కదిరిలో కుప్పకూలిన భవనం
కదిరి: అనంతపురం జిల్లా కదిరిలో శనివారం వేకువజామున మూడు భవనాలు కుప్పకూలిన దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు, ఓ పసికందు సహా ఆరుగురు సజీవ సమాధి అయ్యారు. మరో నలుగురు ఆస్పత్రి పాలవగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో సైదున్నీసా (2), ఫారున్నీసా (8 నెలలు), యాషికా(3)తోపాటు ఫైరోజా (65), భాను (30), ఫాతిమాబీ (65) ఉన్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కదిరి పట్టణంలోని చైర్మన్ వీధిలో జిలాన్ అనే వ్యక్తి తన పాత భవనంపై ఎటువంటి పిల్లర్లు వేయకుండా మరో రెండంతస్తుల నిర్మాణం చేపట్టారు. పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఆ భవనంలోని కింది భాగం పాత నిర్మాణం కావడంతో కొత్తగా నిర్మించిన రెండంతస్తుల బరువును మోయలేక శనివారం వేకువజామున 3 గంటల సమయంలో కుప్పకూలింది. దాని శిథిలాలు పక్కనే ఉన్న మరో రెండంతస్తుల భవనంతో పాటు ఆ పక్కనే ఉన్న ఇంకో భవనంపైనా పడటంతో అవి కూడా నేలమట్టమయ్యాయి.
నిర్మాణంలో ఉన్న భవనంలోని కింది పోర్షన్‌లో నిద్రిస్తున్న ఇంటి యజమాని జిలాన్ తల్లి ఫైరోజా (65), పక్క భవనంలోని మొదటి అంతస్తులో నిద్రిస్తున్న టీవీ చానల్ విలేకరి సోమశేఖర్ సతీమణి భాను (30), వీరి మూడేళ్ల చిన్నారి యాషికా, అత్త ఫాతిమాబీ (65) శిథిలాల కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సోమశేఖర్ ఇంటి కింది పోర్షన్‌లో కాపురముంటున్న వంట మాస్టర్ రాజు, కదిరి మండలం రామదాసు నాయక్ తండాకు చెందిన ఉదయ్ నాయక్, మీటేనాయక్ తండాకు చెందిన గౌతమ్ నాయక్, చిగురుమాను తండాకు చెందిన డిప్లొమా విద్యార్థి తరుణ్ నాయక్ శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరంతా ఓ మూలన ఉండి ప్రాణాలు కాపాడుకున్నారు. తరుణ్ నాయక్ వెంటనే డయల్ 100కు ఫోన్ చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీస్, రెవెన్యూ, మునిసిపల్, అగ్నిమాపక, 108 సిబ్బంది వారిని బయటకు తీసి ప్రాణాలు కాపాడారు.
తర్వాత ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. అయితే పక్కనే ఉన్న మరో ఇంటిపైనా భవన శిథిలాలు పడటంతో ఆ ఇల్లు కూడా కూలింది. ఆ ఇంట్లో నిద్రిస్తున్న హబీబుల్లా, కలీమున్నీసా, హిదయతుల్లా, దంపతులు కరీముల్లా, హబీబున్నీసా బయటకు పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకున్నారు. కరీముల్లా దంపతుల రెండేళ్ల చిన్నారి సైదున్నీసా, 8 నెలల చిన్నారి ఫారున్నీసా శిథిలాల కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో వంట మాస్టర్ రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి ఉదయం నుంచీ అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలను ఆదుకుంటామని వారికి ధైర్యం చెప్పారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబాలను ఓదార్చారు.
Comments
Please login to add a commentAdd a comment