌గా పెట్టుబడి పెట్టినట్టు నిర్ధారణ అయ్యింది.
► చిట్ ఫండ్ కంపెనీలు ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం చిట్ ఫండ్ చట్టం–1982కు విరుద్ధం. కానీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు ఉన్న మూడు అనుబంధ కంపెనీలు అదే తరహా వ్యాపారంలో ఉన్నట్టుగా చూపించారు. కానీ ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ చిట్‌ఫండ్ వ్యాపారంలో లేదు. ఇది నిబంధనలకు విరుద్ధం. ఆ కంపెనీలో మార్గదర్శి చిట్ ఫండ్స్ 88.5 శాతం వాటా ఉంది. అంటే ఆ కంపెనీలో నిర్ణయాధికారం మార్గదర్శి సంస్థదే.
అక్రమ డిపాజిట్లు
మార్గదర్శి చిట్ ఫండ్స్ దశాబ్దాలుగా అక్రమ డిపాజిట్లు సేకరిస్తూ వచ్చింది. ఆ సంస్థ కార్యాలయాల్లోనే “మార్గదర్శి డిపాజిట్స్’ అనే పేరుతో భారీగా అక్రమ డిపాజిట్లను సేకరించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో దీనిపై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశారు. అప్పట్లో రిజర్వ్ బ్యాంక్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది.
దాంతో తాము తప్పు చేశామని రామోజీరావు లిఖిత పూర్వకంగా అంగీకరిస్తూ డిపాజిట్‌దారులకు వారి డిపాజిట్ మొత్తాలను వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఇక డిపాజిట్ల సేకరణను నిలిపి వేసిందని అంతా భావించారు. కానీ గుట్టుచప్పుడు కాకుండా “రశీదు’ల రూపంలో అక్రమ డిపాజిట్లు వసూలు చేస్తున్నట్టుగా స్టాంప్స్–రిజిస్ట్రేషన్ల శాఖ ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో బహిర్గతమైంది.
Comments
Please login to add a commentAdd a comment