గుర్రంపై స్వారీ చేస్తున్న చిన్న వెంకటరెడ్డి
బండి ఆత్మకూరు: గుర్రంపై ప్రయాణించడమంటే అదో కిక్కు..దానికి కాసింత ధైర్యం ఉండాలి.. కొన్ని మెలకువలు తెలిసి ఉండాలి. గడివేముల మండలం కరిమద్దెల గ్రామానికి చెందిన అన్నెం చిన్న వెంకటరెడ్డి ఈ విద్యలో ఆరితేరారు. గుర్రంపై వెనక్కి కూర్చొని కూడా ఈయన స్వారీ చేయగలరు. తండ్రి నుంచి మెలకువలు నేర్చుకుని.. వృద్ధాప్యంలో సైతం అందరినీ ఆశ్చర్య పరుస్తూ చల్‌చల్ గుర్రం అంటూ దౌడు తీస్తున్నారు.
చదవండి: నాడు ఫిరంగులకు..నేడు పకోడీలకు ప్రసిద్ధి
తండ్రే ఆదర్శం..
పూర్వం దూర ప్రాంతాలకు వెళ్లేందుకు గుర్రాలను వినియోగించేవారు. యుద్ధాల కోసం రాజులు వీటిని ప్రత్యేకంగా పోషించేవారు. మోటారు వాహనాలు రావడంతో క్రమంగా అశ్వాలను వినియోగించేవారు తగ్గారు. గుర్రుపు స్వారీ తెలిసిన వారు కూడా చాలా అరుదుగా ఉన్నారు. అయితే చిన్న వెంకటరెడ్డి తన తండ్రి బాల వెంకటరెడ్డిని ఆదర్శంగా తీసుకున్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా గుర్రం మీదనే వెళ్తున్నారు. ఈయన 15 ఏళ్ల వయసులో స్వారీ నేర్చుకుని.. ప్రస్తుతం 71 ఏళ్ల ముదిమిలో అంతే ఉత్సాహంగా అశ్వంపై దౌడు తీస్తున్నారు. జిల్లాలో 100 కిలోమీటర్ల దూరం వరకు గుర్రం పైనే వెళ్తున్నారు. తన గుర్రానికి తెలివి ఎక్కువని, ఎవరైనా తాగుబోతులు దారికి అడ్డంగా వచ్చినా, చిన్నారులు రోడ్డుపై నిల్చున్నా వారి మీదకు వెళ్లదని, వేగాన్ని అదుపు చేసుకుంటుందని చిన్న వెంకట రెడ్డి తెలిపారు.
చదవండి: ప్రకృతి అందాల ఖిల్లా.. నల్లమల
ఐదు గుర్రాల మార్పు..
వ్యవసాయం చేసే చిన్న వెంకటరెడ్డి ఇప్పటి వరకు ఐదు గుర్రాలను మార్చారు. నందికొట్కూరులో రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు వీటిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. దౌడుకు ఆడ గుర్రాలు బాగుంటాయని చెప్పారు. ఎక్కువగా గుర్రపు స్వారీ చేసేవారు పంచకల్యాణిని ఇష్టపడతారని, దాని నుదురు, కాళ్లు, తోక భాగాలు తెలుపు వన్నె కలిగి ఉంటాయన్నారు. ఆ తరువాత స్థానం దేవమణి గుర్రానిదని, దీనికి నుదుటన సుడి ఉంటుందని వివరించారు. గుర్రానికి 101 సుడులు ఉంటాయని, అవి ఉంటే ప్రదేశాన్ని బట్టి వాటి ధర ఉంటుందని చెప్పారు.
అలుపు లేకుండా..
ఎంత దూరమైనా ఏ మాత్రం అలుపు లేకుండా గుర్రం మీద వెళ్లవచ్చని వెంకటరెడ్డి తెలిపారు. తన గుర్రంపై ఇద్దరు కూర్చున్నా సాఫీగా వెళుతుందన్నారు. ఆహారంగా పచ్చిగడ్డితో పాటు ఎండుగడ్డి కూడా ఇస్తానని తెలిపారు. జొన్నపిండి వేసి నీళ్లు తాపితే సరిపోతుందన్నారు. ఇంతకు మించి గుర్రానికి ఎటువంటి ఖర్చు లేదన్నారు. ఎంత బురద ఉన్నా, మోకాలిలోతుకు పైగా నీళ్లు ఉన్నా.. గుర్రంపై ప్రయాణానికి ఇబ్బంది లేదన్నారు. అశ్వానికి ఆరోగ్య సమస్యలు వస్తే స్థానిక పశువైద్యుని వద్ద చూపిస్తానన్నారు. సహజంగా గుర్రం 15 నుంచి 20 సంవత్సరాల వరకు జీవిస్తుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment