సాక్షి, కర్నూలు(హాస్పిటల్): పట్టణాల్లోని మురికివాడల్లోŠ, గ్రామాల్లోని కిరాణా దుకాణాలో కొందరు చిన్న మాత్ర, పెద్ద మాత్ర, ఒళ్లునొప్పుల మాత్రలివ్వాలంటూ అడుగుతూ కనిపిస్తారు. ఇందులో ఒకటి పెయిన్‌కిల్లర్ కాగా.. మరొకటి స్టెరాయిడ్. మద్యానికి అలవాటు పడ్డట్లే నొప్పులను తగ్గించేందుకు వాడే ఈ మాత్రలకు చాలా మంది ప్రజలు అలవాటు పడ్డారు. నొప్పులను భరించలేక వైద్యుల నుంచి ప్రిస్కిప్షన్ లేకుండా లభించే ఈ మాత్రలను వాడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1800కు పైగా మెడికల్ షాపులు, 2 వేలకు పైగా ఏజెన్సీలు ఉన్నాయి. మండల కేంద్రాలు, గ్రామాలు, పట్టణాల్లోని మురికివాడల్లో ఉండే పలు మెడికల్ షాపుల్లో విచ్చలవిడిగా స్టెరాయిడ్స్, పెయిన్‌కిల్లర్స్ మాత్రలను ప్రజలకు ఎలాంటి ప్రిస్కిప్షన్ లేకుండా అమ్ముతుంటారు. ముఖ్యంగా రోజంతా కాయకష్టం చేసి ఇంటికి వచ్చి ఒళ్లునొప్పులతో బాధపడేవారు, కీళ్లనొప్పులు, పలు రకాల శారీరక నొప్పులతో బాధపడేవారు ఆయా బాధలు తగ్గించుకునేందుకు ఈ మందులు వాడుతుంటారు.
నిపుణులైన వైద్యుల వద్దకు వెళితే వారు పరిమిత సంఖ్యలో మాత్రమే ఇలాంటి మందులు వాడాలని చెబుతారు. అత్యవసరం అయితే తప్పా స్టెరాయిడ్స్ సూచించరు. దీంతో నేరుగా దగ్గరలో ఉన్న తెలిసిన మెడికల్ షాప్‌లకు వెళ్లి ఈ మాత్రలను కొని తెచ్చుకుని వాడుతుంటారు. మురికివాడల్లో, గ్రామాల్లోని పలు కిరాణాదుకాణాల్లో సైతం వీటి విక్రయాలు జరుగుతున్నాయి. ఇలా తెచ్చుకుని వేసుకున్న మాత్రల వల్ల వారికి ఆ రోజుకు ఉపశమనం కలుగుతుంది. ఇలా ప్రతి ఐదు రోజులకు ఒకసారి మాత్రలు తెచ్చి వేసుకోవడం పరిపాటిగా మారుతోంది. ఇవి దీర్ఘకాలం వాడటం వల్ల ప్రాణాంతక జబ్బుల బారిన పడుతున్నారు.
ఆర్‌ఎంపీ చేతిలో అస్త్రాలివే
గ్రామాల్లో, మురికివాడల్లోని ప్రజలు ఏ రోగమొచ్చినా ముందుగా గుర్తొచ్చేది ఆర్‌ఎంపీ (రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్)లే. వెంటనే వారి వద్దకు వెళ్లడం చికిత్స తీసుకోవడం, మరునాడే పనులకు వెళ్లడం పరిపాటి. నిపుణులైన వైద్యుల వద్దకు వెళితే ఇంత త్వరగా రోగం తగ్గదు. అందుకే ఆర్‌ఎంపీలకు అంత గిరాకీ. సదరు ఆర్‌ఎంపీలు వారి వద్దకు వచ్చే రోగులకు ఒక చేతికి పెయిన్ కిల్లర్, మరో చేతికి స్టెరాయిడ్ మందును ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. గ్రామాల్లోనే కాదు కర్నూలు పట్టణంలోని బుధవారపేట, ఓల్డ్‌సిటీ, శ్రీరామనగర్, శరీన్‌నగర్, కల్లూరు, వీకర్‌సెక్షన్‌కాలనీ వంటి ప్రాంతాల్లో ఆర్‌ఎంపీలు చేసే వైద్యం ఇదే. దీంతో ఫలానా డాక్టర్ రెండు సూదులు వేయగానే రోగం తగ్గిపోయిందని గొప్పగా చెప్పుకుని దీర్ఘకాలంలో వచ్చే వ్యాధులను ప్రజలు పట్టించుకోవడం మానేస్తున్నారు.
స్టెరాయిడ్స్ అంటే..
స్టెరాయిడ్స్ లేదా కార్టికోస్టెరాయిడ్స్ అనేవి ఒక రకమైన మందులు. ఈ మందులను ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ జబ్బుల్లో వాడతారు. వీటిని మొట్టమొదటిసారిగా 1949లో రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో వాడారు. అప్పటినుంచి వీటిని రకరకాల వ్యాధుల్లో (ఆస్తమా, అలర్జి, ఎస్‌ఎల్‌ఈ, ఆర్థరైటిస్, వ్యాస్కులైటిస్ మొదలైన) సూదులు, మాత్రలు, పూతమందులు, ఇన్‌హేలర్ రూపంలో వాడుతూ ఉన్నారు. ఇందులో చాలా రకాలున్నాయి. డెక్సామిథసోన్, ప్రెడ్నిసోన్, ట్రైయామ్‌సిలోన్ మొదలైనవి.
స్టెరాయిడ్స్ వాడకం వల్ల నష్టాలు
మన శరీరంలోని రక్తంలో మామూలుగానే స్టెరాయిడ్స్ చిన్న మోతాదులో ఉంటాయి. ఇవి మన జీవక్రియకు సంబంధించిన ప్రక్రియల్లో ఉపయోగపడతాయి. రక్తంలోని షుగర్‌ను నియంత్రించడం, బీపీ నియంత్రణలో ఉంచడం, ఎముకల శక్తిని నిర్ధారించడం, రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడం లాంటివి. మందుల ద్వారా ఇచ్చే స్టెరాయిడ్స్ అధిక మోతాదులో ఉండటం వల్ల జీవక్రియ దెబ్బతింటుంది. దీర్ఘకాలంగా వీటిని వాడటం వల్ల చాలా జబ్బులు కోరి తెచ్చుకుంటారు. ఇందులో బీపీ, స్థూలకాయం, ఆస్టియోపోరోసిస్ (ఎముకల బలహీనత), కంట్లో శుక్లాలు ఇలాంటి సమస్యలు చాలా వస్తాయి.
ఇష్టమొచ్చినట్లు వాడొద్దు
స్టెరాయిడ్స్ కొన్ని జబ్బుల్లో సరైన సమయంలో సరైన మోతాదులో వాడితే ప్రాణాలు కాపాడబడతాయి. అయితే ఇష్టం వచ్చినట్లు వాడితే చాలా సమస్యలు వచ్చి ప్రాణాంతకం అవుతుంది. ఇప్పటికీ చాలా మంది స్టెరాయిడ్స్ అతిగా వాడి కిడ్నీలు దెబ్బతిని, ఎముకలు గుల్లబారి, బరువు పెరిగి కీళ్లనొప్పులు తెచ్చుకుని మా వద్దకు వస్తుంటారు. మాలాంటి కీళ్లవాత నిపుణులు సైతం అవసరమైన మేరకు మాత్రమే స్టెరాయిడ్స్ ఇచ్చి సమస్య తీవ్రత తగ్గాక తగ్గిస్తారు. ఇవి వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి.
– డాక్టర్ శ్రీహరిరెడ్డి, కీళ్లవాత నిపుణులు, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment