సాక్షి, విశాఖపట్నం: ఏ కష్టం వచ్చిందో ఏమో.. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి పద్మనాభంలోని బీసీ బాలుర వసతి గృహం సమీపంలో బుధవారం ఉదయం ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో అమ్మా నాన్న కొడుతున్నారనే భయంతో.. ఓ చిన్నారి ట్రైన్ ఎక్కి పారిపోతుండగా.. ఇటీవలే విశాఖ రైల్వే పోలీసులు పట్టుకొని చైల్డ్ లైన్‌కు అప్పగించారు.
ఈ రెండు ఘటనల్లోనూ పసి మనసులు చివుక్కుమన్న కారణాలే. వీరే కాదు.. అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టారనో.. ఇంటి నుంచి పారిపోతున్న చిన్నారుల సంఘటనలు నిత్యం ప్రతి చోటా తారసపడుతుంటాయి. అసలు పసి మనసుకు ఎందుకింత కష్టం కలుగుతోంది. ఎవరిది లోపం.? పెంచుతున్న తల్లిదండ్రులదా.? వారిని అర్థం చేసుకోలేక అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్న చిన్నారులదా? పసిపిల్లల మనసులో పిచ్చిగీతలు రాయకుండా.. అందమైన అనుభవాల అక్షరాల్ని లిఖిస్తే వారి జీవితం వికసిస్తుందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
మెరుపు మెరిసినా.. వాన కురిసినా.. ఆకాశంలో హరివిల్లు విరిసినా.. తమకే అనుకునే చిన్నారుల ఎదుగుదల గురించి చాలా మంది తల్లిదండ్రులు నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు. ఎందుకంటే అది వారి బాధ్యత. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు అవగాహన లేకపోతే.. నష్టపోయేది పిల్లలే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇదే సమయంలో తమ చిన్నారులకు మితిమీరిన స్వేచ్ఛ ఇవ్వకుండా.. పూర్తిగా కట్టడి చేయకుండా పెంచాల్సిన అవసరం ఉంది. పిల్లలకు ఇష్టం లేకపోయినా.. తమ ఆలోచనలకు తగ్గట్లుగా మసలుకోవాలనుకునే తల్లిదండ్రులు.. ఈ క్రమంలోనే చిన్నారుల మనసుల్ని గాయపరిచేస్తున్నారు.
చదవండి: Health Tips: లేత మాంసం, కోడిగుడ్లు తిన్నపుడు విడుదలయ్యే హార్మోన్ల వల్ల..
మీ పిల్లలు సంతోషంగా ఉన్నారా.?
మీ పెంపకంలో చిన్నారులు సంతోషంగా జీవిస్తున్నారా.? ఈ ప్రశ్నకు సమాధానాన్ని తల్లిదండ్రులే నిశితంగా గమనిస్తే తెలుసుకోగలరు. సంతోషంగా ఉన్న పిల్లలు బాగా నవ్వుతారు. ఆడుకుంటారు. కొత్త వస్తువుల పట్ల కుతూహలం చూపిస్తారు. ఇతర పిల్లలతో త్వరగా కలిసిపోతుంటారు. అంటే మనం ఆడించకపోయినా ఆనందంగానే కనిపిస్తుంటారు. మనసులో ఉత్సాహం, ఉల్లాసం లేని పిల్లలు ఇందుకు పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తుంటారు. ఎదుటివారితో అస్సలు కలవరు. ముభావంగా మాట్లాడతారు. తిండి కూడా సరిగా తినరు. ఏ ప్రశ్నలూ వెయ్యరు. ఇలాంటి వారిని అక్కున చేర్చుకొని వారి ముభావానికి కారణం తెలుసుకొని వారిలో సంతోషం నింపాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. లేదంటే రేపటి పౌరుల జీవితం అగమ్యగోచరంగా మారిపోయే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎదుటి వారితో పోలికెందుకు.?
చాలా మంది పిల్లల్లో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే దానికి ప్రధాన కారణం ఎదుటి పిల్లలతో పోల్చడం. పోలికలోంచే పోటీ తత్వం, పట్టుదల. తపన ఎలా మొదలవుతాయో.. అందులోంచే.. ద్వేషం, కసి, అసూయ, కోపం అనే లక్షణాలూ పెరుగుతాయి. పక్కింటి అబ్బాయి ఎంత చురుగ్గా ఉన్నాడు.? వాడిని చూసి నువ్వు నేర్చుకో.. ఈ మాటలు చాలా ఇళ్లల్లో వినిపిస్తుంటాయి. ఇలాంటి పోలికలు పిల్లలను మానసికంగా కుంగుబాటుకు గురిచేస్తుంటాయి. దాన్నుంచి బయట పడేందుకు మనం ఏం చెయ్యాలని ఆలోచించకుండా.. పదేపదే పోల్చడం, వారిని ఈ విషయంలో కొట్టడం, తిట్టడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది.
మేము బతికుండి ఏం ఉపయోగం అనే స్థితికి వచ్చేస్తుంటారు. అన్ని విషయాలలోనూ నిరాశ నిస్పృహలకు లోనైపోతుంటారు. నలుగురిలో రావడానికి ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంటుంది. ఎదుటి వారితో పోల్చకుండా.. సర్ది చెప్పే ప్రయత్నం చెయ్యండి. మార్కుల విషయంలోనూ చదువు, చురుకుదనం.. విషయమేదైనా.. తన సామర్థ్యం మేరకు కష్టపడుతున్నావంటూ కితాబిస్తూ ఉంటే.. ఏదో ఒకరోజున నంబర్ వన్‌గా మారిపోవడంలో ఎలాంటి సందేహం లేదు.
చదండి: Sridhar Bevara: ఆకలినీ.. అవనినీ.. అవమానాలనూ జయించాడు
మనసెరిగి మసలుకోరు
పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని, వారికి సంతోషాన్ని, ఆనందాన్ని పంచాలని ప్రతి తల్లీ, తండ్రీ భావిస్తారని అనుకుంటాం. కానీ చాలా మంది తల్లిదండ్రులు పిల్లల మనసెరిగి మసలుకోరని ఓ అధ్యయనంలో తేలింది. పిల్లల ఇష్టాలు, అయిష్టాలేంటో తెలుసుకోకుండా తమకు నచ్చిందే పిల్లల మీద రుద్దేస్తుంటారు చాలా మంది అమ్మానాన్నలు. 46 శాతం మంది తల్లిదండ్రులు తమకు నచ్చిందే పిల్లలకు అందిస్తారని తేలింది. 31 శాతం మంది పిల్లలకు నచ్చిందే చేస్తారని ప్లే ఇంట్రెస్ట్ వైజ్ కంపెనీ చేసిన సర్వేలో వెల్లడైంది. 23 శాతం మంది తల్లిదండ్రులు పిల్లలకు నచ్చింది చెయ్యకుండా, తమకు నచ్చిందీ చెయ్యకుండా, చివరి క్షణంలో ఏదో ఒకటి పిల్లలపై రుద్దేస్తుంటారని సర్వేలో తేలింది.
వారి కోసం సమయం కేటాయించాలి
పిల్లలకు ఎన్నో నేర్పించాలనుకుంటాం. కానీ వాళ్లు ఓ పట్టాన వినరు. అలాంటప్పుడు వాళ్ల దారిలోనే వెళ్లి వారికి ఆదర్శంగా నిలిచేలా చూసుకోవాలి. పిల్లలపై మనకు ప్రేమ ఉన్నా.. వ్యక్తం చేస్తే ఎక్కడ మొండికేస్తారో అని ఆలోచించి మౌనంగా ఉండిపోతుంటారు కొంతమంది తల్లిదండ్రులు. కానీ నిపుణులు మాత్రం వాళ్లపై మీకున్న ప్రేమను ఏదో ఒక విధంగా తెలియజేయండని చెబుతున్నారు. పిల్లలతో తరచూ మాట్లాడుతుంటాలి. దాని వల్ల వారి గురించి వీలైనంత ఎక్కువగా తెలుసుకోగలుగుతారు. వారికున్న సమస్యలూ అర్థం చేసుకోవచ్చు. పిల్లలంటే కేవలం చదివించడం, వారికి నచ్చింది కొనిచ్చేయడం, వాళ్ల అభిరుచులను సానబెట్టడం మాత్రమే కాకుండా వాళ్లతో కలిసి ఆడిపాడాలి.
ప్రతి అణువూ నిశితంగా పరిశీలించాలి..
పిల్లల్ని తల్లిదండ్రులు కొట్టడమనేది ప్రతి ఇంట్లోనూ చాలా కామన్‌గా జరిగే విషయం. అయితే ఆ దండనలోనూ తల్లిదండ్రుల ముఖంలో పిల్లలకు ప్రేమే కనిపించాలి తప్ప.. కోపం కనిపించకూడదు. అప్పుడే వారు అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా పెద్ద నిర్ణయాలు తీసుకునే ఆలోచనలు 12 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు వస్తుంటాయి. చాలా మంది పిల్లలు పేరెంట్స్‌పై పగ తీర్చుకోవడానికి వాళ్లకి తెలిసినట్లుగానే ఆత్మహత్యయత్నాలు చేస్తుంటారు. అప్పటి నుంచి తన బిడ్డను తిడితే.. ఏ అఘాయిత్యానికి పాల్పడతాడోనన్న భయంతో పూర్తిగా వదిలేస్తుంటారు చాలా మంది తల్లిదండ్రులు. ఇక్కడే అసలు తప్పు మొదలవుతుంది. అలా కాకుండా నేను ఇంటి నుంచి వెళ్లిపోతా, చచ్చిపోతా అని పిల్లలు అన్నప్పుడే అమ్మానాన్న అలెర్ట్ అవ్వాలి. ఎందుకంటే ఆ పదం వారికి పరిచయం అయ్యిందంటే వారు సంతోషంగా లేరని, ఏదో డిప్రెషన్‌లో ఉన్నారని అర్థం చేసుకొని దాన్ని అధిగమించేలా పిల్లల్ని తీర్చిదిద్దాలి.
– డా.సునీత, మానసిక నిపుణురాలు
Comments
Please login to add a commentAdd a comment