ఎన్‌ఐడీకి నిధులు విడుదల | Release of funds to NID for Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఎన్‌ఐడీకి నిధులు విడుదల

Published Thu, Feb 10 2022 5:03 AM | Last Updated on Thu, Feb 10 2022 5:04 AM

Release of funds to NID for Andhra Pradesh - Sakshi

మిథున్‌ రెడ్డి, సత్యనారాయణ

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడీ) నిర్మాణానికి రూ.100.38 కోట్ల బడ్జెట్‌ ఆమోదించగా.. సర్వే, సరిహద్దు గోడ నిర్మాణం వంటివాటికి రూ.0.70 కోట్లు వెచ్చించినట్లు కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి సోమ్‌ ప్రకాశ్‌ తెలిపారు. ప్రాజెక్ట్‌ ఎగ్జిక్యూషన్‌ ఏజెన్సీ అయిన నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌కి రూ.93.18 కోట్లు, యంత్రాలు, పరికరాలు, లైబ్రరీ పుస్తకాలకోసం ఎన్‌ఐడీ అహ్మదాబాద్‌కు రూ.6.50 కోట్లు విడుదల చేసినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, ఎం.వి.వి.సత్యనారాయణ, రెడ్డప్ప అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.

ఏపీలో 66 చేనేత క్లస్టర్ల అభివృద్ధికి నిధులు
ఉరవకొండ, ధర్మవరంలోని పుట్లమ్మ, మదనపల్లిలోని శ్రీ వివేకానంద సహా ఆంధ్రప్రదేశ్‌లోని 66 చేనేత క్లస్టర్ల అభివృద్ధికి 201516 నుంచి 202122 మధ్య రూ.53.59 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళిశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ తలారి రంగయ్య ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. సమర్థ్‌ పథకం కింద యాడికికి చెందిన 40 మంది చేనేత కార్మికులకు స్కిల్‌ అప్‌గ్రేడేషన్‌ శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు.

పీఎంకేకేకేవైకి రూ.421.02 కోట్లు ఖర్చు
ప్రధానమంత్రి ఖనిజ్‌ క్షేత్ర కళ్యాణ్‌ యోజన (పీఎంకేకేకేవై) కింద ఏపీలోని గనుల ప్రభావిత ప్రాంతాల్లో గతేడాది డిసెంబర్‌ వరకు కోవిడ్‌19 పనులతో కలిపి చేపట్టిన 16,149 ప్రాజెక్టులకు రూ.1,282.79 కోట్లు కేటాయించగా రూ.421.02 కోట్లు ఖర్చు చేసినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీలు గురుమూర్తి, పోచ బ్రహ్మానందరెడ్డి అడిగిన ప్రశ్నలకు జవాబుగా కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. 

అదనపు రైల్వే శిక్షణ సంస్థ యోచన లేదు
ఆంధ్రప్రదేశ్‌లో అదనపు రైల్వే శిక్షణ సంస్థ ఏర్పాటుకు సంబంధించి కేంద్రం వద్ద ఎలాంటి ఆలోచనలేదని వైఎస్సార్‌సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ సమాధానమిచ్చారు. 

లిథియం లభ్యతపై సర్వే
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కడప జిల్లాల్లోని పర్నపల్లెలోపతనుతుల ప్రాంతంలో లిథియం సంభావ్యతను అంచనా వేయడానికి  జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా 202122 ఫీల్డ్‌ సీజన్‌లో ఒక జీ4 స్టేజ్‌ అన్వేషణ ప్రాజెక్ట్‌ను చేపట్టిందని కేంద్ర గనులశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి బుధవారం లోక్‌సభలో తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు గోరంట్ల మాధవ్, కోటగిరి శ్రీధర్‌ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. మట్టి, ప్రవాహ అవక్షేపం, రాతిశిలల నమూనాల సేకరణతోపాటు స్కేల్‌ మ్యాపింగ్‌ చేపట్టనున్నట్లు చెప్పారు. 

జూట్‌ పరిశ్రమను ఆదుకోండి 
పర్యావరణ హితమైన జూట్‌ పరిశ్రమను ఆదుకోవాలని కేంద్రానికి వైఎస్సార్‌సీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్‌ విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ రైతుల ఆదాయన్ని రెట్టింపు చేస్తామని, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ దశల వారీగా తొలగిస్తామని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారని ఈ దశలో జూట్‌ పరిశ్రమను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. జూట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆచరణ సాధ్యంకాని పాలసీల వల్ల ఏలూరులోని వందేళ్లనాటి జూట్‌ మిల్లు మూత పడిందని తెలిపారు. జనపనారపై ఆధారపడిన లక్షలమందికి మద్దతిస్తారా లేదా అని  ప్రశ్నించారు.   

రైల్వేలైను ఖర్చు కేంద్రమే భరించాలి : మార్గాని భరత్‌రామ్‌
కోటిపల్లి నరసాపురం రైల్వేపనులకు సంబంధించి వందశాతం నిధులు కేంద్రమే భరించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ భరత్‌రామ్‌ డిమాండ్‌ చేశారు. కోటిపల్లి నరసాపురం రైల్వేలైనుకు సంబంధించి ఆయన అనుబంధ ప్రశ్న అడుగుతూ.. రాష్ట్రానికి రెవెన్యూ లోటు కూడా పూడ్చని కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో రైల్వేలైను నిధులు భరించాలని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి టీడీపీ ఎంపీలు తమతో కలిసి రావాలని కోరారు. దీనిపై కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి రావ్‌సాబ్‌ ధాన్వే సమాధానమిస్తూ.. రాష్ట్ర విభజన అనంతరం ఏ రాష్ట్ర పరిధిలోని లైన్లు ఆ రాష్ట్రమే రాష్ట్ర వాటా భరించాలని చెప్పారు. 

రాష్ట్రానికి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎన్‌.రెడ్డెప్ప కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రెండున్నరేళ్లుగా రాష్ట్రాన్ని ఆదుకోవాలని పలు విధాలుగా కేంద్రాన్ని కోరుతున్నామన్నారు.  రాష్ట్రాన్ని విభజించాలంటూ లేఖ ఇచ్చిన చంద్రబాబు వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌పై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌ స్థితిగతులు, ఆర్థిక పరిస్థితిపై ప్రధాని రాజ్యసభలో మాట్లాడినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రానికి తగిన నిధులు ఇవ్వాలని ప్రధానికి, ఆర్థికమంత్రికి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు కృషిచేస్తున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి సహకరించాలని కోరారు. చంద్రబాబు వల్లే విభజన జరిగిందని, దివంగత సీఎం రాజశేఖరరెడ్డి బతికి ఉంటే విభజన జరిగి ఉండేది కాదని పేర్కొన్నారు. దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రి అయిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంటూ.. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతోపాటు ఈబీసీ మహిళలకు కూడా ఆర్థికభరోసా కల్పిస్తున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలు, పారిశుధ్య కార్మికులకు నిధులు పెంచడంతోపాటు సక్రమంగా ఖర్చుచేయాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు ప్రత్యేక బడ్జెట్‌ పెట్టాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్లు పెంచాలని, తద్వారా  విద్యార్థుల ఆన్‌లైన్‌ తరగతులకు ఇబ్బందులు రావని పేర్కొన్నారు.   

మేడిపండు బడ్జెట్‌ : గోరంట్ల మాధవ్‌
కేంద్ర బడ్జెట్‌ మేడిపండు చూడ.. అన్న సామెత మాదిరిగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ విమర్శించారు. బడ్జెట్‌పై చర్చలో ఆయన మాట్లాడుతూ సంతలో గొర్రెను అమ్మేసినట్లు చంద్రబాబు ప్రత్యేక హోదాను అమ్మేశారని విమర్శించారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి ఇచ్చిన హామీలను ఆర్థికమంత్రి బడ్జెట్‌లో విస్మరించారని చెప్పారు. పదేళ్లలోగా రాష్ట్రంలో విద్యాసంస్థలు నెలకొల్పాల్సి ఉన్నా కేంద్రమే ఆ బాధ్యతకు దూరంగా ఉంటోందని విమర్శించారు. కేంద్రీయ వర్సిటీ, పెట్రోలియం వర్సిటీలకు కేటాయింపులు సరిపోవన్నారు. నదుల అనుసంధానాన్ని రాష్ట్రం స్వాగతిస్తోందని చెప్పారు. కానీ అంతర్‌రాష్ట్ర జలవివాదాల విషయంలో రాష్ట్రానికి సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అంశాన్ని ఇప్పటికైనా కేంద్రం నెరవేర్చాలని కోరారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement