ప్రతీకాత్మక చిత్రం
ఈ నగరానికి ఏమైంది...?. ఒకవైపు పొగ... మరోవైపు ధూళి. ఎవరూ నోరు మెదపరేం’ అంటూ అటు టీవీల్లో, ఇటు సినిమా హాళ్లల్లోనూ ప్రకటనలు హోరెత్తుతున్నాయి. ప్రకటనల మాటేమో గానీ బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగరాదన్న చట్టం చేసి పదేళ్లైనా అమలుకు నోచుకోవడం లేదు. పొగ రాయుళ్లు బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తూ చుట్టుపక్కల వారిని అనారోగ్యం బారిన పడేస్తున్నారు. ఈ విషయమై ఏ ఒక్క అధికారీ నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. – కర్నూలు(హాస్పిటల్)
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2008 అక్టోబర్ 2న సిగరెట్స్ అండ్ టుబాకో ప్రొడక్ట్స్ యాక్ట్(సీఓటీపీఏ–2008)ను రూపొందించింది. ఈ చట్టం ప్రకారం బస్టాండ్, రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు, మార్కెట్లు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, జనసంచారం ఉండే ప్రదేశాల్లో ధూమపాన నిషేధం. దీనిని అతిక్రమిస్తే రూ.200 జరిమానాతో పాటు జైలు శిక్ష విధించాలని చట్టం చెబుతోంది. పొగాకు ఉత్పత్తులను 18 ఏళ్లలోపు ఉన్న వారికి అమ్మినా జరిమానా విధించాలి.
పొగాకు నియంత్రణ, బహిరంగ ధూమపానాన్ని అరికట్టేందుకు చట్టం అమలు బాధ్యతను పోలీసు శాఖకు అప్పగించింది. చాలా ప్రాంతాల్లో పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో పొగతాగే వారిపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. కొందరు పోలీసులకు ఈ చట్టం ఒకటి ఉందనే విషయం కూడా తెలియదు. కొందరు పోలీసు అధికారులకు చట్టం గురించి అవగాహన ఉన్నా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ సంకల్పం బాగున్నా ఆచరణలో చిత్తశుద్ధ లేకపోవడంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు.
చదవండి: (Uday Kumar Reddy: ఎస్సైగా ఇక్కడే.. ఎస్పీగా ఇక్కడికే!)
ప్రతి నెలా రూ.5 కోట్ల వ్యాపారం
జిల్లాలో బీడీ, సిగరెట్, చుట్ట విక్రయాలు తగ్గడం లేదు. ధర ఎంతైనా వాటిని కొనుగోలు చేసి వాడుతున్నారు. ముఖ్యంగా వీటి టోకు వర్తక వ్యాపారులు కర్నూలు నగరంలోని పాతబస్తీలో అధికంగా ఉన్నారు. ఇక్కడి నుంచే నంద్యాల, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు, బనగానపల్లి, ఆళ్లగడ్డ, శ్రీశైలం వంటి ప్రాంతాలకు పలువురు చిన్న తరహా డీలర్లు తీసుకెళ్లి అక్కడి రిటైల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇలా ప్రతి నెలా జిల్లాలో రూ.5 కోట్లకు పైగానే వ్యాపారం జరుగుతోందని అంచనా.
పొగాకు ఉత్పత్తులతో వ్యాధులు..
పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల ఎక్కువగా ఊపిరితిత్తుల వ్యాధులైన బ్రాంకైటిస్, ఆయాసం, సీఓపీడీ, గుండెజబ్బులు, రక్తనాళాలు మూసుకుపోవడంతో పాటు నోటి క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, రక్త క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం ఉంది. బీడీ, సిగరెట్, చుట్టలను ప్రత్యక్షంగా తీసుకోకపోయినా వాటిని వాడిన వారు వదిలే పొగను పీల్చినా పైన చెప్పిన వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా ధూమపానం..
బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయకూడదని చట్టం చెబుతున్నా పొగరాయుళ్లు పట్టించుకోవడం లేదు. బస్టాండ్, టీ కొట్లు, రైల్వేస్టేషన్‌లు, రైళ్లు, బస్సులలో ధూమపానం చేస్తున్నారు. 18 ఏళ్లలోపు బాలురు సైతం ఈ దురలవాటుకు బానిసలు కావడం బాధాకరం. ధనార్జనే ధ్యేయంగా వ్యాపారులు వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికీ వీటిని విక్రయిస్తూ పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
చట్టం ఏమి చెబుతుందంటే..
►బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయకుండా బోర్డులు ఏర్పాటు చేయాలి
►పాఠశాలలు, కళాశాలల వద్ద పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదు
►ధూమపానం అలవాటు ఉన్న వారి కోసం ప్రత్యేకంగా స్మోకింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాలి.
►రైతులు, వ్యాపారులు, రెస్టారెంట్ యజమానులు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
►రెవెన్యూ, పోలీస్, వైద్యులు కలిసి అప్పుడప్పుడూ బహిరంగ ప్రదేశాల్లో దాడులు నిర్వహించి పొగతాగే వారికి జరిమానాలు విధించాలి.
పొగ తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరం
బీడీ, సిగరెట్, చుట్ట తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదకరం. వీటి వల్ల ఏటా ప్రపంచ వ్యాప్తంగా 64 లక్షల మంది మరణిస్తున్నారు. పొగతాగడం వల్ల సీఓపీడీ(క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్), క్యాన్సర్ వస్తుంది. 84 శాతం పొగతాగేవారు సీఓపీడీ వల్ల, 83 శాతం క్యాన్సర్ భారిన పడుతున్నా రు.దీంతో పాటు హార్ట్ ఎటాక్, కడుపు, నోటి క్యా న్సర్ వస్తాయి. పొగతాగడం వల్ల ఆస్టియోపోరోసిస్(ఎముకలు బలహీనపడటం) వస్తుంది. – డాక్టర్ వరప్రసాద్, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment