రామోజీ ‘ప్రసవ యాతన’కు అడ్డూఅదుపూ లేదా? | Ramoji Rao False Allegations On Welfare Schemes Ap | Sakshi
Sakshi News home page

ఛాతీ ఆసుపత్రిలో ప్రసవాలెందుకు చేస్తారు రామోజీ గారూ? మీ ‘ప్రసవ యాతన’కు అడ్డూఅదుపూ లేదా?

Published Fri, Sep 2 2022 5:47 AM | Last Updated on Fri, Sep 2 2022 2:37 PM

Ramoji Rao False Allegations On Welfare Schemes Ap - Sakshi

ఛాతీ ఆసుపత్రిలో ప్రసవాలెందుకు చేస్తారు రామోజీరావు గారూ? మీ ‘ప్రసవ యాతన’కు అడ్డూఅదుపూ లేదా? అధికారాన్ని కనటానికి చంద్రబాబు నాయుడితో కలిసి మీరెంత వేదన పడుతున్నారో జనానికి తెలియనిదేమీ కాదు. అలాగని ప్రతిరోజూ అబద్ధాలేనా? పండగ పూట అంతంత పెద్దగా పతాక శీర్షికల్లో వండి వార్చే ముందు కనీస వాస్తవాలేంటో తెలుసుకోవాలిగా? అనంతపురం సీడీ ఆసుపత్రిలో కొన్నేళ్లుగా ప్రసవాలే జరగటం లేదన్నది మీరు వాకృచ్చిన వార్తా రాజం.

సీడీ ఆసుపత్రి అంటే చెస్ట్‌ డిసీజెస్‌ ఆసుపత్రి. అక్కడ ఊపిరితిత్తుల వ్యాధులు, ఇతర జబ్బులతో బాధపడుతున్న వారికి వైద్యసేవలందిస్తారు. ఇక్కడ గైనిక్‌ సేవలే ఉండవు. అలాంటి చోట గైనకాలజిస్టులు లేరంటూ... కొన్నేళ్లుగా ప్రసవాలే జరగటం లేదంటూ మీర్రాసిన రాతల్లో అర్థమేమైనా ఉందా? మీ చంద్రబాబు హయాంలోనూ ఇది చెస్ట్‌ ఆసుపత్రే కదా? ఇప్పుడెందుకు మీరు అంతయాతన పడుతున్నారు?  

ముఖ్యమంత్రి ఇలాకాలో... అంటూ బాక్సు కట్టి రాసిన రాతలూ అంతే. పులివెందుల ఏరియా ఆసుపత్రిలో 22 మంది వైద్యులకు గాను 10 మందే ఉన్నారంటూ ఎందుకంత విషం చిమ్మటం? అక్కడ మొత్తం 23 మంది వైద్యులని... వారిలో 17 మంది ప్రస్తుతం ఉన్నారని, మరో ఆరుగురు వైద్యులను సమకూర్చడానికి కసరత్తు జరుగుతోందని ఆసుపత్రిలో అడిగితే చెబుతారు కదా? అయినా నిజాలతో పనిలేనపుడు అది తెలుసుకోవాలన్న ఉద్దేశం మాత్రం మీకెందుకుంటుంది లెండి!. ‘వైద్యులు లేక గర్భిణులకు ఇబ్బంది... మత్తు వైద్య నిపుణులకూ కొరతే’ అంటూ మీరు అచ్చేసిన కథనంలో నిజినిజాలేంటో చెప్పడానికి!! 

