ఆమె వేషధారణతో కుంభోత్సవంలో రతి,మన్మథుల కొలిచేందుకు వెళ్తున్న భక్తులు(ఫైల్)
ఆదోని: అక్కడ మగవాళ్లు ఆడవాళ్లుగా మారిపోతారు. కట్టు, బొట్టు, మాట తీరు అచ్చం సంప్రదాయ మహిళలను తలపిస్తుంది. నెత్తిపై నైవేద్యంతో నింపిన కుంభాన్ని పెట్టుకుని ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల అనంతరం మళ్లీ తిరిగి ఇంటికి వస్తారు. దారిలో తమకు తెలిసిన, ఇష్టమున్న వ్యక్తులను దూషిస్తారు. ఆ వ్యక్తులు గతంలో చేసిన బండారం అంతా తిట్ల పురాణంలో వెలుగులోకి తెస్తారు. ఇష్టమున్న వ్యక్తులను ఆలింగనం చేసుకుంటారు. దూషణలు, ఆలింగనాలను రతి, మన్మథుల ఆశీస్సులుగా భావిస్తారు.
దీని వల్ల తమ కుటుంబానికి అంతా మంచి జరుగుతోందని విశ్వసిస్తారు. నిష్టతో తమ ఇలవేల్పు రతి, మన్మథులకు మొక్కుబడి తీర్చుకునే క్రమంలోనే వింత ఆచారం కొనసాగుతోంది. కొత్తగా వింత ఆచారం చూసిన వాళ్లకు మాత్రం తరువాత పెద్ద గొడవలే జరుగుతాయోమోనన్న ఆందోళన కలిగిస్తోంది. వందేళ్లకు పైగా ఈ వింత ఆచారం ప్రశాంతంగానే కొనసాగుతోందని రతి, మన్మథుల ఆలయం పూజారి బసవరాజు స్వామి తెలిపారు. సృష్టి కి మూల పురుషులు అయిన రతి, మన్మథులను ఊరంతా ఇలాగే కొలుస్తూ మొక్కులు తీర్చుకుంటారని ఆయన అన్నారు.
నేటి నుంచే వేడుకలు
పాల్గుణ మాసం శుద్ద దశిమిని పురస్కరించుకుని నిర్వహించే వేడుకలు ఆదివారం నుంచి రెండు రోజుల పాటు కొనసాగుతాయి. రెండు రోజుల క్రితం శుక్రవారం నిర్వాహకలు భాజీ భజంత్రీలతో ఇంటింటికి వెళ్లి రంగులు చల్లి వేడుకలకు భక్తులను ఆహా్వనించారు. ఆది, సోమ వారాల్లో గ్రామం నడి బొడ్డున ఉన్న ఆలయంలో కొలువు దీరిన రతి,మన్మథుల విగ్రహాలను పలు రంగుల పూలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆదివారం సాయంత్రం రథోత్సవం జరుగుతుంది.
మరుసటి రోజు సోమవారం ఉదయం 6 గంటలకు కామ దహనం, సాయంత్రం శస్త్ర ధారణ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సందర్బంగా రెండు దవుడలో దబ్బణం గుచ్చిన రంధ్రంలో నుంచి 101 అడుగుల పొడువైన తాడును లాగుతారు. ఆది సోమవారాల్లో సాయంత్రం ఎంతో అందంగా తీర్చి దిద్దిన చిన్ప పిల్లలను విమానం పోలిన వాహనంలో కూర్చోబెట్టి మేళ,తాళాల మధ్య ఊరేగింపు నిర్వహిస్తారు. ఆదివారం రాత్రి ‘వీరభిమాన్య కాళగ’ నాటక ప్రదర్శన కూడ ఏర్పాటు చేసుకున్నారు. వేడుకలను తిలకించేందుకు పలు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారు.
నేను వేషధారణ చేస్తాను
నేను కూడా ఆడవారి వేషం వేస్తాను. ఇది మా ఇంటి ఆచారం. ఎవరైనా ప్రోత్సాహించినా, మనుసులో తిట్టాలని పించినా తిడుతాను. అయితే ఎవరిని, ఏమి తిట్టామో తరువాత గుర్తుండదు. తిట్టించుకున్న వారు కూడ ఎప్పుడూ అడగరు. రతి, మన్మథుల మహిమ ఇది.
– రవి, సంతెకూడ్లూరు
చదవండి:
రాజమహేంద్రవరంలో ‘టక్ జగదీష్’
సుబ్బారావు గ్రేట్.. నారింజ రసం సూపర్
Comments
Please login to add a commentAdd a comment