
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో జరుగుతున్నవన్నీ తీవ్ర అంతర్గత అవకతవకలని, వాటి గురించి చందాదారులకు తెలిసే అవకాశమే లేదని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. అందుకే వాటిపై ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని వివరించింది. చందాదారులు ఫిర్యాదు చేయనంత మాత్రాన, మార్గదర్శి అక్రమాలు, అవకతవకలను ప్రశ్నించకూడదు, చర్యలు తీసుకోకూడదు అంటే ఎలా అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ ప్రశ్నించారు. మార్గదర్శి చిట్ గ్రూపుల మూసివేత ఏమాత్రం ఏకపక్ష నిర్ణయం కాదన్నారు.
చట్టపరమైన తీవ్ర ఉల్లంఘనలను గుర్తించాకే 2022 డిసెంబర్‌లో ఆ సంస్థకు నోటీసులు ఇచ్చి వివరణ కోరామన్నారు. ఆ వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో.. అందుకు కారణాలను వివరిస్తూ మళ్లీ నోటీసు ఇచ్చామని తెలిపారు. అయినా కూడా మార్గదర్శి య«థేచ్ఛగా ఉల్లంఘనలను కొనసాగిస్తూనే ఉందన్నారు. ఈ నేపథ్యంలో చిట్ గ్రూపుల నిలుపుదల విషయంలో అభ్యంతరాలను ఆహ్వానిస్తూ బహిరంగ నోటీసు ఇచ్చామన్నారు. చట్ట నిబంధనలకు విరుద్ధంగా తాము వ్యవహరిస్తున్నట్లు మార్గదర్శి చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని వివరించారు.
మార్గదర్శి వ్యాజ్యాలకు విచారణార్హత లేదు..
ఉల్లంఘనలను గుర్తించినప్పుడు.. వాటి విషయంలో తనంతట తాను (సుమోటో)గా చర్యలు ప్రారంభించే అధికారం చిట్ రిజిస్ట్రార్లకు చట్టం కల్పిస్తోందని ఏజీ శ్రీరామ్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. కాబట్టి ఉల్లంఘనలపై ఫిర్యాదుల కోసం వేచి చూడాల్సిన అవసరం ఏమాత్రం లేదని తెలిపారు. చిట్ రిజిస్ట్రార్లు చట్టప్రకారం తమకున్న సుమోటో అధికారాన్ని ఉపయోగించి చర్యలకు ఉపక్రమించారన్నారు. 2008లో ఇచ్చిన జీవో ప్రకారం రిజిస్ట్రార్లకు అధికారాలను అప్పగించారని, చిట్‌ఫండ్ చట్టంలోని సెక్షన్ 48 (హెచ్) కింద చిట్ గ్రూపులను నిలిపేసేందుకు చర్యలు తీసుకునే సుమోటో అధికారం సైతం డిప్యూటీ రిజిస్ట్రార్లకు ఉందన్నారు.
ప్రస్తుతం తాము జారీ చేసింది కేవలం షోకాజ్ నోటీసు మాత్రమేనని, దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు మార్గదర్శికి ఏమాత్రం అవకాశం లేదని తెలిపారు. అందువల్ల ఆ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యాలకు విచారణార్హత లేదన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో విస్తృత ప్రజాప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని, అందువల్ల ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయొద్దని కోర్టును అభ్యర్థించారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేస్తామని చెప్పారు. ఇరుపక్షాలు వాదనలు ముగించడంతో న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా ప్రకాశం జిల్లా చిట్ గ్రూపు వ్యవహారంలో న్యాయస్థానం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల చిట్ గ్రూపుల విషయంలో అభ్యంతరాలు తెలపాలని చందాదారులను కోరుతూ చిట్స్ రిజిస్ట్రార్ జారీ చేసిన పబ్లిక్ నోటీసుపై మార్గదర్శి యాజమాన్యం హైకోర్టులో వేర్వేరుగా మూడు వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాదులు నాగముత్తు, దమ్మాలపాటి శ్రీనివాస్‌లు వాదనలు వినిపించారు. బహిరంగ నోటీసు అమలును నిలిపేసి, ఆ నోటీసు ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు.
Comments
Please login to add a commentAdd a comment