ఆరోగ్య శ్రీ ఉందిగా... వేలకు వేలు ఖర్చెందుకు? 
‘ఈనాడు’ రాతల్లో మరో దారుణమేంటంటే ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు గానీ, సౌకర్యాలు గానీ లేక.. అంతా ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయించి వేలకువేలు ఖర్చు చేస్తున్నారనేది!!. అసలు ఏ కొంచెమైనా ఇంగితం ఉండాలి కదా? సిజేరియన్‌ కావచ్చు, సాధారణం కావచ్చు... ప్రసవాలన్నీ ఆరోగ్య శ్రీ పరిధిలోనే ఉన్నాయి కదా? ప్రభుత్వాసుపత్రులకు వెళుతున్నారంటే వారంతా అర్హులేనని కదా అర్థం? మరి వాళ్లు ఒకవేళ తప్పనిసరై ప్రయివేట ఆసుపత్రులకు వెళ్లినా ఆరోగ్యశ్రీ కింద ప్రసవం జరుగుతంది కదా? వాళ్లెందుకు వేలకువేలు ఖర్చు చేస్తారు? ఇవేం రాతలు రామోజీరావు గారూ? పైపెచ్చు ప్రసవానికి నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో చేరిన ప్రతి ఒక్కరికీ ప్రసవానంతరం విశ్రాంతి సమయానికి ‘ఆరోగ్య ఆసరా’ కింద ప్రభుత్వం రూ.5వేలు అందిస్తోంది. ఎందుకంటే పనిచేస్తే తప్ప పొట్టనిండని పేదలు ప్రసవానంతరం పనిచేయటం కష్టం కనక ఈ ఆసరా అవసరమన్నది సీఎం ఉద్దేశం. ఈ మూడేళ్లలో ఇలా ఆరోగ్య ఆసరా కింద 2,61,000 మందికి రూ.76.8 కోట్లు చెల్లించింది ప్రభుత్వం. కాకపోతే ఇవేవీ రామోజీకి కనిపించవు. అసలు 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీ కింద ఒక్క ప్రసవమైనా జరిగితే ఒట్టు!. ఎన్నికల గిమ్మిక్కులో భాగంగా 2018 డిసెంబర్లో ఓట్ల కోసం ప్రసవాల్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. 2019 జనవరి 15 నుంచి చికిత్సలు మొదలు పెట్టారు. ఆ సమయంలో ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, మౌలిక వసతులు లేక అందరూ ప్రయివేటు ఆసుపత్రులనే ఆశ్రయించారు. వేలకువేలు వదిలించుకున్నారు. కాకపోతే అప్పుడు రాయాల్సిన రాతలన్నీ ‘ఈనాడు’ ఇప్పుడు రాస్తుండటమే విచిత్రం. చంద్రబాబు హయాంలో 1,051 రకాల చికిత్సలకు మాత్రమే ఆరోగ్య శ్రీ వర్తించగా... ఇపుడది మూడు రెట్లు పెరిగి ఈ నెల నుంచి ఏకంగా 3,158 చికిత్సలకు వర్తించబోతోంది. ఇలాంటి మంచిపనులు ‘ఈనాడు’కు కనిపించకపోవటమే ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం.  

తల్లీబిడ్డకు సురక్షిత ప్రయాణం..
ప్రభుత్వాసుపత్రుల నుంచి ప్రసవానంతరం తల్లీబిడ్డను సురక్షితంగా ఇంటికి చేర్చడానికి ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ సేవల్ని ప్రభుత్వం బలోపేతం చేసింది. గతంలో 279 పాత వాహనాలే దిక్కు కాగా... వీటిని 500కు పెంచటంతో పాటు ఈ మధ్యే 500 కొత్త వాహనాలతో సేవలు విస్తరించారు. ఏప్రిల్‌ నుంచి ఇప్పటికి దాదాపు లక్ష మంది దీన్ని వినియోగించుకున్నారు. మునుపు ఒక ట్రిప్పుల్లో ఇద్దరేసి బాలింతల్ని తరలించటంతో ఇబ్బందులు పడ్డ బాలింతలకు ఇప్పుడు ఒక్కరినే తరలించడం పెద్ద ఊరటే!!. కాకపోతే ఇవేవీ ‘ఈనాడు’కు కనిపించవు.  

40 వేల పోస్టుల భర్తీ... 
మునుపెన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వ హయాంలో ఒక్క వైద్య శాఖలోనే ఏకంగా 40వేల పోస్టులు భర్తీ అయ్యాయి. మిగిలిన కొద్ది పోస్టులు కూడా వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వాసుపత్రుల్ని పునర్నిర్వచించేలా ఏకంగా రూ.16,255 కోట్లతో ‘నాడు–నేడు’ కింద వాటిని బాగు చేస్తున్నారు. ఇక ధనికులు మాత్రమే ఆలోచించగలిగే ‘ఫ్యామిలీ డాక్టర్‌’ విధానాన్ని ప్రతి గ్రామానికీ పరిచయం చేస్తోంది ప్రభుత్వం.   వీటన్నిటికీ తోడు టీడీపీ హయాంలో గర్భిణులకు ముందులనేవి ప్రభుత్వాసుపత్రుల్లో దొరికితే ఒట్టు. నిజానికి గర్భిణులకు, బాలింతలకు రకరకాల సమస్యలు సహజం. గర్భిణులకు రక్తపోటు ఉంటే లాబెటాలోల్‌ మాత్రలు వాడాలి. ఇవి బహిరంగ మార్కెట్లో ఒక్కోటీ రూ.16 పైనే. రోజుకు 2–3 మాత్రల చొప్పున 3 నుంచి 5 నెలలు వాడాలి. అధిక రక్తస్త్రావం అయితే మిసోప్రోస్టోల్‌ వాడాలి. ఇవీ ఖరీదైనవే. ఇలాంటì వేవీ టీడీపీ హయాంలో లేవు. బయటే కొనుక్కోవాల్సి వచ్చేది. ఇపుడైతే ఆ పరిస్థితులు లేవు. గర్భిణులకు, బాలింతలకు అవసరమైన మందులు... అవి కూడా డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలతో కూడినవి ప్రతి ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి. ఈ వాస్తవాలేవీ ఈనాడు’ పట్టవు మరి.  

108 సేవలు మెరుగుపడలేదా? 
టీడీపీ హయాంలో 1.19 లక్షల జనాభాకు ఒకటి చొప్పున ‘104 అంబులెన్స్‌’లు 440 మాత్రమే ఉండేవి. ఇందులో అంతంతమాత్రంగా సేవలందించివని 336 మాత్రమే. మిగిలినవి కండీషన్లో ఉండేవి కాదు. వై.ఎస్‌.జగన్‌ అధికారంలోకి వచ్చాక 74 వేల మంది జనాభాకు ఒకటి చొప్పున 748 వాహనాలు అందుబాటులోకి తెచ్చారు. అప్పట్లో రోజుకు 1760 కేసుల్ని అటెండ్‌ అయిన అంబులెన్స్‌లు, ప్రస్తుతం 3294 కేసుల్ని డీల్‌ చేస్తున్నాయి.  

గ్రామీణులకూ మెరుగైన వైద్యం..
గ్రామీణులకు ఉన్నచోటే మెరుగైన వైద్యం అందేలా 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లను గ్రామాల్లో నెలకొల్పుతున్నారు. వీటి ద్వారా ఇమ్యూనైజేషన్, ఓపీడీ, ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ సహా పలు వైద్య సేవలు, 14 రకాల వైద్య పరీక్షలు, 67 రకాల మందులను ప్రభుత్వం అందిస్తోంది. వీటి ఏర్పాటుకు ఏకంగా రూ.1692 కోట్లు వెచ్చిస్తోంది. డిసెంబర్‌ 2022 నాటికి అన్ని క్లినిక్‌ భనాలూ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయి.  

పనులు జరుగుతుండటం పట్టదా? 
వైద్య విధాన పరిషత్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 251 సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులున్నాయి. వీటిలో 15 సీహెచ్‌సీల్లో ఈ ఏడాది జూలై వరకూ ఒక్క ప్రసవం జరగలేదన్నది ‘రామోజీ’ రాత. నిజానికి ఏడింట్లోనే ఒక్కటీ జరగలేదని, 6 ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగినా ఆన్‌లైన్లో ఎంటర్‌ చేయలేదని అధికారులు చెబుతున్నారు. మిగిలిన 7 చోట్ల నాడు–నేడు పనుల వల్ల లేబర్‌ రూమ్‌లు అందుబాటులో లేవు. కాకపోతే బురద చల్లడానికి ఈ నిజాలేవీ అవసరం లేదుగా? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement