
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాన్ని పెంచుతూ నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి జి.జయలక్ష్మి మంగళవారం మెమో జారీ చేశారు. వీరికి సవరించిన మినిమమ్ టైమ్ స్కేలు ప్రకారం వేతనాలు చెల్లించేలా ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం ఈ కాంట్రాక్టు అధ్యాపకులు రూ.35,120 పొందుతుండగా తాజా ఆదేశాల ప్రకారం అది రూ.40,270కి పెరగనుంది.
ఈ వేతనాలు ఉత్తర్వులు వెలువడిన నాటినుంచి అమలులోకి వస్తాయని మెమోలో పొందుపరిచారు. దీనివల్ల 316 మంది కాంట్రాక్టు అధ్యాపకులకు మేలు జరగనుంది. తాము ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సవరించిన మినిమమ్ టైమ్ స్కేలు ప్రకారం వేతనాలు పెంచినందుకు పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం మంగళవారం ఓ ప్రకటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. తాము ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సవరించిన ఎంటీఎస్‌ను అమలు చేసినందుకు మంత్రి గౌతమ్‌రెడ్డి, ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవర్ధననాయుడు, బి.కృష్ణ పేర్కొన్నారు.