
సాక్షి, అమరావతి: రాయలసీమ జిల్లాలో గతంలో ఎప్పుడూ లేనంతగా వర్షాలు కురుస్తున్నందున ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు ఆయా ప్రాంతాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు. వరద ప్రభావిత జిల్లాలోని పార్టీ నాయకులతో శనివారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారని పార్టీ మీడియా విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు అధికంగా ఉన్న చోట వాగులు పొంగి, గ్రామాలు నీళ్లలో ఉన్నాయని.. ఈ ఆపద సమయంలో ఇబ్బందిలో ఉన్న వారికి అందరం చేయూతనిద్దామని నాయకులకు సూచించారు. ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు చేయడానికి వేగంగా స్పందించాలని డిమాండ్ చేశారు. వర్షాలకు కూలిపోయే అవకాశం ఉన్న ఇళ్లను అధికారులు ముందుగా గుర్తించి, అలాంటి ఇళ్లలో ఉండేవారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని కోరారు.