ఎంపీపీగా ప్రమాణం చేస్తున్న సుబ్బరాయుడు
సాక్షి, నెల్లూరు(పొదలకూరు): ఎంపీడీఓ కార్యాలయంలో అటెండర్‌గా మంచినీళ్లు, టీ మోసిన వ్యక్తి ఎంపీపీగా ఎన్నికయ్యారు. రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్ల వల్ల రోజు కూలీగా జీవనం సాగిస్తున్న వ్యక్తి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాజాగా ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో సుబ్బరాయుడు తండ్రి ఆదెయ్య సుదీర్ఘకాలం అటెండర్‌గా పనిచేశారు. ఆదెయ్యకు ఆరోగ్యం దెబ్బతినడంతో తండ్రి స్థానంలో సుబ్బరాయుడు తాత్కాలికంగా ఆఫీసు సబార్డినేట్‌గా ఉద్యోగంచేసి అధికారుల మన్ననలు పొందారు. 2020 మార్చిలో మహ్మదాపురం గ్రామ పెద్దలు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యుడిగా సుబ్బరాయుడును ఏకగ్రీవం చేయించారు.
విజయలక్ష్మి అకాల మృతితో..
ఎంపీటీసీ ఎన్నికల తర్వాత ఎంపీపీగా ఎన్నికైన ఆర్‌వైపాళెం ఎంపీటీసీ సభ్యురాలు నిమ్మళ్ల విజయలక్ష్మి అనారోగ్య కారణాల వల్ల మృతిచెందారు. దీంతో ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు..
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం మండలాధ్యక్షుని ఎన్నికను ప్రత్యేకాధికారి శోభన్‌బాబు నిర్వహించారు. మహ్మదాపురం ఎస్టీ జనరల్ సెగ్మెంట్ ఎమ్పీటీసీ సభ్యుడు కందుకూరు సుబ్బరాయుడుకు వైఎస్సార్‌సీపీ నుంచి బీ–ఫాం అందింది. దుగ్గుంట ఎమ్పీటీసీ సభ్యుడు రామిరెడ్డి సుబ్బరాయుడును ఎంపీపీగా ప్రతిపాదించారు. మరో ఎమ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసులు బలపరిచారు. దీంతో సుబ్బరాయుడు ఎన్నిక ఏకగ్రీవమైంది. అనంతరం ప్రత్యేకాధికారి సుబ్బరాయుడు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఎంపీడీఓ పీ.సుజాత, ఈఓపీఆర్డీ ఎం.నారాయణరెడ్డి, ఏఓ సుబ్రమణ్యం, వైస్ ఎంపీపీలు వేణుంబాక చంద్రశేఖర్‌రెడ్డి, సోమా అరుణ, జెడ్పీటీసీ సభ్యురాలు తెనాలి నిర్మలమ్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment