పొట్టి శ్రీరాములుకు నివాళులర్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు
సాక్షి, అమరావతి: రాష్ట్రాభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో ఇలాగే పరుగులు తీస్తుందని, వచ్చే సాధారణ ఎన్నికల నాటికి నంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి దృఢ విశ్వాసం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఘనంగా జరిగిన రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల్లో సజ్జల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలంతా జగన్ వెనుక మడమ తిప్పని సైనికుల మాదిరిగా కలిసికట్టుగా ఉండాలని కోరారు.
ప్రజలతో మమేకమై కర్తవ్యదీక్షతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పునరంకితం అవుదామన్నారు. టీడీపీ పాలనలో రాష్ట్రం అథోగతి పాలైందన్నారు. వైఎస్ జగన్ సారథ్యంలో ఏడాదిన్నరలో జరిగిన సంక్షేమ కార్యక్రమాల అమలుతో రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పట్టాల మీదకు వచ్చిందని చెప్పారు. తొలుత సజ్జల జాతీయ జెండాను ఎగురవేశారు. తెలుగు తల్లి, పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీ, దివంగత సీఎం వైఎస్సార్ చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్యేలు.. సామినేని ఉదయభాను, వసంత కృష్ణప్రసాద్, జోగి రమేశ్, కేంద్ర కార్యాలయం ఇన్‌చార్జ్ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment