కర్నూలు (రాజ్‌విహార్): న్యాయ రాజధాని కర్నూలులో ఏర్పాటు చేయాలన్నది రాయలసీమ హక్కు. ఆ హోదా కర్నూలుకు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. డిసెంబరు 5వ తేదీన కర్నూలులో జరిగే రాయలసీమ గర్జన కార్యక్రమం జయప్రదంపై ఆయన బుధవారం స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో ప్రైవేటు కళాశాలలు, విద్యార్థి సంఘాల జేఏసీ నేతలు, ముఖ్య నాయకులతో వేర్వేరుగా సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు మద్రాసు, ఆ తరువాత హైదరాబాదు నుంచి విడిపోవడం, విభజన హామీలు పక్కాగా అమలు కాకపోవడంతో రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందన్నారు. 2014లో రాష్ట్ర విభజన అయ్యాక అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం సీమకు తీవ్ర అన్యాయం చేసిందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అధికార వికేంద్రీకరణకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. కర్నూలు నుంచి రాజధాని హైదరాబాదుకు తరిలించే సమయంలో పెద్దల సమక్షంలో జరిగిన శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం సీమకు అన్యాయం జరగకుండా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారని, దీనిని గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. గతంలో జరిగిన నష్టాన్ని భవిష్యత్తులో జరగరాదనే గొప్ప ఆలోచనతోనే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని కావాలని ఉత్తరాంధ్ర ప్రజలు చేపట్టిన గర్జన విజయవంతం అయిందని, కర్నూలుకు హైకోర్టును సాధించుకునేందుకు ప్రతి వర్గం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. కర్నూలులో జరిగే రాయలసీమ గర్జన జయప్రదం కావాలని, గర్జనతో ఆగకుండా ఇక్కడ న్యాయ రాజధాని ఏర్పాటు చేసి కార్యకలాపాలు ప్రారంభమయ్యే వరకు విశ్రమించరాదని సూచించారు. హైకోర్టు కోసం చేసే ప్రతి ఉద్యమం, ఆందోళనకు ప్రజా ప్రతినిధులతో పాటు ప్రభుత్వ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల్లోనూ చైతన్యం వచ్చిందని, అయితే సమన్వయంతో కలుపుకొని వెళ్లాలని సూచించారు.
విద్యార్థి, న్యాయవాదులు, ఉద్యోగ, కార్మిక, వ్యాపార సంఘాలతో పాటు ప్రతి ఒక్కరూ తరలివచ్చేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కర్నూలు, నంద్యాల ఎంపీలు డాక్టర్ సంజీవ్‌కుమార్, పోచా బ్రహ్మానందరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు ఎంఎ హఫీజ్‌ఖాన్, డాక్టర్ సుధాకర్, జేఏసీ కన్వీనర్ విజయ్‌కుమార్‌రెడ్డి, విద్యా సంస్థల నిర్వహకులు, జేఏసీ నాయకులు రాయలసీమ క్రిష్టియన్ కళాశాల కరస్పాండెంట్ ఆదిమూలపు సతీష్, కేవీ సుబ్బారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల కరస్పాండెంట్ సుబ్బారెడ్డి, రవీంద్ర కళాశాలల కరస్పాండెంట్ జి.పుల్లయ్య, జి.సుబ్బయ్య, కేవీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ ఇందిరాశాంతి, ఆదర్శ విద్యా సంస్థల కరస్పాండెంట్ తిమ్మయ్య, శ్రీచైతన్య విద్యా సంస్థల ఏజేఎంలు మురళీకృష్ణ, సురేష్, సెయింట్ జోసెఫ్ కరస్పాండెంట్ అనూప్, శ్రీలక్ష్మీ విద్యా సంస్థల కరస్పాండెంట్ మాధవీలత, వల్లపురెడ్డి జనార్ధన్‌రెడ్డి, విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment