సాక్షి, అమరావతి: దేవాలయాల్లో విధ్వంసాలకు పాల్పడే అసాంఘిక శక్తుల గుట్టు రట్టు చేసేందుకు, లోతైన విచారణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కార్యరంగంలోకి దిగింది. శనివారం విజయవాడలో సిట్ చీఫ్ జీవీజీ అశోక్‌కుమార్ నేతృత్వంలో తొలి భేటీ జరిగింది. అందుబాటులో ఉన్న సిట్ సభ్యులు ఈ సమావేశానికి వ్యక్తిగతంగా హాజరుకాగా, విశాఖపట్నం, ఇతర ప్రాంతాలకు చెందిన ఐదుగురు సభ్యులతో జూమ్ ద్వారా అశోక్‌కుమార్ మాట్లాడారు. రాష్ట్రంలో గతేడాది సెప్టెంబర్ నుంచి జరిగిన దేవాలయాల ఘటనలను ప్రాథమికంగా సమీక్షించారు.
రాష్ట్రంలో ఎన్ని ఘటనలు జరిగాయి, వాటికి సంబంధించి ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎంతమంది అరెస్టు అయ్యారు, తదితర అన్ని వివరాలను పోలీసుల నుంచి సేకరించాలని నిర్ణయించారు. పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. దేవాలయ ఘటనలకు సంబంధించిన కేసుల ప్రాథమిక సమాచార నివేదిక(ఎఫ్‌ఐఆర్), కేస్ డైరీ (సీడీ ఫైల్స్)లను తీసుకుని పరిశీలించనున్నారు. అన్ని కేసులను లోతుగా పరిశీలించి, వాటికి సంబంధించిన ఆధారాలు, వివరాలను సేకరించాలని సభ్యులకు అశోక్‌కుమార్ తెలిపారు. సిట్ టీమ్ అంతా అంకితభావంతో పనిచేయాలని, ఆలయ ఘటనల్లో మూలాలను వెతికి పట్టుకుని అసలైన దోషులను శిక్షించేలా గట్టి ప్రయత్నాలు చేయాలని అశోక్‌కుమార్ సూచించారు. సోమ, మంగళవారాల్లో మరోసారి సమావేశమవ్వాలని సిట్ నిర్ణయం తీసుకుంది.
సిట్ టీమ్ సూపర్
ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేసి రాష్ట్రంలో మతపరమైన అలజడులు రేపేందుకు జరుగుతున్న కుట్రను ఛేదించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న గట్టి చర్యలకు సిట్ ఏర్పాటు అద్దంపడుతోందని వివిధ వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం కూర్పు సూపర్‌గా ఉందని పేర్కొంటున్నారు. హైందవ సంప్రదాయాలు తెలిసిన వాళ్లను, నేర పరిశోధనలో దిట్ట అయిన వారిని ప్రభుత్వం ఎంపిక చేసిందని చెబుతున్నారు. ఏసీబీ అడిషనల్ డైరెక్టర్, సిట్ చీఫ్ అశోక్‌కుమార్ గతంలో తిరుమల తిరుపతి దేవస్థానములు(టీటీడీ) చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీవీఎస్‌వో)గా మూడున్నరేళ్లు పనిచేశారు. విజయవాడ డీసీపీగా ఉన్న సమయంలో దుర్గ గుడిలో తాంత్రిక పూజలపైన ఆరా తీశారు. ఆలయాల భద్రత, నేర పరిశోధనలో పట్టున్న అధికారిగా ఆయనకు పేరుంది. టీమ్‌లో సభ్యులంతా నేరపరిశోధనలో మంచి అనుభవం ఉన్న వారే కావడం గమనార్హం.
కుట్ర కోణం బయటపడుతుందని ఆశిస్తున్నా
ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన తీరు బాగుంది. ఇందులో ఉన్న అధికారులు ఎంతటి సమర్థులో నాకు తెలుసు. రాష్ట్రంలో మత సామరస్యానికి తూట్లు పొడిచేలా కొందరు ఆలయాల ఘటనలను ప్రోత్సహిస్తున్నారు. ఒక పథకం ప్రకారం ఘటనలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కులమతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర కోణాన్ని ఈ సిట్ వెలికితీస్తుందని ఆశిస్తున్నాను.
–వి.రాజగోపాల్, రిటైర్డ్ డీఎస్పీ, రాజమహేంద్రవరం
సిట్ ఏర్పాటు మంచి పరిణామం
ఆలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేసే ఘటనలను నిగ్గు తేల్చేలా సిట్ ఏర్పాటు చేయడం మంచి పరిణామం. అంతర్వేది నుంచి రామతీర్థం వరకు ఒక పథకం ప్రకారం ఘటనలు జరుగుతున్నట్టు తేటతెల్లమవుతోంది. సంఘ విద్రోహ శక్తుల పట్ల ప్రభుత్వం అప్రమత్తమై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఘటనల్లో కుట్ర కోణం బయటకు తీయాలి.
– పూరిళ్ల శ్రీనివాస్, న్యాయవాది, పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment