కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లెఫ్ట్ పార్టీల డిమాండ్
సాక్షి, అమరావతి : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కుట్రలను ఆపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. విజయవాడలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో న్యూ డెమోక్రసీ నాయకుడు పి. ప్రసాద్ అధ్యక్షతన జరిగిన వామపక్ష పార్టీల సమావేశం పలు అంశాలను చర్చించి తీర్మానాలు చేసింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు రకరకాల కుట్రలు చేస్తోందని, ప్రైవేటీకరణను ఆపుతామని ప్రకటించిన తెలుగుదేశం, జనసేన నేతల్లో చిత్తశుద్ధి లోపించిందని తప్పుబట్టింది. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకొచ్చి విశాఖ ఉక్కు పరిరక్షణకు చర్యలు తీసుకోవటంలో సీఎం చంద్రబాబు విఫలమవుతున్నారని నేతలు మండిపడ్డారు.
యురేనియం తవ్వకాలూ నిలిపివేయాలి..
ఇక కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల ప్రాంత గ్రామాల్లో యురేనియం తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని, ఆ తవ్వకాలను నిలిపివేస్తూ ప్రభుత్వం ప్రకటించాలని కూడా వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. రాష్ట్రంలో కృష్ణానది, బుడమేరు, గోదావరి తదితర నదుల వరదలతో నష్టపోయిన బాధితులందరికీ ఇంకా పూర్తిగా సహాయం అందలేదని, ప్రభుత్వ హామీ ప్రకారం ప్రతి ఒక్క వరద బాధితుడికి సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరాయి. ఈ సమావేశంలో వి. శ్రీనివాసరావు, సీహెచ్ బాబురావు (సీపీఎం), కె.రామకృష్ణ, జల్లి విల్సన్ (సీపీఐ) తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment