సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు ఈ సంవత్సరం కూడా సకాలంలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ప్రభావం రుతుపవనాలపై ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నా అందుకు అవకాశం లేదని వాతావరణ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అకాల వర్షాల ప్రభావం రుతుపవనాలపై ఉండే అవకాశం ఏమాత్రం లేదని అమరావతి వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త కరుణసాగర్ తెలిపారు.
అరేబియా సముద్రంలో తుపాను వస్తే దాని ప్రభావం రుతుపవనాలపై కొంత ఉండే అవకాశం ఉంటుందని చెప్పారు. బంగాళాఖాతంలో వచ్చే తుపానుల ప్రభావం రుతుపవనాలపై ఉండదన్నారు. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళలో ప్రవేశిస్తాయి. ఈసారి కూడా అదే సమయానికి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
వాస్తవానికి రుతుపవనాలు మే నెలలో అండమాన్ నికోబార్‌లో ప్రారంభమవుతాయి. ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను వల్ల వీచే బలమైన గాలులతో అవి ఇంకా ముందే కదిలే అవకాశం కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే రుతుపవనాలు 4, 5 రోజులు ముందుగానే కేరళలో ప్రవేశించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
మంత్రాలయంలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత
మే నెలాఖరు వరకు తీవ్ర ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కర్నూలు జిల్లా మంత్రాలయంలో శుక్రవారం అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా పచ్చవలో 43.3, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కసుమూరులో 43.1, చినఅరికట్లలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment