గుంటూరు మెడికల్/కర్నూలు(హాస్పిటల్): తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన వారికి శస్త్ర చికిత్సలు చేసి ప్రాణాలు నిలిపిన ఘటనలకు గుంటూరు జీజీహెచ్, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలు వేదికయ్యాయి. వివరాల్లోకి వెళితే... ఏలూరు జిల్లాకు చెందిన 62 ఏళ్ల నూతి దుర్గారావు విపరీతమైన కడుపు నొప్పితో జనవరి 17న గుంటూరు జీజీహెచ్‌కు వచ్చారు.
జనరల్ సర్జరీ మూడో యూనిట్ ప్రొఫెసర్ డాక్టర్ గోవింద నాయక్ ఆధ్వర్యంలో పలు రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి పాంక్రీస్ డక్ట్ స్టోన్స్ ఉన్నట్లు గుర్తించారు. మద్యం తాగడం వల్ల ఏర్పడిన ఈ రాళ్లను జనవరి 19న సుమారు నాలుగు గంటల పాటు ఆపరేషన్ చేసి తొలగించారు. సుమారు రూ.1.50 లక్షల ఖరీదు చేసే ఆపరేషన్‌ను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేశారని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్ తెలిపారు.
బాలిక ఛాతీలో కణితి తొలగింపు
కర్నూలు జిల్లా డోన్ మండలం దొరపల్లి గ్రామానికి చెందిన పద్మ(15)కు ఛాతీలో గుండె పక్కన గడ్డ వచ్చింది. గుండె వెనుక భాగంలో న్యూరో ఫైబ్రోమా అని పిలిచే ఈ గడ్డ నరాల నుంచి వస్తోందని వైద్యులు గుర్తించారు. సాధారణంగా ఇలాంటి కణితిని ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా తొలగించాల్సి ఉంది.
ఇలా చేస్తే బాలిక కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. త్వరలో ఆ బాలిక పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉన్నందున వీఏటీఎస్ వీడియో అసిస్టెడ్ తొరాసిక్ సర్జరీ పద్ధతి ద్వారా కణితిని తొలగించినట్లు కార్డియోథొరాసిక్ సర్జరీ హెచ్‌వోడీ డాక్టర్ సి.ప్రభాకర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment