సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్ల పథకం కింద 30 లక్షల మంది లబ్ధిదారులకు ఇచ్చిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుతో ఆగిపోయిన ఇళ్లకు అడ్డంకులు తొలగిపోయాయి. ఇళ్ల స్థలాల మంజూరులో పలు మార్గదర్శకాలతో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ సింగిల్ జడ్జి ముందు దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు 128 మంది పిటిషనర్లు మంగళవారం హైకోర్టు ధర్మాసనానికి నివేదించారు. దీంతో పేదల ఇళ్ల నిర్మాణం కొనసాగనుంది.
తమకు వివాదాలు వద్దని, ఇళ్ల పట్టాలు వస్తే చాలని వారు ధర్మాసనానికి తెలిపారు. పిటిషనర్లలో కొందరికి ఇప్పటికే పట్టాలు మంజూరు చేశామని, మిగతా వారు దరఖాస్తు చేసుకుంటే వారికీ ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నందున, ఆ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, పిటిషన్ ఉపసంహరణకు అనుమతినిచ్చింది. పిటిషనర్లు వ్యాజ్యం ఉపసంహరించుకున్న నేపథ్యంలో ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పూర్వాపరాల్లోకి వెళ్లడంలేదని స్పష్టంచేసింది.
సింగిల్ జడ్జి తీర్పులో ప్రస్తావించిన అంశాలేవీ ఏ ఒక్కరి పట్ల ఏ రకంగానూ ప్రతికూల అభిప్రాయాన్ని కలిగించవని తేల్చి చెప్పింది. పట్టాలు కోరుకొనే పిటిషనర్లు మూడు వారాల్లో దరఖాస్తు చేసుకోవాలని, వాటిని మూడు నెలల్లో పరిష్కరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్యమంత్రి ఆదేశాల మేర అప్పీల్ దాఖలు
‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద 30 లక్షల మంది పేదలకు ఇచ్చిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దంటూ సింగిల్ జడ్జి జస్టిస్ సత్యనారాయణమూర్తి గత నెలలో తీర్పునిచ్చారు. దీంతో పనులు నిలిచిపోయాయి. ఈ తీర్పు వల్ల పేదలు తీవ్రంగా ప్రభావితమైనందున, అప్పీల్ దాఖలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు.
ఈ అప్పీల్‌పై జస్టిస్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా సింగిల్ జడ్జి ముందు పిటిషన్ దాఖలు చేసిన 128 మంది పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వీఎస్‌ఆర్ ఆంజనేయులు తాము వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. దీనిపై ధర్మాసనం ప్రభుత్వ వివరణ కోరింది. పిటిషన్ ఉపసంహరణకు తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు.
పట్టాలు ఇవ్వడానికి కూడా అభ్యంతరం లేదని ఏజీ చెప్పారు. సింగిల్ జడ్జి తీర్పును ఉపసంహరించాలని కోరారు. సింగిల్ జడ్జి తీర్పులో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) గురించి ప్రస్తావనలు చేశారని, దీనివల్ల ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.హరినాథ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సింగిల్ జడ్జి తీర్పులో ప్రస్తావించిన అంశాలేవీ ఎవరి పట్ల ఏ రకంగానూ ప్రతికూల అభిప్రాయాన్ని కలిగించవని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
అసలుకే మోసం వస్తుందనే పిటిషన్ ఉపసంహరణ?
సింగిల్ జడ్జి ముందు పిటిషన్ దాఖలు చేసిన వారిలో చాలా మందికి అంతకు ముందే ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చింది. మరికొందరు పిటిషనర్ల చిరునామాలు కూడా లభించలేదు. ఈ పరిస్థితుల్లో ఈ వ్యాజ్యంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యాజ్యం వెనుక ఎవరో ఉన్నారని, దీనిపై లోతుగా విచారణ జరపడం మేలన్న వాదన కూడా వినిపించింది. ఈ వ్యవహారంపై లోతుగా విచారిస్తే అసలుకే మోసం వస్తుందన్న ఉద్దేశంతోనే పిటిషనర్లు వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment